30, జనవరి 2023, సోమవారం

మౌనస్వామివిరా నీవు హరి

మౌనస్వామివిరా నీవు హరి మాతో నెన్నడు మాటాడవురా

పోనీలే నీచల్లనిచూపులు భూరికృపామృతవర్షముతో
పూని వచించెడు నభయవాక్యములు పురుషోత్తమ హరి సర్వేశా

పోనీ వయ్యా నీదగు త్రిభువనమోహనకరదరహాసమ్మే
దీనత నీకెన్నడు రాదనుచు తెలుపుచు నుండును రఘురామా

పోనీలే నీవరదాభయకరముద్రలు యోగక్షేమములు
మానక మేమే చూచెద మనుచును మాతో పలుకుచు నుండునులే

పోనీలే నీపదనఖతేజఃపుంజములే మము పొదవుకొని
నీ నిజతత్త్వము నెఱుకపరచుచు నిత్యము మాతో‌ పలుకునులే

పోనీలే నీనామస్మరణము మానక యుండిన నొకనాడు
నీనివాసమున సంతోషముగా నీతో ముచ్చట లాడుదులే