21, జనవరి 2023, శనివారం

వట్టిమాట లెందుకయ్య

వట్టిమాట లెందుకయ్య పట్టాభిరామ చేయి

పట్టి విడువకుంటే చాలు పట్టాభిరామ


సకలలోకములకు నీవు చక్రవర్తివై భక్తు

డొకడు బాధలనుభవింప నొప్పుకొందువా

ఒకనాటికిని నొప్పననుచు నురక జెప్పేవో వచ్చి

చకచక చిక్కలు తీర్చుట గలదో సాకేతరామ


కుమతుల గూల్చు.వాడననుచు గొప్పలు చెప్పేవు వారు

సుమతుల నేర్చుచుండ నురక చూచుచుందువో

శ్రమయనుకొనుక నీవు వచ్చి రక్షణనిచ్చేవో యింక

సమవర్తికిని జంకను నేను సాకేతరామ


తారకనామము చేసిన ముక్తి తథ్యమందువు నిన్ను

కూరిమి తలచువాని కష్టము కూలద్రోయవా

ప్రారబ్ధములు తప్పవనుచు పాటపాడేవో వచ్చి

సారెకు చక్రమడ్డేవో ఓ సాకేతరామ