31, జనవరి 2023, మంగళవారం

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము


        (కాఫీ)

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము
పాపమైన పుణ్యమైన పరగు నీ కర్తృత్వము

నా వద్ద కీవు వచ్చి న న్నడుగుచున్న దేమి
కావలయు ధనము లని కావలయు పదవు లని
నా విభవమేమి నీవు నాకు లంచ మిచ్చు టేమి
నీవు చేయు పాపములను నేను మన్నించు టేమి

జీవుల స్వాతంత్ర్యమును దేవు డేల హరించును
భావించి మంచిచెడుగులు వర్తించ వలయును
నీవు ప్రకృతివశుడ వైన నేనేమి చేయుదును
కావ మన్న నాడు కద కాపాడ రాగలను

నీ నిజ తత్త్వమును నీవెఱుగక యుండి
నే నుంటినా యని లోన శంకించు టేమి
పూని నేను నాదను బుధ్ధి పోనాడి కర్మము లెల్ల
మాను దేని నీవే నేను నేనే నీ వంతియె రామ