1, జనవరి 2016, శుక్రవారం

క్రొత్త సంవత్సరం - క్రొత్త పరిస్థితులు - క్రొత్త నిర్ణయాలు

చక్రనేమి క్రమం అని ఒక మాట అంటూ ఉంటారు. ఈ చక్రనేమి అంటే అర్థం బండి చక్రం అంచు. ఇంగ్లీషు భాషలో రిమ్‌. ఒక చక్రం తిరుగుతూ ఉంటే ఎం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని అంచుమీద ఉన్న ప్రతిబిందువూ పైనుండి క్రిందికీ అక్కడి నుండి పైకీ మరలా క్రిందికీ‌ ఇలా తిరుగుతూ ఉంటుంది.

ఈ చక్రనేమిక్రమ న్యాయాన్ని అనుసరించి రోజుకు నాలుగుసంధ్యలూ వచ్చి పోతూనే ఉంటాయి. అలాగే వారాలూ పక్షాలూ మాసాలూ సంవత్సరాలూ కూడా వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి. రోజూ‌ షష్టిఘడియలు వచ్చి పోతున్నట్లే‌ క్రమంగా షష్టిసంవత్సరాలూ వచ్చిపోతుంటాయి

ఇంగ్లీషువాడి లెక్కప్రకారం సంవత్సరాలు తిరిగి రావటం అన్నది సంబధ్ధం కాకపోవచ్చును కాని భారతీయ కాలమానం అంతే.  మన లెక్క ప్రకారం సంవత్సరచక్రంలో అరవై పేర్లున్నాయి. ఆయా పేర్లు కల సంవత్సరాలు అరవై యేళ్ళకు ఒకసారి మరలా రాకతప్పదు. వచ్చిన సంవత్సరం మరుచటి దానికి చోటిస్తూ తప్పుకోకా తప్పదు.  అసలు మన శాస్త్రాల  ప్రకారం సంవత్సరాలేమి కర్మం యుగాలూ‌ మహాయుగాలూ‌ మన్వంతరాలూ సర్గాలూ‌ చివరకు ఈ‌ సృష్టి మొత్తం ఇలా వచ్చిపోతూ ఉండే వ్యవహారమే.

కదలుతున్న ఒక బండిచక్రం కేసి చూస్తే ఏం కనిపిస్తోంది? దాని ఆకుల్లో ఒక ప్రక్క నున్న ఆకులు పైనించి క్రిందికి దిగుతూ ఉంటే మరొక ప్రక్క నున్న ఆకులు క్రిందినుండి పైకి లేస్తూ ఉంటాయి. ఈ ఉథ్థాన పతనాలు ఎంత సహజమంటే మనకి అవేమీ‌ వింత విషయాలుగా ఎప్పుడూ‌ అనిపించవు.

జీవితగమనంలో మన శైశవానికి సంబంధించిన ముచ్చట్లను మరొకరు చెబితే కాని సాధారణంగా మనకు తెలియవు. నా అదృష్టమో‌ దురదృష్టమో నా శైశవానికి సంబంధించిన అనేకవిషయాలు కూడా నాకు పరోక్షప్రమాణాపేక్ష లేకుండానే తెలుసును. అందరి జీవితంలోనూ బాల్యకౌమారయౌవనాది అవస్థలూ ముసలితనపు అవస్థలూ క్రమంగా అనుభవంలోనికి వస్తూ ఉండటం అందరికీ‌ తెలిసినదే. ఈ క్రమం‌ ఉథ్థానమా పతనమా అన్నదే అలోచనీయం.  లబించే సమాధానం అన్నది చూచే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

ఒక కోణంలో భూపతనం అన్నది ఉథ్థానప్రారంభం అనుకోవచ్చును. అక్కడి నుండి జీవనచక్రపుటాకులు పైకిలేవటం‌ మొదలు ఒక మధ్యవయస్సు రాగానే పతనదశాప్రారంభం అనుకోవాలి.  చివరకు భూశయనంతో ఒక జీవనపు ఆవృత్తి ముగుస్తున్నది. అప్పుడేమి జరుగుతోంది?

బండిచక్రం ఆకు క్రిందినుండి ప్రయాణం‌ ప్రారంభించి పైకి వచ్చి మరలా క్రిందికి యధాస్థానానికి రాగానే అక్కడ పాతుకుపోతోందా? లేదు కదా. మరలా ఆ ఆకు ప్రయాణం మొదలు క్రిందినుండి పైకి మరలా.

అలాగే ఒక జీవుడి ఒక్కొక జీవితయాత్రనూ‌ ఒక బండిచక్రపుటాకు ప్రయాణచక్రంతో పోల్చుకోవాలన్నమాట.

ఈ‌ కాలం‌ అనేది బండిచక్రంలా తిరుగుతోందని పిస్తుంది చంద్రకళలతో ఏర్పడుతున్న తిథుల్నీ ఋతుచక్రాన్ని చూస్తుంటే. ఈ‌ జీవితాలే బండిచక్రాల్లా తిరుగుతున్నాయని అనిపిస్తుంది తాత్త్వికదృష్టితో చూస్తే.

అందుచేత కాలెండరులో ఒక సంవత్సరసంఖ్య మారినంత మాత్రాన ఆనందోత్సాహాలతో చిందులువేయటం అనవసరం అని అనిపిస్తోంది నాకైతే.

ప్రయాణం‌ అన్నాక అది సంతోషాన్నిచ్చే చోటికే మనలను చేర్చుతుందని నమ్మకం ఏమీ‌లేదు. అలా కావాలన్న కోరిక సహజం అంతే.  జీవితం‌ అనేది ఒక జీవుడనే వాడి నౌక కాలనదిలో చేస్తున్న ఒక దీర్ఘప్రయాణం అది సంతోషతీరాలనూ చూస్తుంది, శోకాలసుడిగుండాలనూ‌ చూస్తుంది. ముందుముందు ఆ నౌక ప్రయాణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఎన్నడూ.

బుధ్దివాది తన నౌకకు తానే కర్ణధారిని అంటాడు. కర్ణ్దధారి అంటే  ఇంగ్లీషులో కెప్టెన్ అన్నమాట. అథ్యాత్మవాది తన నౌకకు కర్ణధారి భగవంతుడు అంటాడు. ఏ వాదం సరైనదీ? అథ్యాత్మవాది నిజానికి రెండూ ఒకటే నంటాడు. అదెలాగు అంటే‌ అథ్యాత్మవాది దగ్గర సిధ్ధంగా ఉండే‌ సమాధానం ఒకటే, నా బుధ్ధిని ప్రచోదనం చేసేది భగవంతుడు. అయన నడిపించటానికి నాకు ఇచ్చిన బుధ్ధీ శక్తీ అన్నవి ఆధారంగానే నా నౌకను నడపుకొంటున్నాను అన్నది ఆ సమాధానం. భగవంతుడితో‌ సంబంధబాంధవ్యాల ప్రసక్తిపై ఆసక్తిలేని బుధ్ధివాది దగ్గరా ఒక సమాధానం ఉంది. భగవంతుడు ఉంటేనేం లేకుంటేనేం? నా బుధ్ధి నాకు విఙ్ఞానాన్ని ఇస్తే అది నాకు వివేకాన్ని ఇచ్చింది. అది నా జీవితనౌకను నడిపేందుకు నాకు తోడ్పడుతోంది అని. మరి బుధ్ధివాది బుధ్ధిని ప్రచోదనం చేస్తున్నది ఏది అంటే ఆతడు పరంపరానుగతభౌతికవిఙ్ఞానమూ దానిపై తన అభ్యాసమూ‌ అంటాడు. ఆథ్యాత్మవాది పరంపరానుగతమైన అథ్మాత్మవిఙ్ఞానం అంటాడు. ఇక్కడి నుండి ఎవరి వాదన వారిది, ఎవరి దారి వారిది. ఒకడు భగవంతుణ్ణి తిడతాడు మరొకడు బుధ్ధివాదిని తిడతాడు. రెండుచోట్లా సాధారణ కారణం ఉక్రోషమే.

దారి చూపేది ఒక నిర్జీవమైన శాస్త్రమో పుస్తకమో అనుకోవటంలో కొందరికి భరోసా ఉండదు. వారికి సచైతన్యమైన శక్తి తమకు తోడుగా ఉన్నట్లు భావించుకోవటంలో ఒక తృప్తి ఉన్నది, ఒక గొప్ప భరోసా ఉన్నది. ఈ‌ మాటలు అందరికీ‌ నచ్చకపోవచ్చును కాని ఇలా ఆలోచించటమే‌ తప్పు అని వాదించకూడదని నా అభిప్రాయం.

నాకు నా రాముడిపై నమ్మకం. నా బుధ్ధి తెలిసినప్పటినుండీ నన్ను రాముడే నడిపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అని అనుకోవటం‌ నాకు వ్యక్తిగతంగా చాలా మనస్థైర్యాన్ని ఇచ్చే‌ సంగతి. అది తప్పా ఒప్పా అన్న చర్చ అసంగతం. నా నమ్మకం నాది. మరొకరికి నచ్చాలని లేదు.

అందుచేత నా యీ శ్యామలీయం బ్లాగులో బోలెండత సాహిత్యం రాములవారిపై వ్రాసుకున్నాను. ఇంకా వ్రాస్తూనే ఉన్నాను. అది నచ్చే వారికి నచ్చుతుంది.వారికి నా స్వాగతం ఎప్పుడూ ఉంటుంది. నా దృక్కోణం‌ నచ్చని వారితో నాకు పేచీ లేమీ‌ లేవు. వారు నా శ్యామలీయం‌ బ్లాగును ఉపేక్షించటం పట్ల నాకు అసమ్మతి ఏమీ ఎప్పుడూ ఉండదు.

ఈ మధ్యకాలంలో నేను రామస్తుతిపరంగా రచనలను నా బ్లాగులో వ్రాసుకోవటం‌ పైన కొద్ది మంది అసమంజసంగా స్పందించటం‌ జరిగింది. కేవలం‌ నాకు గ్లాని కలిగించటం కోసం కొన్ని మాటలూ, రామనింద చేయటం ద్వారా మరింతగా నాకు గ్లాని కలిగించే‌ మాటలూ వగైరా వినిపించాయి. చాలా అవశ్యపరిహార్యాలైన వ్యాఖ్యానాలు చర్చలూ నడిచి నాకు మనఃక్షోభను కలిగించాయి.

నేనుకూడా  ఈ రామనిందను అడ్డుకోవాలని ప్రయత్నించటం ద్వారా మరింతగా రామనిందకు దారిచూపిన వాడిని అయ్యానని అనిపిస్తోంది. ఇది కేవలం‌ నా తెలివితక్కువ తనం.

ఈ‌ సంవత్సరంలో నన్ను అమితంగా బాధించిన మరొక విషయం, అందరికీ తలలో నాలుకగా ఉండే ఒక బ్లాగరు అశ్లీలపదజాలంతో వచ్చిన ఒక దుందుడుకు వ్యాఖ్యకు తానూ అదే భాషలో సమాధానం చెప్పటం. ఈ సంఘటనను నేను ఎంతమాత్రమూ ఉపేక్షించలేను. అందుచేత ఒక బాధా కరమైనదైనా ఒక నిర్ణయం తప్పలేదు. వారి వ్యాఖ్యలను ఇకపై  శ్యామలీయం‌ బ్లాగులో అనుమతించకూడదని నిర్ణయించుకున్నాను. ఒక సంవత్సరకాలం తరువాత పరిస్థితిని బట్టి పునరాలోచన చేయవచ్చును. వారు కూడా సహృదయంతో‌ అర్థంచేసుకోగలరని ఆశిస్తున్నాను.

గత కొన్నాళ్ళుగా బ్లాగుల్లో వాసి రాశి రెండూ తగ్గటం గమనిస్తున్నాం అందరం. అంతకంటే ముఖ్యంగా వ్యాఖ్యల్లో ఉపయోగించే‌ భాష బాగుండటం లేదు.  సముదాచారాన్ని వ్యాఖ్యాతలు చాలా మంది ఎంతమాత్రమూ‌ లెక్కచేయటం లేదు.  బహుశః అగ్రిగేటర్లను నడిపే వారు కూడా బ్లాగులోకపు దిగజారుడు కారణంగా క్రమంగా తప్పుకుంటున్నారేమో‌ అనిపిస్తోంది. ఈ‌ పరిస్థితికి పరాకాష్టగా జరిగిన పై సంఘటనను నేను ఎంతమాత్రమూ ఉపేక్షించలేను. అగౌరవంతో కూడిన భాషా భావవ్యక్తీకరణలూ ఉన్న వాగ్యుధ్ధాలమధ్యన నా పేరుతో కూడా కొన్ని వ్యాఖ్యలు అచ్చులో కనబడటం ఇంక నాకు ఎంత మాత్రమూ సమ్మతం కాదు. అందుకే ఇకపై శ్యామలీయం పేరుతో నా వ్యాఖ్యలు ఎక్కడా చేయను. మినహాయింపు కేవలం‌ నా బ్లాగులో నేను ఇచ్చే‌ జవాబులు మాత్రమే. ఈ‌ నిర్ణయం ఈ‌రోజు నుండే అమల్లోనికి వచ్చింది.

అలాగే కొంతకాలంగా నా పట్ల అగౌరవ‌ం చూపుతున్న కొందరి వ్యాఖ్యలను శ్యామలీయం‌ బ్లాగులో అనుమతించకూడదనీ నిర్ణయించుకున్నాను. ఒకాయన తన ఒక వ్యాఖ్యలో నన్ను గౌరవించను అని ప్రకటించాడు ('గారు తీసేశాను' అన్న వ్యక్తీకరణ అర్థం అదేకదా!) ఒకరు నన్ను ఎద్దేవాచేయటం‌ కోసం‌ నిరంతరం యత్నిస్తుంటారు. మరొకరు నన్ను ఎమోషనల్  బ్లాక్ మెయిలర్ అన్నారు. ఒకరు నేను బ్లాగు వ్రాయటం‌పట్ల అభ్యంతరమూ వ్యక్తం చేస్తారు! ఇలాంటి వారు నా బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసినా నేను వాటిని సాధారణంగా పరిగణనలోనికి తీసుకోను. అలాకాక ఉదారంగా ఉండవవలసిన అవసరం ఉందని అనుకోలేను. వీరి వ్యాఖ్యలకు తావు ఇవ్వటమూ, తద్వారా వివాదాలకూ విచారకరపరిణామాలకూ‌ అవకాశం ఇవ్వటం‌ నాకు ఎంతమాత్రమూ సమ్మతం‌కాదు కాబట్టి ఈ‌ నిర్ణయం తప్పటం లేదు.

వా అసంపూర్ణరచనలను పూర్తిచేయటమూ, నా వద్ద బహుకాలంగా వాయిదాపడుతున్న కొన్ని వెంటనే వ్రాయటం‌ మొదలు పెట్టటమూ కూడా నా ముఖ్య నిర్ణయాలే. వీటికి అడ్దురాగల వ్యాసంగాలకు దూరంగా ఉండక తప్పదు. నాకు రోజులో నా సాహిత్యవ్యవసాయానికి దొరికే చాలా స్వల్పసమయాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలన్నదే నా తాపత్రయం.

నా కృషిని అందరూ‌ మెచ్చాలని నేను పట్టుబట్టటం లేదు. అలా ఆశించటం దురాశ అని నాకు బాగానే తెలుసు. నిన్ననే నేను ఆత్మీయులొకరి నోటనే 'నువ్వు చేస్తున్న బోడి పని ఏమిటో తెలుసులే' అన్న వాక్యం కూడా వినటం‌ తటస్థించింది. నేను నిబ్బరంగానే ఆ మాటలను ఆలకించగలిగాను. నేను చేస్తున్న పని ఏమిటో రాముడికి తెలుసు. కాలానికి తెలుసు. ఎవరికో‌ అర్థం కాకపోయినా ఎవరికో నచ్చకపోయినా నాకేమీ‌ ఇబ్బంది లేదు. ఇలా అనుకొన కలుగుతున్నాను కాబట్టే నా మనస్సు ప్రశాంతంగా ఉంది. అందుకే నిన్నను విన్న అధిక్షేపవాక్యాన్ని నిరుద్వేగంతో అలకించి ఊరకోగలిగాను.

నాకు ఇంకా ఎంత సమయం ఉందో‌ తెలియదు. ఉన్నది సద్వినియోగం‌ చేసుకోవాలన్న ఆత్రుత తప్ప పెద్దపెద్ద ఆశలేమీ‌ లేవు. నా సాహిత్యకృషిని  ప్రోత్సహిస్తున్నవారి కందరికీ నా అనేక వందనాలు. నా సాహిత్యకృషిపట్ల ఆదరభావంలేని వారికొక విన్నపం - నా మానాన నన్ను బ్రతకనివ్వండి, మీకూ‌ అనేక వందనాలు అని.



7 కామెంట్‌లు:

  1. మాస్టారూ, నాదొక్క మనవి. వ్యక్తిగత దూషణలకు పోకుండా చర్చాంశం మీద మాత్రమె దృష్టి సారించే వ్యాఖ్యలు ఎవరివి అయినా ప్రచురిస్తే బాగుంటుంది. బ్లాగు మీది కనుక తుది నిర్ణయం కూడా మీదే.

    మీకు మీ కుటుంబీకులకు నూతన వర్ష శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ ఉంచే నా రచనలు సాధారణంగా అథ్యాత్మికం‌. అయా టపాల విషయాలకు సంబంధించి ఎవరి వ్యాఖ్యలనైనా ప్రచురించాలన్నదే నా అభిమతం కూడా.

      కాని అనుభవంలో అదంత సులభం‌ కాదని తేలింది. చర్చలకు నేను సాధారణంగా సుముఖంగా ఉండకపోవటానికి కారణం నాకు అందుకు ఆసక్తీ తీరికా లేకపోవటం‌ అనేని కారణాలు కావటంతో‌ పాటు రంధ్రాన్వేషణాతత్పరుల ధోరణులూ కారణాలే. నా బ్లాగులో యుధ్ధాలకు తావులేదు. సాహిత్యచర్చలు అర్థవంతంగా క్లుప్తంగా ఉండేంత వరకూ‌ సబబే.

      మరొక విషయం, ఈ‌ టపాలో వివరించినట్లుగా కొందరు నా పట్ల కనబరిచచే అకారణవైరధోరణులు వారి వ్యాఖ్యలను ప్రచురించటానికి అడ్డుగా ఉంటున్నాయి. అనుభవం నేర్పిన పాఠం ప్రకారం‌ అడుసు త్రొక్కనేల అన్నట్లవుతున్నది తరచు. అందుకే కొందరి వ్యాఖ్యలను ప్రచురించలేను. ఐనా ఆచితూచి ప్రచురిస్తూనే ఉన్నానన్నదీ‌ మీరు గమనించాలి.

      జిలేబీ గారి బాధ్యతారహితమైన వ్యాఖ్య కారణంగా అవిడ వ్యాఖ్యలను తిరస్కరించక తీరదు. అవిడ ఈ‌ టపాకు స్పందిస్తు తాను స్త్రీకాబట్టే వివక్ష అనటం జరిగింది. అది పొరపాటు అభిప్రాయం. నా యీ‌ బ్లాగు నాకు పూజాగృహం వంటిది. అందుచేత ప్రమాణాల విషయంలో రాజీపడదలచుకోలేదు. మన్నించాలి అందరూ.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. పోనీ‌ అలాగే అనుకోండి. ఉన్నతప్రమాణాలను పాటించటం అనేది అవసరం. అటువంటి వారి వ్యాఖ్యలను బ్లాగర్లు వదులుకోలేరు కూడా. దయచేసి ఆ దృష్టితో కూడా అలోచించగలరు.

      తొలగించండి
  3. తెలుగు బ్లాగర్లు ఎందుకిలా అయిపోయారు ... ఒకరి ఉన్నతిని కాంక్షించలేని వారుగా, ఒకరి స్వేచ్చకు అడ్డుతగిలేవారుగా .. ప్రతీదాన్నీ విమర్శించేవారుగా.. కాస్త సహనంతో, ఆలోచనా దృష్టితో ఉండండి బ్లాగార్లలారా ఎదుటివారిపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే కొంతమంది యొక్క సహజ అలవాటును మిగతావారు ఎందుకు నేర్చుకోవాలి ?
    ఇలా ఐతే తెలుగు బ్లాగులు ఉండవనేది సత్యం .
    ఇలా విమర్శించేవారు ఒకసారి హిందీ, ఇంగ్లీష్ బ్లాగుల్లోకి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని రండి .
    గురూ గారూ ! మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @తెలుగు బ్లాగర్లు ఎందుకిలా అయిపోయారు?

      haribabu:
      ఒక తేలుగు రాష్త్రం రెండుగా విడిపోవటం.
      మామూలుగా విడిపోలేదు కదా!

      పై స్థాయిలో రెచ్చగొట్టి తిట్టించిన వాల్ళు ఇవ్వాళ రెండు చోట్లా అధికారం పీఠం దక్కించుకుని శంకుస్థాపనలకీ యాగాలకీ ఒకరినొకరు ఆప్యాయంగా ఇల్చుకుంటూ హ్యాపీగా ఉంటే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయిన పిచ్చిపుల్లయ్యలు మాత్రం ఇంకా హ్యాంగోవరులోనే ఉన్నారు.తిట్టడమ అనే దురల్వాటు అంత తొందరగా పోదు కదా,మిగతావాటికీ అంటుకుంది.

      నిన్న తెలంగాణా వాళ్ళు చహైంది ఇవ్వాళో రపో మళ్ళీ రాయలసీఅం వాళ్ళు మొదలుపెదతారు.వాళ్ళు దైరెక్టూగా ఆంధ్రోళ్ళు అనీ "రెండున్నర జిల్లాలోళ్ళు" అనేస్తే వీళ్ళూ కొంచెం మొహమాటంగా "అధిపత్య ప్రాంతం వాళ్ళు" అంటున్నారు ఇప్పుడు.రేపటి కల్లా మళ్ళీ ఆంధ్రా-తెలంగాణా బూఒతుల ప్రవం ఆంధ్రా-సీమ మధ్య మొదలవుతుంది.

      చక్రనేమి అంటే చేసిన తప్పులనే మరోసారి చేస్తూ ఉండటం,కదా!
      ఆత్మనిగ్రహం లేనిది ఏదీ రాదు,కానీ ఆ మాటే బూతు కొందరికి?

      తొలగించండి
    2. హరిబాబుగారు రాజకీయప్రస్తావనలు చేసారు. బ్లాగర్లు రాజకీయకారణాల వలన తిట్టుకుంటున్నారా అన్నది వేరే విషయం. ఇంకా ఇతర కారణాలూ‌ ఉండవచ్చును. ఐనా ఈ‌ బ్లాగు రాజకీయసంబంధమైన చర్చలకు వేదిక కాదు, కాబోదు. కాబట్టి దయచేసి ఈ సంగతి గురించి తదుపరిగా వ్యాఖ్యలు అంగీకరించబడవని అందరూ గ్రహించాలని మనవి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.