25, జులై 2017, మంగళవారం

ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు

ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు
వెన్నంటి నీవుండ వేడుకొను వాడు

తన్ను తానెరుగునో తానెరుగడో కాని
నిన్ను మరువక యుండు నియతి కలవాడు
మన్నించు నీవుండ మరియింక కొరత
యున్నదా యేమి యనుచున్నట్టి వాడు

ఏమాయ లోకాల నెల్ల ముంచెత్తునో
యామాయ నీలోన నడగు ననువాడు
భూమి నేరూపమును పొంది వీడున్నను
తామసించక నిను తవిలియుండెడువాడు

ఏనాడు నీకన్య మెంచకుండెడు వాడు
కానరాని నీకై కలలెన్నొ కనువాడు
తాను నీవాడనని తలచుచుండెడి వాడు
ఏ నాటి వాడొ యీ జీవుడు శ్రీరామ