9, జనవరి 2023, సోమవారం

పట్టుకొన్నావా పట్టుకొన్నావా

పట్టుకొన్నావా పట్టుకొన్నావా పట్టాభిరాముని పాదాబ్జద్వయము
గట్టిగ శ్రీరామ పాదంబులను నీవు పట్టుకొన్నావా యిక మోక్షమే

వారి పాదములనో వీరి పాదములనో పట్టుకొంటే బుధ్ధిహీనుండవై
దారిద్ర్యశమనంబు తగినంత నగు నని తలపోసి పొందేది స్వల్పంబురా
ఆరాటపడి కొంత ఆర్జించి భోగించి అతల నెఱసిన పిమ్మటను
శ్రీరామ శ్రీరామ యని దొంగ జపములు చేసిన ఫలమేమి ముందుగనే

దారాపుత్రుల మీద వ్యామోహమును బొంది వారికై మిగుల ప్రయాసపడి
కోరికలను తీర్చ ధారుణి వెలసిన గొప్పయంత్రము వోలె నిత్యమును
ధారాళముగ నిండ్లు వాకిళ్ళు భూముల తళుకుబెళుకు నగల నీనుచును
నోరార శ్రీరామ నామము నేనాడు నుడువక చాకుండ ముందుగనే

కామాదులకు లొంగి భూమిపై చరియించి కడుదుష్టులను చేరి తిరిగితివి
రామనామము మఱచి తిరిగితి వని నిన్ను తామసించి యముడు తిట్టునని
నీ‌మానసము నందు నిశ్చయంబుగ నెఱిగి నిష్ఠగ శ్రీరామ నామమును
ప్రేమతో నిత్యంబు పఠియించుచును నీవు వేడుకతో చాల ముందుగనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.