19, జులై 2017, బుధవారం

నేను - 6


నిజమా ఆ నిజమేదో నీవు నే నెఱుగుదుము
ఋజువులు కావలయునా కృపతో నను బ్రోవుము

నేను నీవను మాట యేనాడు కలిగెనో
ఆనాడే నీవు నేను నయ్యో యెడమైతిమి
కానరాని దైవమవై కదలిపోతివి నీవు
దీనుడనై నీకొఱకై తిరుగుచుంటిని నేను

వెలుగుచీకటుల మధ్య వెదకుదునో లేదో
యిలను స్వర్గమును గాలించుదునో లేదో
కలలలో నిన్నే నే పలవరింతునొ లేదో
తెలియరాని నీకే తెలియును నిజమేదో

నేను నేనను వీని నీవే కలిగించితివో
మానక యే మాయయో మరి నన్ను చేసెనో
కాని మ్మీ దూరమే కఠినమైన నిజము
పూనుకొని నీవే నను పొదువుకొనుము రామ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.