31, జనవరి 2023, మంగళవారం

పొద్దుపోక నేను నిన్ను పొగడేనా

పొద్దుపోక నేను నిన్ను పొగడేనా రామా
వద్దన్నా పొగడకుండ వదలను గాక

పొద్దు పొడవక ముందుగనే పొగడుచును నీగుమ్మము
వద్ద గుమిగూడుదురే బ్రహ్మాదులు
పొద్దుపోక వచ్చువారే పొగడగను వారందరును
వద్దయ్యా దెప్పుడుమాటలు వద్దేవద్దు

వేళాపాళా లేకుండగ వచ్చి పొగడు నారదునకు
కాలక్షేపము కాదనా కమలాక్ష
నీలగళుడు ప్రొద్దుపోక నిన్నుపొగడు చున్నవాడో
చాలునయ్యా పొగడకుండజాలకే కదా

అంతటివారు నిన్ను పొగడు నంతగా నేపొగడలేను
ఇంతవాడ వనుచు తెలియ నెంతవాడ
ఎంతోకొంత నాకు తెలిసినంతగాను పొగడకున్న
అంతేలే ప్రొద్దుపోదని యనుకో నాకు

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.