31, జనవరి 2016, ఆదివారం

శ్రీరఘురాముని కొక అంబురుహము.        అంబురుహము.
        శ్రీరఘురాముని చిన్మయరూపము చిత్తమందు రహించగన్
        శ్రీరఘురాముని తారకనామము జిహ్వపైన నటించగన్
        నారకబాధలు తీరగ శ్రీరఘునాథుడే కరుణించగన్
        శ్రీరఘురాముని చేరిన జీవుడు శీఘ్రమే తరియించురా

      అంబురుహము.

ఈ అంబురుహవృత్తానికి గణవిభజన భ-భ-భ-భ-ర-స-వ. గురులఘుక్రమం UII UII UII UII UIU IIU IU. అంటే‌ పాదానికి ఇరవై అక్షరాలన్నమాట. 13వ అక్షరం యతిస్థానం.

అంబురుహవృత్తాన్ని తిక్కన్నగారు స్త్రీపర్వంలో వాడారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారు తమ రామాయణంలో వాడారు. ఇంకా వేరే కవులెవరన్నా వాడారేమో.

నాకైతే ఈ వృత్తపు నడక కొంత వింతగా అనిపిస్తుంది యతిస్థానానికి ముందున్న నాలుగు భ-గణాలతోరణమూ ఒక రగడలాగా ధ్వనిస్తుంది. యతిస్థానం నుండి నడక మారిపోయి అదేదో ఉత్పలమాల వంటిదాని నడకలోనికి వస్తుంది. అతుకు కనిపించకుండా సాఫీగా నడిపించటంలోనే‌ కవికౌశల్యం‌ కనిపించాలి.

ఎందులోనిదో తెలియదు కానిఒక అంబురుహవృత్తం కనిపిస్తోంది.

    దేవకులార్చితదేవశిరోమణిదేవదేవజగత్రయీ
    పావనమూర్తికృపావనమూర్తివిభావనాకులచిత్తరా
    జీవబుధవ్రతజీవదశాపరిచేష్టితాఖిలలోకల
    క్ష్మీవదనాసవశీతలసౌరభసేవనాంచితజీవనా


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.