13, జనవరి 2023, శుక్రవారం

చేసేరు శ్రీరామనామం ఓహో కోసేరుగా భవపాశం

చేసేరు శ్రీరామనామం ఓహో కోసేరుగా భవపాశం

క్రూరరోగంబులను కురిదించి రక్షించి ఆరాట మణచునని నేడే
ఘోరపాపము లెల్ల గొబ్బున ఖండించి భారముడుపు ననుచు నేడే
తారకం బనుపేర ధరమీద మిక్కిలి పేరుపొందిన దనుచు నేడే
శ్రీరామదాసులై సంతోషముగ మీరు చిత్తశుధ్ధిని కలిగి నేడే

పామరంబుగు బుధ్ధిగల మూర్ఖులను కూడ కరుణించు నని తెలిసి నేడే
కామక్రోధములను కడముట్ట తొలగించి కాపాడు నని తెలిసి నేడే
తామసత్వం బుడిపి తత్త్వజ్ఞానము గఱపి దయజూపు నని తెలిసి నేడే
శ్రీమంతులను జేయు ధీమంతులను జేయు ప్రీతిగ నని తెలిసి నేడే

శ్రీరామనామమున చేకూరనట్టి దన క్షితిలోన లేదనుచు నేడే
శ్రీరామభక్తులను సమవర్తి యెన్నడును శిక్షించ లేడనుచు నేడే
శ్రీరామనామమును చేయువారల కెపుడు చింత లుండవనుచు నేడే
శ్రీరాము డొక్కడే మోక్షప్రదాతయని చిత్తంబు లోనెఱిగి నేడే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.