4, మార్చి 2015, బుధవారం

ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!







ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!
ఏదారీ లేదనే గోదారే దిక్కనే ఈ దైన్యం తీరిపోదా!

కనువారలు వినువారలు కనబడరని కలగకు,
కనులపొరల మనుషులకు వినయశీలు రలుసులే !
కనబడని దేవతలకు వినబడులే నీఘోష!
మనజనగణ వేదనలు మలగుదినం‌ కలదులే.     ॥ఏదో ఒకరోజు॥

అసలే ఒక శప్తజాతి ఆంధ్రులన్న పేరుందని,
కసిరికసిరి నసిగినసిగి కొసరే రరకొరగ దొరలు!
రుసరుసలా? నువ్విప్పుడు రొక్కిస్తే ఇదేమని!
దసరాపులులే సుమా పసలేని నేతలు!          ॥ ఏదో ఒకరోజు॥

కలకాలం ఉంటాయా కష్టాలూ కన్నీళ్ళూ?
తెలుగువాడి ప్రభ రేపు దేశంలో వెలుగదా?
తలపొగరు నేతలకు తగినశాస్త్రి జరుగదా?
నిలువదా నీ పక్షం నిలింపుల ఔదార్యం!            ॥ఏదో‌ ఒకరోజు॥









5 కామెంట్‌లు:

  1. మనలో మార్పు రానంతకాలం ఇతరులలో మార్పెలా వస్తుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండి. మనలో మార్పు వస్తే మన పరిస్థితిలోనూ మార్పువస్తుంది. అంతదాకా ఇంతేను!

      తొలగించండి
  2. సంతర్పణ భోజనం
    పథ్యానికి పనికిరాదు
    నలుగుఱితో సహపంక్తి తెలుగు-
    నాటికి అచ్చిరా(లే)దు.
    మన సమస్యల పరిష్కారం
    మఱొకటేదో ఉందిలే
    అది నేను చెప్పనులే.

    రిప్లయితొలగించండి
  3. కాలచక్రం తిరుగుతుంటే ఆకులు కిందవి పైకీ పైవి కిందకీ రావడం సహజం!

    ప్రభవ నుంచి క్షయ వరకూ ఓక్ తమాషా వుంది.మొదటి ఇరవయ్యీ ప్రశాంతతని సూచిస్తే మధ్య ఇరవయ్యీ క్రోధాన్నీ రౌద్రానీ సూచిస్తాయి.మళ్ళీ ఆఖరి ఇరవయ్యీ రివర్స్ గేరులో వుంటాయి.ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు కొన్ని ట్రెండ్స్ రిపీట్ అవుతున్నాయని!

    ఈ మధ్యనే ఒక ఇంగ్లీషు సినిమాలో విలన్ (సినిమాలో అతని పాత్ర ఒక న్యుఊక్లియర్ సైంటిష్టు లెండి) ప్రతి పది(వేలో)ంలియన్లో సంవత్సరాల తర్వాత భూమి మీద అప్పటికి వున్న జీవరాశి అంతమై పోతుంది,అయితే అణుశక్తిని ఉపయోగించి మనమే దాన్ని సృష్టిస్తే ఈ యుగం నుంచి ఆ యుగంలోకి సజీవంగా వెళ్ళొచ్చుననే తింగరి థేఅరీ చెప్తాడు.హీరో అడ్డుకుంటాడనుకోండి,కానీ ఆ ధియరీ వింటుంటే మీకాం గుర్తు కొస్తుంది?నాకు ఆ సినిమా డైరెక్తరు మన మహా యుగాల లెక్కని కాపీ కొట్టాడనిపిస్తుంది!

    కాలం గురించిన మన్వాళ్ళ లెక్కలు కరెక్టు అని నమ్మకం ఉంటే ఆంధ్రావాళ్ళు ఇరవయ్యేళ్ళ తర్వాత తప్పకుండా మంచి స్థితిలోనే ఉంటారు!

    రిప్లయితొలగించండి
  4. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే, వారేరీ? సిరి మూటకట్టుకొని పోవం జాలిరే, భూమిపై పేరైనం గలదే? అంటాడు బలిచక్రవర్తి. ప్రతికాలంలోనూ తాత్కాలికమైన సిరుల కోసం సాటివారిని ముంచైనా ఆనందించేవారూ ఉంటారు, కాలస్వభావంగా గలిగే నిమ్నోన్నతులను ఉదాసీనంగా గమనిస్తూ తృప్తిం జెందని మనుజుడు సప్తద్వీపములనైన జక్కంబడునే అని నిత్యతృప్తులై ఉదారులై వర్తించేవారూ ఉంటారు. నహుషుడిలాగా నడమంత్రపు ప్రాభవాలకే మిడిసిపడే ప్రభువులూ ఉంటారు, సకృత్తుగా రాజుకు ప్రజ శరీరము అనే ధర్మసూక్ష్మాన్ని గ్రహించి సములై వర్తించే ఉత్తములూ ఉంటారు.

    ఒక్కొక్కరి దురాశలకు వారొక్కరే కాక వారి పరివారమూ, చుట్టుపక్కలవారూ, తుదకు యావత్తు జాతి కూడా పరిహారం చెల్లించుకోవలసి వచ్చే ప్రమాదమూ ఉన్నా అట్టి దుర్నీతులకు కాలాంతరంతో నిమిత్తం లేదు కాబట్టి వారిపుణ్యమా అని వర్తమానం శూన్యంగా మారుతుంది తదితరులకు. కాని అది తాత్కాలికమే. ధర్మని స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్ అని కృష్ణవచనంలో వినిపించినదైవం కాలస్వరూపుడని గ్రహించటం విజ్ఞులకే సాధ్యపడే సంగతి.

    కాలగతిని తెలుసుకున్న వారికి వ్యసనపడే పని ఉండదు. అందువలన నేను గతించిన కాలంలో చూచిన అనేక ఎత్తుపల్లాలనూ రాబోయే ఎగుడుదిగుళ్ళనూ కూడా సమానంగానే దర్శిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.