16, జనవరి 2023, సోమవారం

రామదాసుల మండీ

రామదాసుల మండీ మాకండీ రాముడొకడే దైవ మండీ మేము
ప్రేమతో శ్రీరామ నామమే చేయుచు భూమిపై తిరిగెద మండీ

ప్రాకటంబుగ సర్వలోకంబులను జేసి పాలించు శ్రీహరి యండీ
లోకరక్షణ కొఱకు కరుణతో శ్రీరామరూపంబు దాల్చినాడండీ

శ్రీరామనామమే స్మరియించు సజ్జనుల చేరువలోనుందు మండీ
సారసాక్షుని రామనామవైభవమును చాటించుచుండెద మండీ

మది నుంచి పదిమంది దైవంబులను గొలువ మాకేమి పిచ్చి యటండీ
విదితంబుగా సర్వభూతాత్మకుడు రామవిభునే కొలుచు వార మండీ

బహుదేవతలు వద్దు బహుపూజలును వద్దు బహుమంత్రములను వద్దండీ
బహుళమైతే శ్రధ్ధ బాగుపడునది లేదు భావించి రామా యనండీ

శ్రీరామ శ్రీరామ యనువారి కేనాడు చీకుచింతలు కలుగవండీ
శ్రీరామ నామస్మరణముచే నందరును చెందవచ్చును మోక్షమండీ

ఈమాట నమ్మండి యేనియమములు లేని ఈరామమంత్రమే‌ నండీ
కామితార్ధము లిచ్చు మోక్షమ్ము నందించు కాదనక చేసిచూడండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.