21, జనవరి 2023, శనివారం

రామగేహినీ నీయానతిని

రామగేహినీ నీయానతిని రయమున తెలుపుము సీతమ్మా
రాముడు రావలె హనుమన్నా యింకేమని చెప్పుదు హనుమన్నా

వినుము రావణుని పరిభవించి రఘువీరుని సన్నిది చేరెదనో
నిను బాధించెడు నీరాకాసుల దునుమి రాముని చేరెదనో
ఘనమగు ఈలంకాపుర శోభను కలచి రాముని చేరెదనో
నిను నా మూపున బహుభద్రముగా మన ప్రభువుకడ చేర్చెదనో

రావణు పరివారమ్మును బలిగొని రాముని సన్నిధి చేరేదనో
రావణు సైన్యము నంతయు బొరిగొని రాముని సన్నిధి చేరెదనో
రావణు పదితల లందున తొమ్మిది రాముని పదముల నుంచెదనో
రావణసహితముగా యీలంకను రాముని పదముల నుంచెదనో

గాలిపట్టి నిజరూపము నిప్పుడు కంటివి చక్కగ సీతమ్మా
ఆలసించ వలదానతి యిచ్చిన నట్లు చేయుదును సీతమ్మా
నీలమేఘస్వరూపుడు రాముడు నేడో రేపో సీతమ్మా
కాలగతికి యీ రావణు బుచ్చును కళవళపడకుము సీతమ్మా