13, జనవరి 2023, శుక్రవారం

రామచంద్ర రామచంద్ర రవికులాబ్ధిపూర్ణచంద్ర

 
రామచంద్ర రామచంద్ర రవికులాబ్ధిపూర్ణచంద్ర
ఏమి చెప్ప మందువయ్య ఇంతకు మించి

ఏమి జపములు చేయగలను ఏమి తపములు చేయగలను
రామచంద్ర మంత్రదీక్ష లేమి పొందని వాడ నైతిని

ఏమి పూజలు చేయగలను ఏమి వ్రతములు చేయగలను
రామచంద్ర అట్టి విధము లేమి యెఱుగని వాడ నైతిని

ఏమి రూపము నెన్నగలను ఏమి వర్ణన చేయగలను
రామచంద్ర నీవు నాకు మోము నెన్నడు చూప లేదే

ఏమి భావన చేయగలను ఏమి తత్త్వము తలపగలను
రామచంద్ర నేను నీదు నామ మొకటే తెలుసుకొంటిని

ఏమి వరములు కోరగలను ఏమి బ్రతుకులు బ్రతుకగలను
రామచంద్ర ఐహికంబు లేమి వలదని పలుక నేర్తును

ఏమి నిన్ను కోరుకొందును ఏమి పొందిన తృప్తిగలుగును
రామచంద్ర నీదు పాదసీమ నుండుట కోరుకొందును