1, జనవరి 2023, ఆదివారం

సరిసాటి యెవరు మా సాకేతరామునకు

సరిసాటి యెవరు మా సాకేతరామునకు
హరి కాని మరి యీత డన్యుడు కాడు

సుర లడిగిరి శ్రీహరీ ధర మీద నరుడవై
చరియించవె రావణుని సంహరించగ
సరియైన సమయ మిది సాటిలేని వీరుడవై
పరమపురుష రాముడవై పరగు మనుచును

హరి వీడు రావణుడో‌ హరిభటుడు పూర్వము
తిరుగులేని మునిశాప తీవ్రత వలన
సురవైరి కులములో జొచ్చి లోకము లెల్ల
హరివైరియై కలచు నన్ని విధముల

హరి గాక రావణుని యణచగల వాడెవ్వడు
నరుడు గాక రావణుని ధరను గూల్చగ
మరి యన్యల వలన గామి నరుడాయె నాహరి
హరిభటు డెఱిగె శాప మంత మంత మగుటను