13, జనవరి 2016, బుధవారం

అల్పాక్కరకు సరిపోయే వృత్తలక్షణాలు.


అల్పక్కరకు గణవిభజన ఇం-ఇం-చం. అంటే రెండు ఇంద్రగణాలు, ఆపైన ఒక చంద్రగణం. ఇంద్రగణాలంటే భ,ర,త అనే మూడు త్రికగణాలూ, నల,నగ, సల అనే నాలుగక్షరాల గణాలూ అన్నవి. ఇవి మొత్తం 6. చంద్రగణాలు మొత్తం 14. అవి నగగ, నహ, భల, సలల, భగ, మల, సవ, సహ, తల, రల, నవ, సలల, రగ, తగ అనేవి. చంద్రగణాలు తెలుగులో వాడుకలో లేవు. అందుచేత అక్కరల వాడుక కూడా లేదు. మధ్యాక్కర కొద్దిగా వాడబడినా అది కూడా క్రమంగా మరుగున పడి ఇటీవలి కాలంలో కొంచెం‌ ఆదరణకు నోచుకుంది. మధ్యాక్కరలకు ప్రాచుర్యం కల్పించినది శ్రీవిశ్వనాథవారు ఆయన ఏకంగా మధ్యాక్కరలతో పది శతకాలు వ్రాసారు! ఐతే. మధ్యాక్కరలో‌ చంద్రగణం లేనేలేదు కాబట్టి ఇది అసలు ఒక అక్కర కానే‌కాదని కూడా అనవచ్చును.

ఏదైనా ఒక అక్కర పాదంలో చివరన ఉన్న చంద్రగణం గురువుతో అంతమయ్యే పక్షంలో (అంటే అది రగ, నగగ, తగ, సవ, భగ, నవ అనే వాటిలో ఒకటైతే) ఆ గురులఘుక్రమంతో ఒక వృత్తం కూడా సరిపోలవచ్చును. అంటే, ఆ వృత్తాన్ని వ్రాసినప్పుడు అది అల్పాక్కర క్రిందకూడా గణవిభజనకు సరిపోతుంది. అప్పుడు అది అటు సంస్కృతవృత్తమూ‌ ఔతుంది ఇటు తెలుగు ఛందస్సులోని పద్యమూ‌ అవుతుంది.

అల్పాక్కనే పరిగణనలోనికి తీసుకుంటేఒక వృత్తపాదం అల్పాక్కరకూ లెక్కకు వచ్చే విధంగా ఉన్న వృత్తాలను ఈ క్రింద ఒక పట్టికలో చూపుతున్నాను.

ఇంద్రగణాలు ఆరు. అవి రెండూ ,మనం గుర్వంతంగా ఉన్న చంద్రగణాలు ఆరూ తీసుకొంటున్నాం కాబట్టి  6 x 6 x 6 = 216 రకాల వృత్తాలకు అల్పాక్కరలతో పోలిక వచ్చే సందర్భం ఉంది. ఇందులో కొన్నే పేరుగల వృత్తాలు. అందుచేత వీటినే పట్టికలో చూపుతున్నాను.

సంఖ్య గురులఘుక్రమం అల్పాక్కర గణాలు వృత్తం పేరు వృత్త గణాలు
1IIIIIIIIIIIIUనల-నల-నలగహరవనితన-న-న-న-గ
2IIIIIIUIIIIUUనల-సల-నగగవిధురవితానమున-న-భ-స-గ
3IIIIIIUIUIUUనల-సల-రగపరిమితవిజయన-న-ర-య
4IIIIIIUIUUIUనల-సల-తగప్రభన-న-ర-ర
5IIIIUIIUIIUనల-భ-భగసుముఖిన-జ-జ-వ
6IIIIUIUIIIUUనల-ర-నగగనయమాలినిన-జ-భ-య
7IIIIUUIIIIUUనల-త-నగగకుసుమవిచిత్రన-య-న-య
8IIIUIIIUIIUIUనగ-నగ-సవసారసనావళిన-భ-జ-జ-గ
9IIUIIIIUIIIIUసల-నగ-నలగఉపసరసిస-న-జ-న-గ
10IIUIUIIUIUUసల-భ-రగపటుపట్టికస-జ-జ-గగ
11IIUIUIUUIUUసల-ర-రగవిహారిణిస-జ-త-గగ
12UIIIIIIIIIIUభ-నల-నలగభాసితసరణిభ-న-న-స
13UIIIIIIUIIUభ-నల-భగఅర్థశిఖభ-న-జ-వ
14UIIIIUIIIIUUభ-సల-నగగఅర్పితమదనభ-స-న-య
15UIIIIUIUIUUభ-సల-రగఅమందపాదభ-స-జ-గగ
16UIIUIIUIIUభ-భ-భగవిశ్వముఖిభ-భ-భ-గ
17UIIUUIIIIUUభ-త-నగగఅనుకూలభ-త-న-గగ
18UIUIIIIIIUIUర-నల-సవముకుళితకళికావళిర-న-న-ర
19UIUIIIUIIIIUర-నగ-నలగచంద్రవర్త్మర-న-భ-స
20UIUUIIUIIUర-భ-భగకేరంర-భ-భ-గ
21UIUUIUUIUUర-ర-రగహేమహాసర-ర-ర-గ
22UUIIIIIIIIIUత-నల-నలగరూపావళిత-న-న-స
23UUIIIIIIIIUUత-నల-నగగవిరతిమహతిత-న-న-య
24UUIUIIUIIUత-భ-భగపరిచారవతిత-భ-భ-గ
25UUIUIIUUIUత-భ-తగవర్హాతురత-భ-త-గ
26UUIUUIIIIUUత-త-నగగఉదితవిజోహత-త-న-గగ
27UUIUUIUUIUత-త-తగవిశాలాంతికంత-త-త-గ

భాసితసరణి వృత్తాన్ని దుఃఖభంజనకవి వాగ్వల్లభలో పేర్కొన్నాడని జెజ్జాల కృష్ణమోహన రావు గారు వ్రాసారు. ఈ వృత్తాల లక్షణాలన్నీ ఇక్కడ సంస్కృతంలో కనిపిస్తున్నాయి.

అంతర్జాలంలో ఛందం అని ఒక ఉపకరణం‌ ఉంది. దానిలో ఒక్కొక్క సారి పై వృత్తలక్షణం అందుబాటులో లేనప్పుడు అది అక్కరగా సరిపోయేలా ఉంటే అక్కర (ఉదా: అల్పాక్కర) అని చెబుతుంది. పై ఛందస్సుల లక్షణాలు అల్పాక్కరకూ వృత్తాలకూ కూడా సమానంగా కనిపిస్తున్నాయే మరి అల్పాక్కర అనాలా వృత్తం అనాలా అన్న ప్రశ్న వస్తుంది.

సంస్కృతంలో సుగంధి అన్న వృత్తం‌ ఉంది. గణవిభజన ర-జ-ర-జ-ర. మరొక విధంగా చెప్పాలంటే ఏడు హ-గణాల పిమ్మట ఒక గురువు.  తెలుగు పద్యఛందస్సులో ఉత్సాహం అని ఒకటుంది. దానికి గణవిభజన ఏడు సూర్యగణాల పైన ఒక గురువు. ఇప్పుడు గమనిస్తే సుగంధి పద్యాలన్నీ ఉత్సాహాలే అవుతున్నాయి. ఉత్సాహ పద్యాలన్నీ సుగంధికి సరిపో నక్కర లేదు. ఎందుకంటే సూర్యగణం అన్నాక హ-గణమూ న-గణమూ కదా. కాని సుగంధిలో‌అన్నీ హ-గణాలే‌ కాని న-గణం‌ లేదు. అందుచేత అన్నీ‌ హ-గణాలతో వ్రాసినప్పుడు అది సుగంధి అనే అనాలి కాని ఉత్సాహ అనకూడదు. ఇడే పధ్ధతిని అవలంబించాలి ప్రస్తుత సమస్య విషయంలో‌ కూడా.

ఒక సమవృత్తంలో‌ నాలుగు పాదాల్లోనూ ఒకే గురులఘుక్రమం ఉండాలి. అలా ఉంటే మనం అక్కరకు పోలినా వృత్తనామమే వాడాలి. నాలుగుపాదాల్లోనూ గురులఘుక్రమం ఏ కొద్దిగానో తేడా వచ్చి అది అక్కరగా మాత్రం సరిపోయినట్లైతేనే మనం అక్కర అనాలి.