19, జనవరి 2023, గురువారం

బంతులాడె నమ్మా నేడు

బంతులాడె నమ్మా నేడు భగవంతుడు రాముడు దు
శ్చింతుడైన రావణుని శిరముల నెగిరించుచు

బంగారు కుండలములను బంగారు మకుటములతో
శృంగారమై యున్న చెనటి శిరము లొక్కొక్కటిగ తరిగి
భంగపడి దుఃఖితులైన భామినులకు పగలు దీర
నింగినుండి చూచుచున్న నిఖిల సురగణములు మెచ్చ

ఇంద్రుని గని నవ్విన తల యెగిరె నదే ఇంద్రుడు నవ్వ
చంద్రుని గని నవ్విన తల చక్కగ నెగిరె శశి నవ్వ
చంద్రేద్రాదు లిదె రామచంద్రుని మిక్కిలి పొగడగా యు
పేంద్రుడు బంతులాడగను భీకరుడాయె నసురులకు

ఎగిరిన తలలు పదులాయె నింత లోన నవి వందాయె
తెగిపడు తలలకు సరిపడ తీరుగ శిరములు మొలవగ
జగదీశ్వరుడు రోసమున చకచక నరకుచు నెగిరింప
తగ నవి కొండలుగా భువిని దడదడ రాలుచు నుండగను