25, జులై 2017, మంగళవారం

పొరబడినాను పుడమి జేరితిని

పొరబడినాను పుడమి జేరితిని
నరునివేషం బిది నాకేలా రామ

పొలుపుగ నీతోకలసి యుందు దు
ర్బలచిత్తుడనై  పడితి నిచ్చట
యిల నీసన్నిధివలె నుండేనా
తెలిసివచ్చెను నా తెలిమిలేమియే

నీపద సన్నిధి నెలకొని యుండక
యాపద కేటికి నాత్రపడితిని
కాపగు నీదయ కడబెటట్టితిని
పాపినైతి నన్ను కోపగించకు

ఇందున నీకుట్ర యేముండునులే
ఎందుకు  చెడితినో యేమిదోసమో
పొందిన చేదెల్ల పోగొట్టవె చే
యంది కావవె ఓ అనురాగమూర్తి2 కామెంట్‌లు:

 1. శ్యామల రావు గారూ,
  నమస్కారం. ప్రాసయతిలో ద్విత్వాక్షరమైన ప్రాసాక్షరానికి ముందు రెండు చోట్లా కేవల గురువుంటే చాలదు, అవి కచ్చితంగా దీర్ఘాలై ఉండాలన్న నియమం ఒక టున్నదని చాలామంది భావిస్తూ ఉన్నారు. కాని ఇది (నేను చూచిన) ఏ లక్షణ గ్రంథంలోను లేదు. గతంలో 'శంకరాభరణం' బ్లాగులో శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారు ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు అది తప్పని నేను భారత, భాగవతాలలోని ఉదాహరణాలతో చూపాను. ఆ పోస్ట్ ఇప్పుడు దొరకలేదు. పోచిరాజు కామేశ్వర రావు గారిచ్చిన అప్పకవీయంలోని క్రింది పద్యాన్ని చూడండి.
  ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
  స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
  వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
  దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)
  అలాగే ఈ ఉదయం పైపైన కర్ణపర్వాన్ని పరిశీలించినపుడు క్రింది ఉదాహరణలు కనిపించాయి.
  ధాత్రిఁ బాలింపు సుస్థితిఁ *బుత్రపౌత్ర (కర్ణ.౫౭)
  దీప్తకాంచన రస*లిప్తమై చెలువొంద (కర్ణ. ౬౦)
  పాండవు చాపంబు *ఖండించె నీకోడు...(కర్ణ. ౧౯౨)
  ఉ।దీర్ణదర్పుఁడై కప్పె న*క్కర్ణుఁ డధిప (కర్ణ. ౨౦౫)
  పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే చాలు. దీర్ఘహ్రస్వాల పట్టింపు లేదని అర్థమౌతుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ అభిప్రాయం బహు సబబుగా ఉంది. అప్పకవీయంలో చాలానే కప్పదాట్లున్నట్లుగా ప్రతీతి. దాన్ని కొంచెం ప్రక్కన పెడదాం. కవిత్రయమూ ప్రబంధకవులూ ఎలా వాడారో చూడాలి. మీరిచ్చిన భారతోదాహరణలు బాగున్నాయి. ఐతే కవిత్రయంలో ఇటువంటి ప్రయోగాలు సకృత్తుగానే ఉన్నాయా విస్తృతంగా ఉన్నాయా అన్నది చూడాలి. అదే విధంగా ప్రబంధప్రయోగాలూ పరిశీలించాలి. ఐనా అంత అభ్యతరకరం కానప్పుడు వీలైనంతవరకూ పాటించుతూ అది ఒక చాదస్తంగా మాత్రం అవలంబించనక్కర లేదనుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ నియమం వలన కొంత శ్రావ్యత కలుగుతున్నదిగా భావించి పాటిస్తున్నాను. తెలుగు ఛందస్సుల్లో సంస్కృతఛందస్సుల్లోవలె అంతర్లీనమైన లయ అంటూ ఉండదు కాబట్టి దాన్ని ఇతరవిధాలుగా సముపార్జించవలసి ఉంటుంది. వాటిలో ఒకటి ప్రాసయతి కూడా - నిజానికి ప్రాసయతి ఇచ్చిన అందం తెలుగు పద్యాలకు అక్షరసామ్య మైత్రి అంతగా ఇవ్వటం లేదనే నా అభిప్రాయం. ఎందుకంటే అక్షరసామ్యమైత్రిలో ఉన్న కిట్టింపువ్యవహారం ప్రాసయతిలో లేక అది చాలా సహజమైన యతిమైత్రిగా విరాజిల్లుతోందని నా మతం. ఇప్పుడు మనం ఉందా లేదా అని వితర్కిస్తున్న నియమం ప్రాసయతికి అందాన్నిచ్చేదే - దీన్ని కొంచెం సడలించటం అభ్యంతరం కాదు కాని పాటించటం మరింత సొగసు. ఇప్పుడు నాకు మరొకటి తోస్తోంది. తెలుగు జానపదసాహిత్యంలో ప్రాసయతి చాలా సాధారణం అది ఈ నియమాన్ని సమర్థిస్తున్నదా లేదా అన్నది కూడా అవశ్యం పరిశీలనీయం.

   లోగడ ఈనియమం గురించి తెలియక నేను ఇటువంటి ప్రయోగం నేను చేసినప్పుడు గురువర్యులు నేమాని రామజోగిసన్యాసిరావుగారు నాకీ నియమం గురించి తెలియజేసారు.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.