13, మార్చి 2015, శుక్రవారం

హేతువాదమూ - జ్యోతిషమూ.

రాజసులోచనం బ్లాగు (http://rajasulochanam.blogspot.in/)లోని ఒక టపాకు (http://rajasulochanam.blogspot.in/2015/03/blog-post_2.html)  నేను చేసిన వ్యాఖ్యకు మరింత వివరణగా ఇది వ్రాస్తున్నాను.

నేను దివంగత బి.వి.రామన్ గారి వీరాభిమాని నేమీ‌ కాను. కాని ఒకప్పుడు వారి Astrological Magazine of Inida మాసపత్రికను తరచుగానే ఆసక్తిగా చదివే వాడిని. ఇప్పుడెందుకు చదవటం లేదలా అంటే, దానికి సవాలక్ష కారణాలున్నాయి. అది వేరే సంగతి. ఆయన ఆ పత్రికకు వార్షిక సంచికను ప్రత్యేకగా చాలా ఎక్కువ పేజీలతో ఎక్కువ సరంజామాతో నూత్న ఆంగ్లసంవత్సరారంభసంచికను దాదాపు ఒక నెల రోజులు ముందే విడుదల చేసేవారు. అది ప్రత్యేకంగా కొని మరీ‌ చదివే వాడిని. ఇదంతా ఎందుకు ప్రస్తావించానంటే ఆయన ప్రతివార్షికసంచికలోనూ రాబోయే సంవత్సరకాలంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను గురించి అంచనాలను ప్రకటించేవారు. అలాగే ఆ సంచికలో గతసంవత్సరపు అంచనాలు ఏమేరకు ఫలించినదీ కూడా విశ్లేషించేవారు. 

ఆ సంచికలు ఎన్నడూ‌ హేతువాదులు పరిశీలించినట్లు నా దృష్టికి రాలేదు.  పరిశీలిస్తే వాటిలో నిజానిజాలను బట్టి వారికి జ్యోతిషం పట్ల అవగాహన మరికొంత నిర్దుష్టంగా రూపుదిద్దుకునేది. కాని చిత్రమేమిటంటే, జ్యోతిషం అనేదానిపైన ఏమాత్రం అధ్యయనమూ చేయకుండానే తరచుగా జ్యోతిషానికి వ్యతిరేకంగా వీరావేశంతో మీడియాలో హడావుడి చేస్తుంటారు. పుస్తకాలూ వేస్తుంటారు.

జ్యోతిషంపై హేతువాదుల పుస్తకాలు అంటే ఒక విషయం గుర్తుకు వచ్చింది. చెబుతాను. చాలా కాలం క్రిందటం అంటే గత ఎనభయ్యవ దశకంలో విజయవాడనుండి ప్రచురితమైన ఒక పుస్తకం జ్యోతిషంపైన నిప్పులు చెరిగింది. అది ఒక చిన్న పుస్తకం.

నా మస్తకం అప్పుడున్నంత పదునుగానూ‌ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి దానిలో నుండి ఒక విషయం ప్రస్తావిస్తున్నాను. ఉన్నవి పన్నెండే రాశులు. అందులో కేవలం తొమ్మిది గ్రహాలను అమర్చి చూపి రాశిచక్రం అంటారు. పన్నెండు గళ్ళల్లో తొమ్మిది గ్రహాలను కేవలం కొద్ది రకాలుగానే అమర్చగలం కదా. అంటే ఒకే రాశి చక్రం అనేక మందికి వస్తుంది....  

ఇలా సాగింది ఆ పుస్తకంలో‌ తర్కం.

మీ కిందులో తప్పు ఏమన్నా ఉందా లేదా అన్న విషయం కొంచెం సేపు ఆలోచించుకొని ఆ తరువాత క్రింద నేను ఇచ్చే తర్కం చూడండి దయచేసి!

రాశి చక్రంలో ఒక గ్రహం ఉన్న స్థానాన్ని ఒక అంకెతో సూచిద్దాం అనుకుందాం. మనం నిత్యం వాడే దశాంశ గణన విధానంలో అంకెలు పదే ఉన్నాయి. కాని మనకి మన్నెండు రాశులున్నాయి కాబట్టి ద్వాదశాంశ విధానంలో అంకెలు వాడుదాం. ఇవి సున్న నుండి పది వరకూ పది, అపైన A, B అనే మరొక రెండు అంకెలు.
అలాగే గ్రహాలు తొమ్మిది అనుకున్నాం కాబట్టి మనం ఒక తొమ్మిది అంకెల పొడుగున్న సంఖ్యగా ఒక రాశిచక్రం అమరికను సూచించవచ్చును.  గ్రహాలకు వారాల క్రమంలో రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనీ ఆపైన రాహు, కేతు అనీ తొమ్మిదింటికి ఎడమనుండి కుడికి అమరిక అనుకుందాం.

అన్నట్లు, లగ్నం అనేదొకటి కూడా రాశిచక్రంలో గుర్తించి తీరుతాం కదా. అది పదవ గ్రహం లాంటి దనుకుందాం. దానిని పదవస్థానంలో గుర్తిద్దాం.

ఒక రాశి చక్రం ఉదాహరణకి:

రవి చంద్ర మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతు లగ్నం
1 5 A 0 6 2 B 7 2 8

ఇప్పుడు గమనించండి. ప్రతిరాశిచక్రాన్నీ మనం ద్వాదశాంశ విధానంలో పదిస్థానాల సంఖ్యగా వ్రాయవచ్చునని స్పష్టం అవుతున్నది కదా.

ఒక చిన్న ప్రశ్న. 

దశాంశ విధానంలో మూడుస్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

సమాధానం, 10 x 10 x 10 = 1000 అని కదా,

ద్వాదశాంశ విధానంలో పది స్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

జవాబు. 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 =  6191,73,64,224.
అంటే, 6191 కోట్ల పై చిలుకు భిన్నమైన రాశిచక్రాలుంటాయన్న మాట.

భారతదేశ జనభా 1947లో ఇంచుమించు 30 కోట్లని గుర్తు. ప్రస్తుతం 100కోట్ల పై చిల్లర. ప్రపంచ జనాభా ప్రస్తుతం  732,47,82,000 అంటే 732 కోట్ల చిల్లర.

దీనిని బట్టి ప్రస్తుతంలో కాని గతంలో కాని ఎన్నడూ ప్రపంచజనాభా గణితం ప్రకారం సాధ్యమయ్యే రాశిచక్రాలకన్నా ఎక్కువగా లేదు.  ముందు ముందు అది 6191 కోట్లకు చేరితే మనుష్యులను మేపేంత తిండిని భూమి పండించలేదు.

ఒక్క విషయం దాపరికం లేకుండా చెప్పవలసింది ఉన్నది. బుధుడూ శుక్రుడూ రవికి సమీపంలోనే ఉండి తీరాలి. అలాగే రాహుకేతువులు ముఖాముఖీ రాశుల్లోనే ఉండి తీరాలి. కాబట్టి గణితసాధ్యమైన 6191కోట్ల కన్న కొద్దిగా తక్కువగా రాశిచక్రాలు సాధ్యం. 

అవునూ, ఇదంతా సోది ఎందుకు చెప్పానూ?  ఒక హేతువాద పుస్తకంలో ఉన్న అమాయకపు అవగాహనను ఎత్తి చూపటానికే కదా? 

ఇలాంటి తప్పుడు అవగాహనల వాళ్ళూ జనానికి శాస్త్రీయదృక్పధాన్ని పంచటం కోసం జ్యోతిషాన్ని ఎగతాళి చేస్తూ పుస్తకాలు రాస్తుంటే, జనానికి విజ్ఞానం అందుతోందా?  ఆ పేరుతో అజ్ఞానం అందుతోందా?

ఒకప్పుడు మహేంద్రలాల్ సర్కార్ అని గొప్ప వైద్యశిఖామణి ఉండేవారు. ఆయన హోమియో వైద్యాన్ని తిట్టిని తిట్టు తిట్టకుండా చెరిగి పారేస్తూ పెద్ద ఉపన్యాసం సభాధ్యక్షస్థానం నుండి ఇస్తే అంతా భళాభళీ అన్నారు. బాగుంది. కాని ఆయన స్నేహితుడు మరొక డాక్టరు గారు తప్పుపట్టారు. హోమియో వైద్యం గురించి నీకు స్వయంగా ఎంత తెలుసూ అని నిలదీసారు. సర్కారు గారు ఆలోచనలో పడిపోయారు. జర్మనీ నుండి హోమియో వైద్యం గురించిన గ్రంథాలు సేకరించి వాటిలో మునిగి తేలారు.

తరువాత ఏమయ్యింది?

సర్కారుగారు స్వయంగా హోమియో వైద్యుడిగా అవతారం ఎత్తి యావజ్జీవం హోమియోపతీకే అంకితం ఐపోయారు. బెంగాల్లో ఆయనపేరున కాలేజీ కూడా ఉందనుకుంటాను.

మరి ఈ సోది ఎందుకు చెప్పానూ?

హేతువాదులయ్యేది కాకపోయేది జ్యోతిషం అనేదాన్ని సుబ్బరంగా విమర్శించవచ్చును. నేనే బోలెడు విమర్శ రాయగలను. అది వేరే సంగతి. చెప్పొచ్చేదేమిటంటె, జ్యోతిషాన్ని చెరిగిపారేద్దామనుకునే వాళ్ళు ముందుగా బుధ్దిగా జ్యోతిషంలో మంచి పాండిత్యం సంపాదించాలి. అప్పుడు విమర్శించితే అదొక అందం.

నూటికి నూరు శాతం ఋజువు చేయటం అనేది వేరే సంగతి. ముందు వినయంగా జ్యోతిషాధ్యయనం చేస్తే చాలా విషయాలే తెలుస్తాయి. 

ఇంకా చాలా సంగతులు రాయవచ్చును ఈ‌ విషయంలో. కాని పాఠకులకు నేను చెప్పదలచినది ఇప్పటికే అర్థమై ఉంటుంది కాబట్టి ఆట్టే గ్రంథం పెంచటంపై ఆసక్తి లేదు.

ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. నేను కూడా ఒక జ్యోతిషపండితుడి సూటి ఫలితాలకు ఆశ్చర్యపోయిన తరువాత ఈ జ్యోతిషం అంటే ఏమిటో అన్న కుతూహలంతోనే అధ్యయనం చేసాను. నాకు నచ్చినవి అనేక విషయాలున్నాయి, నచ్చనివీ ఉన్నాయి కొన్ని కొన్ని.

9 కామెంట్‌లు:

 1. దేన్నయినా పూర్తిగా అధ్యనం చేసి తప్పొప్పులు చెప్పడం బాగానే ఉంటుంది. హేతువాదులు ముందుగా ఒక నిర్ణయానికొచ్చి మాటాడతారు, మీరెంత చెప్పినా వినరు....

  రిప్లయితొలగించండి
 2. సార్ నాకు కొన్ని ప్రశ్నలు తోస్తున్నాయి:

  1. రామన్ గారు చేసిన ఫోరుకాస్టు లు జరగలేదని రుజువులు చూపమని హేతువాదులను అడిగే బదులు అవి 99.9% జరిగాయని చూపిస్తే బాగుండేదేమో.

  2. ఇంతకంటే ముఖ్య విషయం. శాస్త్రానికి రుజువు ఒక్కటే ప్రమాణం కాదు. ఒక విషయానికి దాని పర్యవసానానికి లాజికల్ వివరణ (nexus between cause & effect) ఉండాలి. ఇలాంటిది ఉంటె దాని మీద చర్చ మళ్ళితే మంచిది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రానికి రుజువు ఒక్కటే ప్రమాణం కాదు. ఒక విషయానికి దాని పర్యవసానానికి లాజికల్ వివరణ (nexus between cause & effect) ఉండాలి
   ans/ques:ది మీ సొంత ధెయరీయా?ఆధునికం అనే వాటి గీటురాయితోనే అన్నిట్నీ పరిశీలించాలని మీ వుద్దేశమయితే ఆ శాస్త్ర సాంకేతిక పరమైన సిధ్ధాంత గ్రంధాల్లోనే అన్నింతినీ లాగిక్ పరంగా గుదిగుచ్చలేక ఎక్సెప్షన్ల లిస్తులు పెదుతున్నారు!ఎక్సెప్షన్లు చూపించని ఆధునిక సిధ్ధానతం యేదయినా వుంటే చెప్పండి?కొన్ని చోట్ల అసలు సిధ్ధాంత కర్తలు చూపించకపోతే మిగతావాళ్లు కనుక్కుని మరీ చేర్చమని చెప్తారు,అవునా కాదా?

   తొలగించండి
  2. ఇది శాస్త్రజ్ఞులలో బహుళ అంగీకారం (broad consensus) ఉన్న విషయమే.

   తొలగించండి
  3. అంటే ఇప్పటి శాస్త్రజ్ఞులు వాళ్ళ సిధ్ధాంతాల్లో తప్పులు ఉంటే - అవే లెండి ఎక్సెప్షన్లు ఉంటే - వాళ్లలో వాళ్ళు నీ తప్పుని నేను కాస్తా నా తప్పుని నువ్వు కాయి అని సర్ది చెప్పేసుకునే యేర్పాటు ఉండటం వల్లనే అవి అందరూ ఒప్పుకుంటున్న పరమసత్యాలు అయ్యాయి,అవునా కాదా?ఆ యేర్పాటుని వారు యెప్పటి నుంచో అంచనాల్ని కరెక్టుగా చెప్తున్న భారతీయ జ్యొతిష్య శాస్త్రానికి మాత్రం వర్తింప జెయ్యరు చేస్తే ఒప్పుకోరు,అంతేనా?

   తొలగించండి
  4. హరిబాబుగారూ, పొరబడుతున్నారేమో!

   సిధ్ధాంతాల్లో తప్పులు ఉంటే అవి చెల్లకుండా పోతాయి. ఆ అవిషయంలో సర్ది చెప్పేసుకునే యేర్పాటు ఏమీ ఉండదు.

   ఎక్సెప్షన్లు అనేవి సిధ్ధాంతాల్లో తప్పులు కానే కావు. సర్ది చెప్పేసుకునే యేర్పాటు అన్నది ఏమీ అవసరం కాదు కూడా.

   శాస్త్రజ్ఞులు వాళ్ళ సిధ్ధాంతాలు వ్యక్తిగత ఆస్తుల వంటివిగా పరిగణించరు. ఆ సిధ్ధాంతాలు ఎవరి వల్ల వెలుగు చూసినా చివరికి ఐన్‍స్టీన్ సిధ్ధాంతాలు ఐనా వాటిని నిశితంగానే అందరూ పరిశీలిస్తారు. ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు ఆయన సిధ్ధాంతాలనూ వాటి పరిణామాలద్వారా వచ్చే అంచనాలనూ కూడా.

   యెప్పటి నుంచో అంచనాల్ని కరెక్టుగా చెప్తున్న భారతీయ జ్యొతిష్య శాస్త్రానికి మాత్రం వర్తింప జెయ్యరు అనటం సరి కాదని కూడా అనిపిస్తోంది. అంచనాల్ని కరెక్టుగా చెప్తున్న విషయం ఋజువు చేయమనే నేటి కాలం వారి కోరిక. అది కొంతవరకూ సబబే కూడా. ఆ దిశగా జ్యోతిషవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు నాకైతే అనిపించటం లేదు.

   ఇంకా మన జ్యోతిషవేత్తలు, అందులో ప్రముఖులూ, ప్రముఖత్వంకోసం సూటిగానో పరోక్షంగానే ప్రయత్నిస్తున్నవారితో సహా అందరూ అశాస్త్రీయమైన వివరణలే ఇస్తున్నారు. ఉదాయరణకు ఒక బ్లాగరు జ్యోతిష్యవిదులు సూక్ష్మజ్యోతిషం అంటారు, ఇంట్యూషన్ అంటారు. విద్యారహస్యాలు అంటారు. ఈ మాటలేవీ కూడా ఆధునికులకు రుచించేవి కావు. ఇంట్యూషన్ అంటే ఎలా? వెరిఫైయబులిటీ, రీపీటబులిటీ వంటి లక్షణాలు చూపని ప్రతిపాదనలూ వివరణలూ ఒప్పవు కదా.

   ఇంకా కొన్ని విషయాలు వ్రాయాలి కాని సమయం కుదరదు ప్రస్తుతం.
   తొలగించండి
 3. జైగారూ,

  ఎవరి ఎవరికి ఋజువులు చూపాలి? ఎందుకు చూపాలి? హేతువాదులను జ్యోతిషవాదులు సవాలు చేస్తున్నారా? లేక హేతువాదులు సవాళ్ళు విసురుతున్నారా?

  జ్యోతిషం ఒక ఆధునికవిజ్ఞాశాస్త్రం వంటిది అనో కాదనో అసలు శాస్త్రమనో కాదనో వాదన జ్యోతిషవాదులు చేయనవసరం‌లేదు. వారు వారికి తోచినరీతిలో జ్యోతిషాన్ని అధ్యయనం చేస్తున్నారు వినియోగిస్తున్నారు. అనుమానం ఉన్నవారు అధ్యయనం చేసి నిజానిజాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చటం ఉచితం. అప్పుడు జ్యోతిషవాదులకు అనుమాననివృత్తి చేసేందుకు అస్కారం ఉంటుంది. అలా కాక విషయమూ దాని పరిభాషా వంటివేమీ తెలియకుండా వాదనకు దిగేవారితో జ్యోతిషవాదులు ఎందుకు తలపడాలీ?

  సరిగా అధ్యయనం చేస్తేనే ఏదైనా శాస్త్రమూ దానికి సంబంధించిన కార్యకారణాది సంబంధాలూ అవగాహన అవుతాయి.

  మాటవరసకు, నాకు సాపేక్షసిధ్దాంతం పైన అవగాహన లేదు. నన్ను నమ్మించే పూచీ‌ ఆ సిధ్ధాంతానికీ లేదు కదా? నాకు అవసరమైతే నేనే అద్యయనం చేసి తెలుసుకోవాలి. దానికి సహాయం తప్పకుండా అందుతుంది. కాని నేను ప్రశ్నలు వేస్తానూ సవాళ్ళు చేస్తానూ అంతకు మించి ఏమీ చేయనూ, నాకు అర్థమై తీరకపోతే అది శాస్త్రం కాదూ లేదా నాకు మీరు నాకు నచ్చే ఋజువులూ సాక్ష్యాలూ తర్కాలూ ముందుంచకపోతే అదొక శాస్త్రమే కాదూ‌ అంటే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. అలాంటి వారితో చర్చకు కూర్చోవటానికి శాస్త్రవేత్తలకు ఆసక్తి ఉండాల్సిన పనీ లేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేను చెప్పదలచినది తెలుగులో కుదరడం లేదు అంచేత ఆంగ్లంలో చెప్తాను.

   Any discipline that claims to beyond reason does not deserve the science label. As I understand, some individuals believe astrology (not astronomy) is a science. Therefore the onus is on them to prove cause-effect (and experimental proof) as per scientifically manageable standards.

   This does not apply to the theory of relativity that has crossed the barrier and is accepted broadly across the scientific community.

   Matters of faith are exempt but these do not claim to be scientific truth.

   There is no contradiction between the terms astrologer & rationalist (unless you use either/both in ideological idiom).

   తొలగించండి
  2. జైగారూ,

   రెండు విభిన్న దృక్కోణాలకు సంబంధించిన విషయాలివి. సంతృప్తికరమైన కార్యకారణసంబంధ వివరణా నిరూపణా అనేవి ఉన్నాయని ఒక పక్షం అభిప్రాయపడ వచ్చును. మరొక పక్షం అవి లేవని అభిప్రాయపడ వచ్చును.

   ఒక విషయానికి సంబంధించిన నిరూపణలూ వివరణలూ వగైరా ఆ విషయానికి చెందిన పరిభాషతోనూ ఆ విషయానికే ప్రత్యేకమైన భావనలతోనూ ఆ విషయానికే సంబంధించిన సిధ్ధాంతాలతోనూ నిండి ఉంటాయి. అందుచేత ఆ పారిభాషిక పదజాల భావజాలాదులను సరిగా అవగాహన చేసుకోకుండా అంతే కాక అవగాహనకు తెచ్చుకొనే ప్రయత్నమూ చేయకుండా ఆ విషయసంబంధి సమస్తాన్నీ నిరాకరించటం సరైన విధానం‌ కాదు. ఇదే నేను నొక్కి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. నేను నా మాటలను తూకం వేసి మరీ వ్రాస్తున్నానని మీరు గ్రహించే ఉంటె కృతజ్ఞుడను. కాకుంటే ఫరవాలేదు. నా వైపునుండి చెప్పటాని కింకేమీ‌ లేదనుకుంటాను.

   మీరు హేతువాదులు అందరూ కాకపోయినా అనేకులు తమకు ప్రాథమికమైన అవగాహన లేని విషయాల్లో కూడా భారీస్థాయి తిరస్కరణప్రకటనలు చేస్తున్నారని గ్రహించాలని ఆశిస్తున్నాను. దీనిని ఎత్తి చూపటం నా యీ‌టపా ప్రథానోద్దేశం కూడా అని మీకు అర్థమై ఉంటుందని నా భావన. ఈ కారణం వలననే నేను ఖండించదలచుకున్నా భళాభళీ మండనలు చేయదలచుకున్నా విషయంమీద తగిన పట్టు ఉండాలని సూచిస్తున్నాననీ మీకు అర్థమై ఉంటే సంతోషం.

   ఏదైనా విషయాన్ని విశ్వసిస్తున్నవారు తాము ఎందుకు విశ్వసిస్తున్నదీ చెప్పగలగాలి అన్నది నిజమే - కాని ఆ ఉధ్ఘాటనల్లో పరిభాష ఉంటుంది - అది ఆ విషయాని చెందినదై ఉంటుంది తరచుగా. ఆ విషయాన్ని విశ్వసించని వారు వేరే పరిభాషతో జగడం వేసుకుంటే, అది కూడా అవగాహనను సరిగా పెంపొందించుకోకుండానే, ఉభయపక్షాలమధ్యనా సరైన చర్చ అసాధ్యం. ఎవరికి వారు ఆవలి పక్షాన్ని దుమ్మెత్తి పోయటం‌జరుగవచ్చును కాని మరేమీ ప్రయోజనం‌ ఉండ దలాంటి చర్చలకు.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.