నాకు సంస్కృతంలో ఓనమాలు కూడా రాకపోయినా భారవి నాకు అభిమాన కవిశేఖరుడు.
నాకు చిన్నతనంలో హైస్కూల్లో ఆరవతరగతి లోనో యేడవతరగతి లోనో గుర్తులేదు కాని ఏదో పోటీపరీక్షలో బహుమగా వచ్చిన ఒక పుస్తకం పేరు ఆదర్శకథావళి. అందులో భారవి కథ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఎంత బాగా అంటే ఇప్పటికీ సవిస్తరంగా అది జ్ఞాపకం ఉంది. ఆ పుస్తకంలో ఇంకా భీష్ముడు, ధృవుడు, ప్రహ్లాదుడు వంటికథలు చాలానే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో శ్రీ కష్టేఫలీ బ్లాగు శర్మగారు కూడా భారవి గురించి ఒక టపా వ్రాసారు. ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యనూ ఉంచాను.
ముందుగా ఆదర్శకథావళి పుస్తకంలోని భారవి కథను కొంచెం క్లుప్తంగా చెబుతాను. చాలా కాలం కావటం వలన అక్కడక్కడా నా ఊహలు చోటుచేసుకొని ఉండవచ్చును కాని కథా క్రమం అంతా ఆ పుస్తకం లోనిదే!
భారవి నవయువకుడిగా ఉన్నరోజుల్లోనే అతడి కవిత్వానికి కవిపండితలోకం బ్రహ్మరథం పట్టింది. ఐనా భారవి మనస్సులో అసంతృప్తి. అందరూ తనను ఆకాశాని కెత్తేస్తుంటే, తండ్రి మాత్రం, "ఆఁ కుర్రవాడు. వాడికేం తెలుసులెండి. ఏదో గిలుకుతున్నాడు" అని తేలిగ్గా మాట్లాడేవాడు. ఒకరోజున రాజసన్మానం అందుకున్నాడు భారవి. ఇంటికి వచ్చి తల్లితో తన ఆనందం పంచుకున్నాడు. ఈ సారైనా నాన్నగారు అభినందిస్తారని నమ్మకంగా గంపెడాశ పెట్టుకున్నాడు. తీరా నాన్నగారు ఇంటికి వచ్చి సంగతి విని, "ఆహాఁ అలాగా" అని చప్పరించేసాడు. ఒళ్ళు మండిపోయింది భారవికి.
తనని చూసి అసూయతో మెచ్చక తేలిగ్గా తీసుకొనే తండ్రి నెత్తిన ఒక బండ పడేస్తే పీడా పోతుందని కోపంగా, పచ్చడిబండ తీసుకొని అటక యెక్కి కూర్చున్నాడు మంచి సమయం కోసం చూస్తూ. అన్నం వడ్డిస్తూ తల్లి "భారవిని కాస్త మెచ్చుకుంటే మీ సొమ్మేం పోతుందండీ, పిచ్చి సన్నాసి ఎంత ఎదురుచూసాడో మీరో మంచి మాట అంటారనీ" అని అడిగింది. దానికి తండ్రి గారు చిన్నగా నవ్వి "వాడేమీ నొచ్చుకోడే. తండ్రిని నేనే వాణ్ణి పొగిడితే వాడికి ఆయుక్షీణం అని వాడికి మాత్రం తెలియదా, వాడి కంటే గొప్ప కవి ఉన్నాడా ఈ లోకంలో నేడూ" అన్నారు. భారవికి తలతిరిగిపోయింది. దిగివచ్చి కన్నీళ్ళతో తండ్రి పాదాలపై బడి తాను పొరబడ్డాననీ, అకృత్యానికీ సిధ్ధపడ్డాననీ విన్నవించుకున్నాడు. నన్ను శిక్షించండి" అని తలవంచుకున్నాడు. ఫరవాలేదు లేరా అంటే వదలడే. అప్పుడు నాన్నగారు "సరే అబ్బాయీ, నువ్వూ మీఆవిడా ఒక సంవత్సరం మీ అత్తారింట్లో ఉండి రండి" అన్నాడు.
ఇదేం శిక్షా? అనుకున్నాడు భారవి. వెంటనే తన భార్య చారుమతితోసహా , మావఁగారు అన్నంభట్టు ఇంటికి చేరుకున్నాడు. అంతా మహామర్యాద చేసారు. తమ ఊళ్ళో భారవి పేరు ఎలా మారుమోగుతోందో తమకు ఎంత గర్వంగా ఉందో ఒకటికి పదిసార్లు చెప్పారు. భారవికి సంతోషం కలిగింది. మొదటినాడు ముత్యపు చుట్టం, రెండవనాడు రత్నపు చుట్టం, మూడవనాడు మురికి చుట్టం అన్నారు కదా. రోజులు గడవటంతో మెల్లగా మర్యాదలు మాయమైనాయి. అల్లుడుగారి రాకకు కారణం అడిగితే సమాధానం లేదు. అన్నంభట్టంతవాడే చీదరించుకున్నాడు. మెల్లగా పొలంపనులు పాలేరు పనులూ అప్పగించారు. భారవికి తండ్రిగారు వేసిన శిక్ష ఏమిటో మెల్లగా అవగాహనకు వచ్చింది.
ఒకరోజున చారుమతి పొలానికి అన్నం తీసుకొని ఎప్పటి లాగానే వచ్చి, తటపటాయిస్తూనే కన్నీళ్ళతో చెప్పింది. నా పరిస్థితి బాగోలేదు. రేపు వరలక్ష్మీవ్రతం. చేసుకొనే యోగం లేదు. వదినలు వైభవంగా చేసుకుంటున్నారు ఏర్పాట్లు. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం కొత్తచీరైనా కొనలేను కదా అంది. భారవి మ్రాన్పడ్డాడు. కొంచెం ఆలోచించి చిరునవ్వుతో "ఈ వూళ్ళో వరహాలసెట్టి నా మిత్రుడని నీకూ తెలుసు కదా. అతడిని అడిగి డబ్బులూ సరకులూ కావలసినంత తెచ్చుకో ఆనక నేను తీర్చుతాను. పైగా ఇంకొక మాట, ఊరికే తీసుకుంటే బాగోదు కదా, ఆతనికి ఇదిగో ఈ శ్లోకం తాకట్టు పెట్టు. నేను ఒక కావ్యం వ్రాస్తున్నానులే దానిలోనిది. సరేనా నిశ్చింతగా వెళ్ళిరా" అన్నాడు.
వరహాల సెట్టి శ్లోకాన్ని కళ్ళకద్దుకుని, "సమయానికి వచ్చారు. రేపుండే వాణ్ణి కాదు ఊళ్ళో. కావలసినంత తీసుకోండి అసలు తాకట్టెందుకూ" అన్నాడు. వరలక్ష్మీ వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి. వదినలకూ అన్నలకూ మరి నోట మాట రాలేదు.
వరహాలసెట్టి సముద్రవ్యాపారానికి మర్నాడే కాబోలు వెళ్ళిపోయాడు. సంవత్సరం గడువూ ముగిసిన తక్షణం మొగుడూ పెళ్ళాలు ప్రయాణమయ్యారు. ఆన్నివిషయాలనూ అత్తింటివారికి చెప్పి వాళ్ళ క్షమాపణలూ,ఘనసన్మానాలూ అందుకొని భారవి వెళ్ళిపోయాడు. శ్లోకం సెట్టిగారి దగ్గరుంది. ఆయనేమో నెలలుగా అజాపజా లేడు. నెలలు సంవత్సరాలయ్యాయి.
సెట్టిగారు సముద్రవ్యాపారంలో ఓడములిగి చచ్చీచెడీ ఎదో ద్వీపం చేరాడు. అక్కడి వాళ్ళ భాష మనకి తెలియదు. మెల్లగా అక్కడే చచ్చినట్లు ఉండిపోయి, పధ్ధెనిమిదేళ్ళ తరువాత ఏదో ఓడ అక్కడికి రావటమూ వాళ్ళకు తన భాష తెలియటమూ జరిగి, బ్రతుకు జీవుడా అని ఒక రాత్రిపూట స్వస్థలం చేరాడు. పెళ్ళాం సంతోషం చెప్పతరమా. తన సంతోషం చెప్పతరమా? కాని, ఇంట్లో ఎవడో నవయువకుడు! భార్యలను నమ్మరాదు అని బాధపడ్డాడు. ఆవేశం అణచుకోలేక ఒక చూరున ఉన్న కత్తిని బయటకు లాగాడు ఒరతో సహా. ఏదో తాళపత్రం పట్టుబట్టలో చుట్టి ఉన్నది బయట పడింది. దాన్ని తీసి చదివాడు.
మవివేకః పరమాపదాం పదం
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః -
ఆ శ్లోకం భావం తలకెక్కింది అంత కోపం లోనూ. ఆ శ్లోకం చెబుతోంది. కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చెడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి అని. అవును, రేపు వివరం కనుక్కున్నాకే ఏం చేయాలో ఆలోచించవచ్చును అని శాంతించాడు.
తెల్లవారింది. ఊరంతా అబ్బురంగా చెప్పుకున్నారు. అందరూ ఆ అమ్మ చలవ అన్నారు. సెట్టికి మండిపోతోంది. ఆయమ్మ చలవ అడిగో ఆ మంచం మీద కూర్చున్నాడు అని ఆ అబ్బాయిని చూపించాడు. విషయం అర్థం ఐన ఒక పెద్ద ముత్తైదువ ఇలా అంది. "సెట్టీ, నువ్వు ఓడ మీద పోయే నాటికే మీ ఆవిడకు నెలలు నిండుతున్నాయి కదా. ఆ బిడ్డ వీడేనయ్యా" అంది. సెట్టి తలతిరిగిపోయింది. ఎంతపెద్ద పొరపాటైపోయిందీ. ఎంత ప్రమాదం తప్పిందీ. ఆ శ్లోకం రక్షించకపోతే ఇంకే మన్నా ఉందా! అనుకున్నాడు.
వార్త తెలిసి భారవి కూడా వచ్చి సెట్టిని అభినందించి. "పైకం ఇదిగోనయ్యా నా శ్లోకం తిరిగి ఇవ్వు. అది నా కిరాతర్జునీయ కావ్యం ద్వితీయ సర్గ లోనిది. నువ్వు ఎప్పటికైనా వస్తావని ఎదురుచూస్తున్నాను. నీకు తాకట్టు పెట్టిన శ్లోకం చేర్చకుండా కావ్యాన్ని ఎలా ప్రకటించేదీ? నీ రాక కోసమే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా" అన్నాడు. సెట్టి భారవి కాళ్ళ మీద పడి, "కవిగారూ, మీ శ్లోకం పుణ్యమా అని నా ఇల్లు నిలబడింది." అని జరిగిందంతా కవికి విన్నవించి తానే భారవికి అఖండ సన్మానం చేసి శ్లోకంతో సహా బ్రహ్మాండంగా ఊరేగించి పంపించాడు.
ఇదండీ భారవి మహాకవి కథ. మనసు పెట్టి ఒక సారి ఆలోచించి చూస్తే ఈ కథలో మనకు పనికి వచ్చే విషయాలు బోలెడన్ని ఉన్నాయి.
భారవి వరహాల సెట్టికి తాకట్టు పెట్టినది కిరాతార్జునీయం అనే ఆయన సంస్కృత కావ్యంలోని రెండవ సర్గలో 30 శ్లోకం. మహా అద్బుతమైన కావ్యం అది.
కిరాతుడి రూపంలో వచ్చిన శివుడికీ, శివానుగ్రహంకోసం తపస్సు చేస్తున్న అర్జునుడికీ మధ్యన జరిగిన యుధ్ధం గురించిన ఘట్టాన్ని ఆ కావ్యంలో భారవి మహాకవి చిత్రకవిత్వంతో నింపి బ్రహ్మాండంగా వ్రాసాడు. అది ఆ కావ్యంలోని పదిహేనవ సర్గ.
ఆ సర్గలో ఉన్నవి 53 శ్లోకాలు. రోజుకు ఒక చిత్రకవిత్వం కల శ్లోకం చొప్పున ఆ తమాషా కవిత్వం అంతా ఆస్వాదిద్దాం.
ముఖ్యగమనిక:
రిప్లయితొలగించండిఈ వ్యవహారం మొదలైంది కదా అని విశేషవృత్తాలలో పాహిరామప్రభో పద్యాలు ఆగవని హామీ ఇస్తున్నాను. ఇంకా ఈ వరుసలో బొలెడన్ని పద్యాలు రావలసి ఉంది!
శ్యామలీయం గారూ , మీ 'భారవీయం' బాగుంది, అంత కన్నా మీరు చేసిన ముఖ్య ప్రకటన బాగుంది.
రిప్లయితొలగించండి"సహసా క్రియాం న విదధీత" , "అవివేకః - పరమ + ఆపదాం పదం"
ఈ శ్లోకాన్ని ఇలా పునర్నిర్మించండి -
సహసా విదధీత న క్రియా
మవివేకః పరమాపదాం పదం
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః -
సంస్కృత కవ్యగ్రగణి భారవి గురించి నేటి పాఠకులకు రుచించే రీతిలో మీ పరిచయం సాగింది. స్వస్తి.
విష్ణు నందన్ గారూ, మీరు శ్లోకాన్ని పరిష్కరించి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఒక పొరపాటు చేసాను. బధ్ధకం అనండి. శర్మగారి బ్లాగులో ఆ వ్యాఖ్య వ్రాసినప్పుడు బాల్యంలో మనసుకెక్కిన శ్లోకపాఠం ఎలా గుర్తు ఉందో అలాగే వ్రాసాను. ఇప్పుడు ఆ వ్యాఖ్యనుండి శ్లోకాన్ని ఇక్కడ చేర్చాను. వ్యాఖ్యలో వ్రాసినప్పుడు కిరాతార్జునీయం నా దగ్గర లేదు. ఇప్పుడుంది కాని ఆ శ్లోకాన్ని అందులో చూసి సరైన పాఠం వ్రాయటంలో అలసత్వం దొర్లింది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కె.వి సుందరాచార్యులవారి తెలుగు వ్యాఖ్య.
రిప్లయితొలగించండి