14, జనవరి 2023, శనివారం

శ్రీహరినే కొలుచు చిత్తమయ్యి యిది

శ్రీహరినే కొలుచు చిత్తమయ్యి యిది 
సాహసించి యితరుల స్మరియించునా

మూడులోకముల జేసి మచ్చటగ పోషించు
వాడు శ్రీహరియైతే వేడ నేల
నేడన్య దైవంబులను నియమమును చాలించి
కాడా కోరికలు తీర్చు ఘనుడు వాడు

సురలు కోరిరని వాడు చొచ్చి తానినకులము
నరుడై శ్రీరాముడాయె సురవైరిని
పరమదుష్టుడైన రావణుని జంపి లోకములు
తరియింప నిచ్చె నంత తనదు నామము

తారకనామము చాలు ధరమీద వారందరు
వారిజాక్షు పదమునకు చేరుకొనగను
శ్రీరామ నామమహిమ శివుడు చాటిచెప్పెను
చేరనేల నాకన్యుల సిగ్గువిడచి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.