3, జనవరి 2016, ఆదివారం

శ్రీరామచంద్రిక


     చంద్రిక.
     నరుని బ్రతుకు నాటకం‌బుగా    
     నరసి విరతు డాశ్రయించు నీ
     పరమశుభదపాదపద్మముల్
     సరసహృదయ జానకీపతీ
చంద్రిక.

ఈ చంద్రికావృత్తానికి గణవిభజన న - న - ర - వ. యతిస్థానం 7వ అక్షరం.  నడక ప్రకారం ఈ‌చంద్రికావృత్తానికి గణ విభజనను న-న-హ-హ-గ అని చెప్పటం సబబుగా ఉంటుంది.

ఈ వృత్తానికి  సుభద్రిక, భద్రిక, అపరవక్త్ర ,ప్రసభ అనే  పేర్లుకూడా ఉన్నాయని ఛందం పేజీలో‌ కనిపిస్తోంది. ఈ వృత్తాన్ని అనంతుడు భద్రక అనీ‌ చంద్రిక అనీ‌ పిలుస్తారని చెప్పాడు.

వేరొక వృత్తం, గణవిభజన న-న-త-ర-గ ఉండి యతిస్థానం 8వ అక్ష్రరంతో ఉన్నదానికి కూడ  చంద్రిక అన్న పేరున్నట్లు ఒక నరసింహ బ్లాగు పేజీలొ కనిపిస్తోంది.

ఈ చంద్రికావృత్తానికి  ఛందం పేజీలో‌ పేజీలో‌కనిపిస్తున్న ఉదాహరణ:

    ఇతఁడు నలుఁడ హీన మూర్తియా
    యతన మఖిల మైన శూరక
    ర్మతతికి సరి రాదు వీనికిన్
    క్షితి శతశతసేనయైననున్

వృత్తాల మధ్య తరచు పోలికలు ఉంటూ‌ ఉండటం‌ గమనించాలి మనం. ఈ‌ చంద్రికావృత్తానికీ మొన్న చెప్పుకున్న ప్రముదితవదన వృత్తానికీ చాలా పోలిక ఉంది.  ప్రముదితవదనకు గణవిభజన న-న-ర-ర ఐతే ఈ‌ చంద్రికకు గణవిభజన న-న-ర-వ. అంటే చివరి గణం ఒక్కటే‌ తేడా అన్నమాట. ప్రముదితవదన చివరను ర-గణం (UIU) బదులు చంద్రికలో వ-గణం (IU).  ఈ‌ రెండు వృత్తాలకూ మొదటి తొమ్మిది స్థానాలూ‌ సమానం, మళ్ళా చివరి రెండూ స్థానాలూ‌ సమానం. ప్రముదితవదన నుండి పదవ స్థానం గురువును తొలగిస్తే అది చంద్రిక అవుతుంది.

ఈ‌ చంద్రికా వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు సరిగా తెలియవు. కాని విశ్వనాథవారు చంద్రిక అన్న వృత్తాన్ని వాడినట్లుతెలుస్తోంది. అది పైన చెప్పిన రెండు రకాల చంద్రికావృత్తాల్లో ఏదో వివరం తెలియదు.

చంద్రిక నడకవిషయం చూస్తే పైన నేను వ్రాసిన పద్యం ఇలా ఉంది:

నరుని బ్రతుకు నాట కంబు గా
నరసి విరతు డాశ్ర యించు నీ
పరమ శుభద పాద పద్మ ముల్
సరస హృదయ జాన కీ ప తీ


ఇక్కడ పాదంలో చివరి గురువును కొంచెం‌ లాగి త్రిమాత్రగా స్వీకరించవచ్చును. ఇలా అన్నీ‌ త్రిమాత్రాగణాలతో‌ నడుస్తూ‌ ఈ‌వృత్తం రూపకతాళానికి తగినట్లు ఉంది.

చంద్రికలు వ్రాయటం సులభంగానే కనబడుతోంది కాబట్టి ఆసక్తి కలవారు తప్పక ప్రయత్నించండి.