10, మార్చి 2015, మంగళవారం

కవి








నిశ్శబ్దంగా వస్తారంతా
నిశ్శబ్దంగా వెళ్తారంతా
కొందరు మధ్యలో గుబాళిస్తారు
కొంద రందులో మన నేస్తాలు

అందరూ లోకాన్ని చూస్తారు
కొందరే లోతుగా చూస్తారు
కొందరు మనకూ చూపిస్తారు
అందుకే వారు మన నేస్తాలు

మౌనంగా చూసేవాడు ముని
మనకు చూపించే వాడు కవి
ముని తనలో తాను జీవిస్తాడు
కవి మన కోసం జీవిస్తాడు

మనం కవిజీవుల్ని పట్టించుకోం
మనం మనసంగతే పట్టించుకోం
జనం ఇంతే అనుకుంటూనే కవి
మనం బాగుండాలని రాస్తాడు

కవి పరితాపాన్ని తెలుసుకోం
కవిని ఋషియని తెలుసుకోం
కవివిలువని మనం తెలుసుకోం
కవిని స్నేహితుడని తెలుసుకోం

కవి శరీరాన్ని కాలం‌ మింగుతుంది
కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుంది
కవిని మరిస్తే ఏం జరుగుతుంది
జాతి భవితనీ కాలం మింగుతుంది







4 కామెంట్‌లు:

  1. << కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుంది >> కవిత్వాన్ని నిర్లక్ష్యం మింగేయలేదేమో !

    రిప్లయితొలగించండి
  2. అక్షరాలా కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుందండి. ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఎందరో సాహితీమూర్తుల సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయింది. సాక్షాత్తూ అన్నమాచార్యులవారి సంకీర్తనలు ఎన్నో అలా లుప్తమై పోయాయి. వాటిని అప్పటి వారు శాశ్వతంగా పదిలపరచాలని రాగిరేకులమీద చెక్కించి భద్రపరిస్తే వాటిలో ఎన్నో రాగిరేకుల్ని బిందెలూ చెంబులూ చేసుకుందుకు తరువాతి తరాల జనం కరిగించి వేసారు. ఈ విషాదాన్ని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఒక వ్యాసంలో ప్రస్తావించారు. అలాగే‌ అనేక కళారూపాలూ వాటిని నడిపే సాహిత్యప్రక్రియలూ కూడా జననిర్లక్ష్యంతో కాలగర్బంలో కలిసిపోయాయి. హరికథాపితామహ శ్రీమదజ్జాడ నారాయణదాసు గారి కథాసాహిత్యం అదే త్రోవనే పోతోందని తెలుగుజాతి గుర్తించాలి. కాని ఈ‌ జాతికి ప్రస్తుతం క్రికెట్టూ సినిమాలూ రాజకీయాలూ అనే మూడే చాలు మరి. అందుకే నేటి -అక్షరాలా చవకబారు- సినిమాపాటల్ని కూడా సాహిత్యం అనుకునే స్థితి వచ్చింది జనసామాన్యంలో.

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, దృతరాష్త్రుడు మొదట ధర్మరాజును హస్తినాపురం దుర్యోధనుది కొదిలేసి వెళ్లమని అడిగినప్పుడు ప్రత్యేకంగా యేదయినా పేరు చెప్పాడా?అలా మొదత వెళ్ళింది ఇంద్రప్రస్థానికా, ఖాందవప్రస్థానికా?ఖాండవప్రస్థం అనేది అగ్నిదేవుదు ఖాందవ వనాన్ని దహించాక అక్కద కట్టుకున్నది అని నాకు గుర్తు,అంతే అది తర్వాత సాధించుకున్నది,అవునా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దృతరాష్ట్రుడు ఇచ్చిన అర్థరాజ్యానికి రాజధాని ఖాండవప్రస్థమే. అక్కడ, తరువాత శ్రీకృష్ణుని ప్రేరణతో ఇంద్రుని ఆదేశం మేరకు మయుడు వారికి ఇంద్రప్రస్థం అనే క్రొత్త నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. (ఆదిపర్వం. 8వ ఆశ్వాసం)

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.