27, జనవరి 2023, శుక్రవారం

నీనామము పలుక నొల్లని నిర్భాగ్యులతో

నీనామము పలుక నొల్లని నిర్భాగ్యులతో
నేనాడును సాంగత్యము నీయకుమయ్య
 
కలరు కదా లోకమందు ఘనులు సత్యవర్తనులు
కలనైనను నీనామము తలచునట్టి వారు
కలరు కదా లోకమందు తలపులన్ని నీమీదను
నిలిపి చరించెడు వారు నీరేజాక్ష

చక్కగా భాగవతుల సాంగత్యము నీయవయ్య
నిక్కువముగ బాగుపడ నేర్తును గద నేను
మక్కువ నీపైన నున్న మహాత్ముల సాంగత్యము
చిక్కినట్టి వాడికింక చింతలుండునా
 
హరేరామ హరేకృష్ణ యనెడు వారితో గాక
హరిసేవాపరాయణు లగు వారితో గాక
పరమపురుష మూర్ఖుడనై  భ్రష్టబుధ్ధు లగుచు తిరుగు
నరు లితరులతోడ గలియ నాకు పనేమి