23, జులై 2017, ఆదివారం

ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు


ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు
సుంత విచారించి చూడవయ్యా రామ

చేరి భక్తులు నీకు చేర్చినవియే కాక
పేరేమియును లేని పెద్దవాడవు నీవు
సారెకు ధరణిపై జనియించితిని కాన
పేరు లేని నాకు వేలాది పేర్లాయె

హృదయమిచ్చిన వారి యెదుట నుందువు గాన
ఇది నీకు నెల వనుచు నేరీతి జెప్పుదు
పదివేల చోటుల నుదయించితి గాన
యుదదిమేఖల నన్ని యూళ్ళు నావాయె

కోరుజీవుని యూహ కొలది రూపమె కాని
యూరు పేరేనా నీ కొకరూపమును లేదు
ప్రారబ్ధమున జేసి పలురూపులగు గాని
యారయ నొకరూప మనగ నాకును లేదు


2 కామెంట్‌లు:

  1. రూపు లేనివానికొరకింత తాపమాయె!

    రిప్లయితొలగించండి
  2. అంతే కదండీ. నామరూపాత్మకమైనది ప్రకృతి. అందులో పడ్డాక తాపత్రయం తప్పదు కదా.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.