2, జనవరి 2023, సోమవారం

శ్రీరామనామమే చేయండీ

శ్రీరామనామమే చేయండీ మీ

రారూఢిగా మోక్ష మందండీ


వారిజాక్షుల మీద వ్యామోహములు వదలి

భూరిసంపదలపై బుధ్ధినే వదలి

నారాయణుని దయను నమ్మినామని పలికి

ధీరులై ధికృతసంసారులై నిలచి


పరమాత్మపై మనసు పదిలంబుగా నిలిపి

హరిసేవ కన్యంబు నాదరింపకను

మరిమరి హరినామ మాధుర్యమును మరిగి

సరిసిజాక్షుని దయయె చాలనుచు దలచి


యుక్థి కసాధ్యంబు లుండవచ్చును కాని

భక్తి కసాధ్యంబు వసుధపై లేదు

రక్తిముక్తుల గూర్చు రామనామము మీరు

శక్తి కొలదిగ జేయ సాయుజ్యమే నండి