20, మార్చి 2015, శుక్రవారం

వసంతమన్మథం - ఉగాది పద్యాలూ - ఒకటోరకం సన్మానమూ.

ఈ రోజున మన్మథనామసంవత్సరాగమనం సందర్భంగా ఉగాది కవిసమ్మేళనం ఒకటి మియాపూర్‌లో జరిగింది. ఆ కవిసమ్మేళనం తాలూకు ఆహ్వానాన్ని ఇక్కడ చూడవచ్చును.

నిన్నో మొన్నో శ్రీ ములుగు అంజయ్యశతావధానిగారు నాకు ఫోన్ చేసి ఆహ్వానించారు. సరే అన్నాను.

నిజానికి నా పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంది వృతిగతమైన కార్యక్రమాలతో. అందుచేత అ కార్యక్రమానికి వెళ్ళటం సాధ్యం కాదనిపించి ఈ రోజున చింతావారికి ఫోన్ చేసి వివరించటానికి ప్రయత్నించాను. కాని,  నా యెడల వాత్సల్యం కొద్దీ,  వారు నేను రావలసిందే అని అజ్ఞాపించారు - వారికి అలాగేనని మాటయిచ్చి ఆకార్యక్రమానికి హాజరయ్యాను.

అక్కడికి వెళ్ళేదాకా ఒక్క పద్యమూ వ్రాసుకొనేందుకు సమయం లేదు. ఒక ఐదు పద్యాలను అక్కడే సభాంగణంలోనే వ్రాసుకొన్నాను.  రామేతరం రమ్యేతరం అనే ప్రవృత్తి గల నా మనస్సుకు ఇలా సందర్బోచిత పద్యరచనపై అంతగా ఆసక్తి కూడా లేదు. కాని సభలో పద్యాలు చదువుతానన్నాను కాబట్టి అక్షరాలా పెన్ను బయటకు తీసి చచ్చీచెడీ మరీ వ్రాసాను. చెత్తో పెన్నుపుచ్చుకొని వ్రాయటం మానేసి దశాబ్దాలు ఐనది కదా! ఎంతకష్టం ఎంతకష్టం.

కార్యక్రమం దిగ్విజయంగానే జరిగింది.  కవిత్వం వినిపించటానికి వచ్చినవారి సంఖ్య మాన్యమే ఇనా వినటానికి వచ్చినవారి సంఖ్య మాత్రం శూన్యం. మొత్తం మీద అందరూ ఎవరికి తోచింది వారు వినిపించగలిగారు కాబట్టి దిగ్విజయమే అనుకోక తప్పదు.

నాకేమో ఈ‌ రోజున రాత్రికూడా కొంత ముఖ్యమైన పనులున్నాయి వృత్తిగతంగా.  చదివే వారి లిష్టులో మొదటే తొంగిచూసి నాది తొమ్మిదో‌నంబరు అని తెలుసుకున్నాను.

కాని నేను కుయ్యో మొఱ్ఱో అంటున్నా చివరికి నేను ఇరవైతొమ్మిదో వాడిగా వేదిక ఎక్కానేమో. అంటే నేనే చివరినుండి మొదటి వాడినోచ్ అని సంబరపడవచ్చు నన్న మాట.

అప్పటికే రకరకాల కవిత్వాలకూ కాలక్షేపం తవికలకు ఉన్న కాస్తమందీ‌ తప్పట్లు కొట్టి అలసిపోయారు.

కొంతమంది తమతమ కవితలు వినిపించి శాలువా కప్పించుకొని చక్కాపోయారేమో‌ కూడా.

సభమధ్యలో ఒకటి రెండు ప్రత్యేక సన్మాన కార్యక్రమాలూ‌జరిగాయి . అందులో ఒకటి చింతావారి వేదపఠనంతో సహా. 

మరికొంత మంది చీకటి పడుతోందనీ తమకు అవకాశం వస్తుందో రాదో‌ అనుకొని, వేచి చూసే ఓపిక లేక వెళ్ళిపోయినట్లున్నారు.

కొందరైతే కవితలను వినీవినీ అలసిపోయి ఇంక వినే ఓపిక ఉడిగి నిస్త్రాణగా ఉండిపోవటమో, ఇంకా ఓపికుంటే వేరే వాళ్ళతో‌ కబుర్లతో కాలక్షేపం చేస్తూనో ఉండిపోయారు.

అప్పుడు పిలిచారు నా పేరు. అప్పుడు వేదిక ఎక్కాను నేను.

నిర్మొగమాటంగా చెబుతున్నాను. నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్న ఆరాటమే ఎక్కువగా ఉంది.  ఎందుకంటే అఫీసువారికి నేను ఇవ్వవలసిన అప్‌డేట్లు కొన్ని అర్జంటుగా ఉన్నాయి మరి.

కాని చింతావారిని చిన్నబుచ్చటం ఇష్టం‌ లేక  అక్కడ వేచి ఉన్నా నంతే.

కించిదుదాసీనంగానే వేదిక మీదకు వెళ్ళగానే అద్యక్షులవారు 'అట్టే సమయం లేదు క్లుప్తంగా చెప్పండి' అన్నారు.

నేను కూడా ఐదు పద్యాలు కాబోలున్నాయి. ఐనా క్లుప్తంగానే ముగిస్తాను లెండి, నాకూ సమయాభావం ఎక్కువగానే ఉందని ప్రతిస్పందించాను.  ఆయన ఫరవాలేదు పంచరత్నాలూ చదవండి అన్నారు. సరే నని చదివాను.

అవి ఇవిగో:


మన్మథుడి కన్నా ముందుగా వసంతుడు వస్తాడు. ఎందుకంటే వసంతః సామంతో అని శ్రీశంకరులు సౌందర్యలహరిలో ధృవీకరించారుకదా. అందుచేత మొదట   వసంతుడూ ఆ పిమ్మట తీరిగా మన్మథుడూ రావటం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం వసంతకాలానికి స్వాగతం చెబుదాము.

వసంతాగమం
(వసంతచామరవృత్తం)
      ప్రమోదరూపమా వసంతకాలమా
      అమోఘభవ్యదివ్యరూపశోభలన్
      సమంచితంబుగా సదాసుఖావహం
      బమంగళాపహం బనంగ వెల్గుమా

వసంతం వచ్చి కొన్నాళ్ళైనా (నిజానికి వసంత సాయనమానం ప్రకారం ఎప్పుడో వచ్చింది కదా), ఇంకా మన్మథుడు రావటానికి మొగమాటం పడుతున్నట్లున్నాడు.  ఎందు కాయనకు ఇంత తటపటాయింపు?

(వసంతమాలికావృత్తం)
      ఇదిగో ఇదిగో ఇదేమిటయ్యా
      ముదముల్ గూర్చెడు మూర్తివే మహాత్మా
      సదయా యిటురా జనార్తి బాపన్
      పదముల్ మోప రవంత పంత మేలా

ఇలాగని ఆయన్ను  బ్రతిమలాడి, ఆయన సరే నని వస్తుంటే మనం స్వాగతం చెబుతున్నాం

(వసంతచామరవృత్తం)
      ఒకింత ముందుగా వచింతు మన్మథా
      ఒకింత యింపుగా ఉగాది మన్మథా
      ఒకింత మంచిగా వెలుంగు మన్మథా
      ఒకింత మేలుగా వెలుంగు మన్మథా

ఇలాగని మన తెలుగింటికి  ఆత్మీయాహ్వానం పలికి తెలుగువాడిగా ఆదరంగా తెలుగు మన్మథా అని మరీ ముద్దుచేస్తున్నాం..

హమ్మయ్య సంవత్సరాధిపతి మన్మథుడు మనింటికి విచ్చేసాడు. ఆయన రాక వలన మనందరికీ శుభాన్ని ఆకాంక్షిద్దాము.

(వసంతతిలకవృత్తం)
      సంతోషకారక మనంగ సదాసుయశం
      బెంతేని కన్పట్టి ఉగాది కెసంగు చుండున్
      చింతల్ తొలంగును సుఖంబు చివుళ్ళు వేయున్
      కొంతైన నాంధ్రుల ప్రతిష్ఠకు మంచి కల్గున్

(వసంతవృత్తం)
      తెలుగువారికే తీరుగా సౌఖ్యముల్
      కలుగు నారీతి కాలముం  బోవగన్
      తలపు లందునుం దప్పులం బోవమిన్
      నిలచుగాక మా నేతలన్ బుధ్ధులున్

స్వస్తిరస్తు.హమ్మయ్య పద్యాలు చదివేశాను కదా.
చాలా సంతోషం కలిగింది.
దానికి రెండు కారణాలు.

నాకు సభల్లో మాట్లాడే అలవాటు లేదు. అందుచేత ఒక్కముక్కలో చెప్పాలంటే 'మాట్లాడలేను'.

ఏదో‌ కంగారు కంగారుగా గడాగడా చదివేసి బయటపడిపోతానని నాకు బాగా తెలుసు. ఒకటి రెండు సార్లు జరిగిందదే కదా మరి?

కాని ఆశ్చర్యం ఏమిటంటే, ఏ‌ కంగారూ లేకుండా తాపీగా నాకు చేతనైనంత శ్రావ్యంగా నా కవిత్వాన్ని గానం చేయగలిగాను. అది నా సంతోషానికి మొదటి కారణం.

రెండవ కారణం ఏమిటంటే ఇక నేను బయటపడి వీలైనంత వేగిరం ఇంటి చేరి నా వృత్తిగత కార్యక్రమాలను మాటరాకుండా నిర్వహించుకొనేందుకు ఇంకా సమయం మించిపోలేదు.  ఇదింకా ముఖ్యమైన కారణం.

నిజానికి సభలో కూర్చున్నవారికి కూడా ఎప్పుడు ఈ‌సభ ఐపోతుందా ఇంటికి వెడదామా అని ఉందేమో.  అప్పటికే‌ ముందే చెప్పిన కారణాలవల్ల విసిగిపోయి ఉన్నారు కదా.

అందుకని ఒక్కరంటే ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు.

అంతదాకా ప్రతికవితనూ ఏదో ఒక రకంగా భళాభళీ అంటున్న సభాద్యక్షులవారూ పెదవి విప్పితే ఒట్టు.

ఐనా అందరికి లాగానే నాకూ ఒక శాలువా కప్పారు. ఒట్టు. చచ్చే సిగ్గు వేసింది.  ఎందుకొచ్చిన సన్మానం ? ఎందుకొచ్చిన శాలువా? అనిపించింది. అసలు ఎవరైనా కనీసం విన్నారా ? ఈ మాత్రం‌ భాగ్యానికి నాక్కూడా సన్మానం ఏమిటీ అని?

ఐనదేమో ఐనది.  నేనూ ఇంటికి బయలు దేరాను ఆదరాబాదరా.

నాకు ఈ కార్యక్రమం నిరుత్సాహం కలిగించిందన్న మాట వాస్తవమే ఐనా నాకు అదే అమిత సంతోషం‌ కలిగించింది మరికొన్ని కారణాల వలన

ఈ‌ కార్యక్రమానికి శ్రీకంది శంకరయ్యగారు వచ్చారు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవటం నాకు ఇదే‌ ప్రథమపర్యాయం.

అదీ కాక శంకరాభరణం మిత్రులు మరి కొందరు వచ్చి కవిత్వాలు వినిపించారు. అదీ చాలా  సంతోషం‌ కలిగించిన విషయమే. సభలో శంకరయ్యగారికి అందిన ఆత్మీయస్వాగతం అన్నింటికన్నా నాకు మిక్కిలి సంతోషం కలిగించింది.

శ్రీ శంకరయ్యగారు నా కవిత్వం చదివి దానికి వసంతమన్మథం అని దయతో నామకరణం చేసారు. ఆ మాట కూడా పద్యాలను చదివే ముందే సభకు సవినయంగా మనవిచేసి మరీ మొదలుపెట్టాను.

వేదిక దిగిరాగానే నాతో‌ చింతావారొక మాట అన్నారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన వివేచనం అని.  ఈ శ్లోకం ఏమిటంటే

విద్వానేవ విజానాతి విద్వజ్జన వివేచనమ్‌
నహి వంధ్యా విజానాతి గుర్వీం‌ ప్రసవ వేదనామ్‌

అని.  నేను మాత్రం 'అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ' అనుకొని బయటకు వచ్చాను.