25, జనవరి 2023, బుధవారం

కోటిజన్మముల నెత్తును కానీ

కోటిజన్మముల నెత్తును కానీ కొంచెము బుధ్ధియు రానేరాదే

ఎన్నో మారులు ప్రోగిడి విడచిన యీకాసులనే యేరుచు తిరుగును
ఎన్నో మారులు పడిపడి చదివిన యూచదువులనే యింకను చదువును
ఎన్నో మారులు రోయుచు చేసిన యీసంసారమునే తాజేయును
ఎన్నో మారులు చేసినపాపము లేమరిమరియును చేయుచు పోవును

ఎప్పటి వలెనే అల్పములకునై తిప్పలు పడుచును తిరుగుచు నుండును
ఎప్పటి వలెనే దేవత లందర కెన్నో ముడుపులు కట్టుచు పోవును
ఎప్పటి వలెనే చెనటుల స్నేహము లెన్నడు మానక చేయుచు నుండును
ఎప్పటి వలెనే తప్పుల పైనను తప్పులు చేయుచు బ్రతుకుచు నుండును

మాటిమాటికిని నిన్నుమరచును మసలుచు నుండును జడుడై ధరపై
మాటిమాటికిని తారకనామము మరువగ రాదను మాటే‌ మరచును
మాటిమాటికిని ముదిమి మీదబడ మరిమరి రామా నిన్నే తలచును
ఏటికి నీశుభనామము వయసున నెంచడు మనుజుడు దేవా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.