1, జనవరి 2016, శుక్రవారం

పాహిమాం రామం ప్రముదితవదనం






    ప్రముదితవదన.
    నిరుపమ మగు నీ దయా దృష్టికై
    సురలు మునులు జోరుగన్ మూగగా
    నరుడ నిలువ నాకు చోటుండునా
    పరమపురుష పాహిమాం రాఘవా



ప్రముదితవదన

ఈ ప్రముదితవదన వృత్తానికి గణవిభజజ న-న-ర-ర . అంటే పాదానికి 12అక్షరాలన్నమాట. లక్షణ గ్రంథాలు యతిస్థానం 8వ అక్షరంగా చెబుతున్నాయి.

గణవిభజ ప్రకారం  న - న - ర - ర అన్నప్పుడు,  మాత్రలు  3 + 3 + 5 + 5 = 16 అవుతున్నయి. యతిస్థానం  8వ అక్షరంగా తీసుకొన్న పక్షంలో (3+3+2)+(3+5) మాత్రలుగా  సమమాత్రావిభజవస్తుంంది. కాని యతిస్థానం ఒక లఘువుపై వస్తున్నది.  ఈ‌ పక్షంలో ప్రముదితవదన వృత్తపాదం నడక ననన-ననన-నా ననా-నాననా అన్నట్లుగా వస్తుంది.

అంతకంటే 7వ అక్షరంగా ఉంటే గురువుపైన యతిస్థానం తీసుకోవటం బాగుంటుందని నా అభిప్రాయం. అలా చేసినప్పుడు ఈ‌ ప్రముదితవదన నడక ననన-ననన నాననా-నాననా అన్నట్లుగా సుభగంగా అనిపిస్తున్నది. ఈ విధానంలో పూర్వీత్తరభాగాలలో అక్షరసంఖ్య కూడా సమానం అవుతున్నది. అందుచేత యతిస్థానం 7వ అక్షరంగా ఎన్నుకొని వ్రాస్తున్నాను. 

ఈ ప్రముదితవదనకే ప్రముదితవదన, ప్రభాత, మందాకినీ, గౌరీ, చంచలాక్షీ అనే పేర్లు కూడా ఉన్నాయని ఛందం పేజీలో కనిపిస్తోంది. అలాగే ప్రముదితవదన అనే పేరుతో మరొకవృత్తం కూడా ఉన్నదని ఒక ఈమాట వ్యాసం ద్వారా తెలుస్తోంది, దాని లక్షణాలు ప్రముదితవదనా న-స-న-న-లగ, యతిస్థానం14వ అక్షరం

ప పద్యం నడక విషయానికి వస్తే ఇలా ఉన్నది.

నిరుపమ మగు నీ దయా దృష్టికై
సురలు మునులు జోరుగన్ మూగగా
నరుడ నిలువ నాకు చో టుండునా
పరమపురుష పాహిమాం రాఘవా

ఇలా ప్రతిపాదమూ మూడు కాలఖండాలుగా వస్తుంది. ప్రతికాలఖండం‌యొక్క నిడివీ ఆరేసి మాత్రలుగా కనిపిస్తోంది. పాదంలో రెండవ, మూడవ కాలఖండాలకు మరొక అదనపు మాత్రాప్రమాణం‌ సాగదీత వస్తున్నదన్న మాట.

ఈ ప్రముదితవదన వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

( ప్రముదితవదన వృత్తం పై మలిటపా )

8 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అమలిన హృద యాలయాలందు తా
    బ్రముదితుడయి రాముడుండున్ సదా
    కమల నయను గాంచగా మానసం
    బమర వలెను భక్తితో నిండుగా .

    రిప్లయితొలగించండి
  3. మిమ్మల్ని వదలా! :)
    విద్యున్మాల,చిత్రపదము రోజుకొకటి చొప్పున చెప్పండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటికే చిత్రపదం చెప్పటం‌ జరిగింది కదండీ. విద్యున్మాలను తప్పక చెబుతాను.

      తొలగించండి
  4. ఈ ప్రముదితవదన వృత్తాన్ని లక్షణసార సంగ్రహ కర్త చిత్రకవి పెద్దన ‘ప్రభ’ అని పేర్కొని యతిస్థానం 8 అన్నాడు. మీరు 7వ అక్షరం యతి వేశారు. నడక విషయంలో ఎనిమిది మాత్రల ఆవృత్తితో లయబద్ధంగా ఉండాలంటే 8వ అక్షరాన్నే యతిస్థానంగా గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చూడండి...
    మునిజన వినుతా - మురధ్వంసకా
    వనరుహ నయనా - వరాంగా హరీ
    నిను మదిఁ దలఁతున్ - నినున్ గొల్చెదన్
    నను దయఁ గనరా - నమో మాధవా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శంకరయ్య గారికి స్వాగతం. ఈ ప్రముదితవదన వృత్తపునడకను

      1. 7వ అక్షరం యతిస్థానంగా ననన-ననన-నా ననా-నాననా
      2. 8వ అక్షరం యతిస్థానంగా ననన-ననన నాననా-నాననా

      అన్న ఉభయవిధానాల్లోనూ లయ ఉన్నది. ఐతే కొద్ది బేధం ఉన్నమాట వాస్తవం. నాకైతే 8వ
      అక్షరం యతిస్థానంగా లయలో ఎక్కువ సహజత్వం‌ కనిపించి ఆ విధంగా మొగ్గు చూపాను. పూర్వకవి ప్రయోగాలు తగినన్ని లేని సందర్భాల్లో ఈవిధంగా యతిస్థానం గురించి ఆలోచనలు చేయక తప్పదు మరియు తప్పుకూడా కాదని నా అభిప్రాయమండి.

      నేనైతే ఉభయవిధానాలుగానూ‌ ఒకటికంటే హెచ్చు ప్రయత్నాలు చేసిన పిదపనే 8వ అక్షరం పైన మొగ్గుచూపటం‌ జరిగిందని సవినయంగా మనవి చేస్తున్నాను.

      ఐనా, ఈ ప్రస్తుతవృత్తం గురించి మరింత ఆలోచన అవసరం‌ కావచ్చునేమో.

      తొలగించండి
  5. స్పందనకు ధన్యవాదాలు.
    నాకు మాత్రం ‘నననన-నననా-ననా-నాననా’ అన్న లయ కర్ణపేయంగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక పాటను ఒకటి కంటే ఎక్కువ బాణీలు కూర్చిన సందర్భాలను చూస్తున్నాం‌ కదండీ. అలాగే ఒక పద్యంలో విరుపులు భిన్నంగా చేయటమూ విశేషం కాదేమో. మీ పధ్ధతిలో‌లయను గ్రహించే యత్నం చేస్తాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.