4, జులై 2017, మంగళవారం

నల్లనయ్య ఎందుకు నలుపు?

ఈరోజున నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష ! అంటూ లక్కాకుల వేంకట రాజారావు గారు తమ సుజన - సృజన బ్లాగులో ఒక మంచి ప్రశ్న వేసారు.

అంతటా తెలుపే నీ చుట్టూ - కాని నీకే ఎలా వచ్చిందీ నలుపూ అంటూ ఆయన ఒక మంచి పద్యం వ్రాసారు.
సమగ్రత కోసం ఆయన పద్యాన్నీ ఇక్కడ ఉటంకిస్తున్నాను.

దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు

బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !


ఈ ప్రశ్నకు ఆ శ్యామలాంగుడే వచ్చి సమాధానం చెప్పాలి మనకు న్యాయంగా. కాని ఏంచేస్తాం?  తన గురించి ఎవరేమనుకున్నా ఆయనకు పట్టదాయె. దూషణభూషణాలకు ఆయన అతీతుడు కదా. ఐనా మనం మాత్రం ఏమీ దూషణ చేయటం లేదే. ఏదో మన ఆశ్చర్యాన్ని మనం వెలిబుచ్చాం. ఇందువల్ల నయ్యా అంటే నల్లనయ్య సొమ్మేం పోతుంది చెప్పండి. కాని ఆయన మహా మొండి వాడు.

మొండివాడు రాజుకన్నా బలవంతుడని ఒక సామెత. మరి  ఆ రాజే మొండివాడైతే అన్న చిలిపి ప్రశ్న మనకి బోల్డు సార్లు తట్టి ఉంటుంది కదా? ఒప్పుకుంటారా? అలాంటప్పుడూ,   అన్ని లోకాల్నీ యేలే మహాప్రభువు మహావిష్ణువే మొండి వాడైతే ఇంకేం చెప్పేదీ అని!

చెప్పేందు కేమీ లేదు. సమాధానం ఇదీ అని మనం ఊహించుకో వలసినదే. తప్పదు మరి!.

అవునయ్యా కన్నయ్యా ఇందు చేత కదా అని అంటే?

ఆయన ఒక చిరునవ్వ్హు విసిరి ఊరుకుంటాడు.

అది తప్పైనా చిరునవ్వే అయన మన కిచ్చే జవాబు!
అది ఒప్పైనా చిరునవ్వే ఆయన మన కిచ్చే జవాబు!

అంచేత చూసారూ? మన కొక సదుపాయం ఉంది.  అన్నటు సదుపాయం అంటే రూఢార్థంగా ఇంగ్లీషు వాడు ఫెసిలిటీ అంటాడే అది అనేసుకుంటున్నాం కదూ. తప్పులేదు. కాని యోగికమైన అర్థం వేరే కూడా ఉందిగా? సదుపాయం అన్న మాటని విడదీస్తే సత్+ఉపాయం అని కదా. అంటే మంచి ఉపాయం అన్నమాట. ఇక్కడ ఆ యోగికార్థం ఎలా పనుకొస్తుందయ్యా అంటే అపాయం లేనిదే కదా అసలైన ఉపాయమూ అన్నమాట ఇక్కడ వర్తించేస్తోంది మరి. అదెలాగో చూడండి.

సదుపాయమా,  అదేమిటీ? అంటే మనకు తోచిన జవాబును మనం తయారుచేసుకోవటమే ఆ సదుపాయం అన్నమాట.

కాదని ఆయన అనడుగా మరి?

ఆయన అవునన్నా అనకపోయినా కాదని అనడు కాబట్టీ అసలే కరుణాసముద్రుడూ వగైరా బిరుదులన్నీ మీదేసుకున్న వాడు కాబట్టీ మననేమీ అనడు కాబట్టీ మన ఊహ మనం చేసేయటం వలన అపాయం లేదూ అన్నది ఇక్కడ అసలు విషయం అన్నమాట.

అందుచేత ఏమీ బదులీయడే ఈ శ్యామలాంగుడూ,  అసలు సంగతి ఏమిటా అంటే ఇదే ఐయ్యుంటుందీ  అని శ్యామలీయం ఒక ఆలోచన చేసేస్తున్నాడు.

వర్ణముల పట్ల లోకవివక్ష మెండు
తెల్లవాడికి కోరిక తెల్లపిల్ల
నల్లవాడైన కోరేది తెల్లపిల్ల
నల్లపిల్లను కోరెడు నాథు డెవడు

అంత వరకేల నలుపన్న కొంత లొచ్చు
తోచియేక దా యీప్రశ్న దాచకుండ
ఓరి దేవుడా నీకేల కోరరాని
నల్లదనమని ప్రశ్నించు ప్రల్లదనము

అబ్బెబ్బే మరి యూరకే యడిగినామయ్యా మహాత్మా హరీ
యిబ్బందేమియు లేదు మాకు మరి నీ వేరంగుగా దోచినన్
మబ్బే కొంతనయం బటన్నదొక  మైచాయతో నుండినన్
అబ్బో శ్వేతవరాహమూర్తి వయి మాకానందమున్ కుర్చినన్

శ్యామవర్ణ మనగ సౌందర్య చిహ్నంబు
శ్యామవర్ణ మెన్న చాల గొప్ప
నిన్నమొన్నదాక నీరేజదళనేత్ర
తెలుపుపైన నేడు వలపు మెండు

ఊరక నీవెందులకై
కూరిమితో నల్లరంగు గొనినావని మా
తీరని సందేహమయా
శౌరీ యొకయూహ చేయజాలుదు వినుమా

అది యెట్టిదనగా నవధరింపుము.

అరయ నంతటను సామాన్యమాయె తెలుపు
చిన్నబోయిన నలుపేమొ చింతచేసి
విష్ణుదేవుని పాదారవిందములను
చేర నాతడు దయమీఱ చేర్చె మేన

పరమదయాళువై పరమపావన దివ్యనిజాంగమెల్ల సం
బరమున నీలవర్ణరుచిభావన సేసి ధరించినంతటన్
హరిశుభదేహమంటి యది యంతట మిక్కిలి వాసికెక్క నం
దరు నిక నల్లనయ్య యని తామరసాక్షుని గొల్చి రత్తరిన్

ఇది నాయూహ మహాత్మా

దీనినిబట్టి శ్రీహరికి దీనుల యందు విశేషమైన జాలిగా
మానవదేవరాక్షసుల మానసముల్ గ్రహియించ మేలగున్
కాన సరైన కారణము కావలయున్ భవదీయదివ్యదే
హాన ధరించియుండ నిటు శ్యామలవర్ణము ప్రేమమీఱగన్

వెనుక నొక్కనాడు వేడుక యగు నల్పు
కాలమహిమచేత ఘనత చెడగ
నీదు మరువు సొచ్చి నిండుగౌరవమును
పొంది వెలిగె మరల పుడమి మీద

అట్టు లయ్యు కలిని యందచందంబుల
యందు బుధ్ధి కొంత మందగించ
మరల నలు పనంగ నరులకు లోకువ
కరుణలేని వారు కారె జనులు

ఇట్టిది నాయూహ యని
గట్టిగ నీతోడ మనవి కావింతును నే
నెట్టుల జనులకు చెప్పుదు
వట్టిది నా కంఠశోష వసుదేవ సుతా


3 కామెంట్‌లు:

 1. నా ఛందస్సు లేని పద్యం - తప్పులుంటే మన్నిచండి.

  నల్లని రంగు మేనిది
  పిల్లనగ్రోవి మోవికి
  గొల్లపిల్లడె ఆతడు
  చల్లని చూపె వానిది
  ఎల్లర గాచె కన్నయ్య
  తెల్లని మనసే వెన్నయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భగవన్నుతి బాగుంటుంది నాకు. అది ఛందోబధ్దమా కాదా అన్న ప్రశ్న సంగతం‌ కాదు. నిజం చెప్పాలంటే ఛందములు అంటే వేదాలన్న అర్థం ఉంది. కాబట్టి ఛందోబధ్ధం అంటే వేదప్రామాణ్యతకు బధ్ధమైనది అన్న అర్థం వస్తుంది స్పష్టంగా. అందుచేత భగవన్నుతి అన్నది ఏరూపంలో ఉన్నా అది శిరోధార్యమే ఎందుకంటే అది ఎప్పుడూ ఛందోబధ్దమే కాబట్టి. మీ కృష్ణస్తుతి బాగుంది. చాలా సంతోషం కలిగించింది.

   తొలగించండి
 2. ఉత్ప్రేక్ష బాగుంది. నలుపు నారాయణుడు మెచ్చు. పద్యాలు బాగున్నాయి. ఒకటి రెండు ముద్రా రాక్షసాలున్నాయి. సరిదిద్దుకోగలరు.

  హరి హరీ యన శ్రితులఁ గాపాడుననెడి
  తావకీనమౌ నిర్మల ' ధవళ ' కీర్తి
  దిగ్దిగంతాలఁ దరలంగ దేహమందు
  మిగిలె నలుపొక్కటే గదా నిగనిగమని!!!

  అని కూడ ఊహ చేయవచ్చు.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.