28, జనవరి 2023, శనివారం

ఇంత మంచి నామమని యెఱుగ నైతిని

ఇంత మంచి నామమని యెఱుగ నైతిని
ఎంత పొరబడితిని ఎంత వెఱ్ఱి నైతిని

సదాశివు డెల్లప్పుడు జపియించు నామమట
ముదంబున బోయనైన మునిగా నొనరించునట

నాతినైన కోతినైన నమ్మకముగ బ్రోచునట
ఆతురుడై పలికితే అభయమ్ము నొసంగునట

పాపాటవు లన్నిటిని భస్మమొనరించునట
శాపగ్రస్తు లాశ్రయించ చల్లగ రక్షించునట

మరందమే దీనిముందు మరీచప్పనైనదట
స్మరించితే భవంబునే తరించుటే తధ్యమట

శ్రీరామా నీనామము చేయక పొరబడితిని
ఔరౌరా యెఱుకలేని కారణమున చెడిపోతిని