13, జనవరి 2023, శుక్రవారం

ఎత్తిన జన్మములు చాలు నేడ్చిన యేడుపులు చాలు

ఎత్తిన జన్మములు చాలు నేడ్చిన యేడుపులు చాలు
కొత్తది మరియొక్క తనువు గొనమని కోరకుమయ్యా

భూమిపైకి వచ్చుటయును బుధ్ధిలేక తిరుగుటయును
కామాదుల పాలబడుచు కడుదుష్టుడ నగుటయును
రామయ్యా అవుసరమా రక్షించుము దేవదేవ
ఆమోక్షము నందించుము అదే నాకు చాలునయా

రామభక్తు డయ్యు నొకడు సామాన్యుండెట్లగురా
రామనామము చేసియును పుట్ట నేల మరల మరల
భూమినిట్లే పుట్టిచచ్చు నీమము సడలింపనిదే
రామనామ మేల నయ్య రామభక్తి యేలనయా

ఒక రాతిని నాతిజేసి ఒక కోతిని బ్రహ్మ చేసి
ఒక పక్షికి మోక్ష మిచ్చిన ఓ రామచంద్రప్రభూ
ఒక భక్తుని మొఱలు వినక యూరకుండరాదు కదా
ఇక చాలును మోక్షమును ప్రకటించుము నాకిపుడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.