16, జనవరి 2023, సోమవారం

నీదే యీచిత్తము నిన్నంటి యుండనీ

నీదే యీచిత్తము నిన్నంటి యుండనీ
కాదందువా యిది కలిగి లాభ మేమి

నీయాన మేరకే నేలపై నాడేటి
యూయుపాధిలోన నిది యున్నది కాదా
నీయాట బొమ్మ నీదై నిలువగ దానిలో
పాయక నుండేదిది బాగుగ నీదేగా

పదిమందిలో మాటవచ్చెనో యేడ్చేను
పదుగురు మెచ్చితేను బహు సంతసించేను
పదుగురిలో నిది పాడేది నీపాట
అది మెప్పుపొందితే ఆకీర్తి నీదిగా

రాముడవు నామనో రమణుండవు నీవు
నీ మెప్పు కోరియిది నిన్ను సేవించునని
నీ మనసులో నెఱిగి నియమించుకొన వయ్య
ఈమంచి బొమ్మ ఆట లింపు గొలిపేనయ్య