19, జూన్ 2017, సోమవారం

నేను -4

ఎందుల కిటు లైనాను
మందుడ నైతిని నేను

కలలా యిది యిలలోని కథయా
యిలయా మరి కలవంటి వ్యథయా
తెలియకుండుచో నిలచే దెట్లా
కలియక యే నిను తెలిసే దెట్లా

పొటమరించగా అహంకారమే
ఇటు వచ్చితినో‌ పొరబడి నేనే
యిటు వచ్చాకే పొరబడి నానో
ఇటునటు పరుగులు మానగ లేనో

తొల్లిటి తెలివిడి దూరం బగుటకు
కల్లప్రపంచమె తగు కారణమా
గుల్లగురుగులీ‌ కల్లయుపాధుల
పెల్లగించుకొను విధమే లేదా

2 కామెంట్‌లు:

  1. మీ "నేను" అన్న శీర్షికలోని రచనలు మంచి తత్త్వాలలా వున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు లలితగారూ. నేను వేదాంతశాస్త్రభ్యసనం చేసినవాడను కాను. ఏదో నా ఆత్మానందం కోసం ఇలా అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉంటాను. తత్+త్వం -> తత్త్వం. అంతే అది (ఈశ్వరుడు) నీవే అన్న అర్థం వస్తుంది. నిజానికి నేను నీవు అన్నభావనలు ప్రకృతివలన కలిగేవి. తానే అతడని తెలిసిననాడు ఈ నేనూ ఆ నీవూ ఒకటై తత్త్వం అన్నది స్థిరపడుతుంది. ఇంకా 'నేను' గానే ఉన్నాడు కదా ఈ‌జీవుడు, కాబట్టి ఇలా గోడు వెళ్ళబుచ్చుకోవటం అన్నమాట. మీకు నచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.