5, ఆగస్టు 2013, సోమవారం

మా బేబిపిన్ని కోసం మరోసారి శ్రీకృష్ణా యదుభూషణా...
నిన్నటి శ్యామలీయం భాగవతం బ్లాగు టపా కుంతీమహాదేవి భక్తి తత్పరత లో ఈ క్రింద వ్రాసిన పద్యాన్ని ప్రస్తావించటం జరిగింది.  కుంతీమహాదేవిగారు శ్రీకృష్ణపరమాత్మను పస్తుతిస్తూ చెప్పిన పద్యాలలోది ఇది.

శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణసంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే‌ భవలతల్ నిత్యానుకంపానిధీ

[ ఓ శ్రీకృష్ణా.  నువ్వు యదువంశానికి గొప్ప అలంకారానివి. అర్జునుడికి పరమ మిత్రుడివి. సమస్తజీవులలో ఉన్న సాత్వికభావానికీ సముద్రం వంటివాడివి. లోకద్రోహులైన రాజల వంశాలను దహించిన కార్చిచ్చువు. సర్వలోకాలకు అధిపతివి. సమస్త దేవతా సమూహాలకీ, బ్రాహ్మణులకీ, గోధనానికీ ఏ‌ చిన్న కష్టం వచ్చినా తీర్చే మహానుభావుడివి.  భక్తులకి మోక్షం ఇచ్చే వాడివి. నాయనా, నా భవబంధాలను తెంచివేయవయ్యా. నువ్వు నిత్యం భక్తులమీద దయ చూపే వాడివి. మీకు మొక్కుతున్నాను. ఇదే నా కోరిక.]

ఈ పద్యాన్ని ఉటంకిస్తూ  కష్టేఫలీ శర్మగారు ఒక వ్యాఖ్య ఉంచుతూ, ఇది నిత్యం పారాయణం చేయవలసిన పద్యం అన్నారు. తప్పకుండా కంఠస్థం చేసుకుని వీలు చిక్కినప్పుడల్లా పోతనగారి భాగవతపద్యాలు మననం చేసుకుంటే ఆ ఆనందం అనుభవైకవేద్యమే కాని మాటల్లో అర్థమయ్యేలా చెప్పటం వీలుపడదు.   ఒకానొకరు నా పాహిరామప్రభో పద్యాలను గురించి  ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలీ?   అన్నారు.  దానికి నా కేమీ బాధలేదు.  కాని పోతన్నగారి పద్యాలను తిరిగి తెలుగుజాతి చదువుకుని ఆనందానుభూతి చెందాలని మాత్రం నేను త్రికరణశుధ్ధిగా ఆశిస్తున్నాను.

ఈ శ్రీకృష్ణా యదుభూషణా, నరసఖా... పద్యంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.  ఆ మధురమనోజ్ఞపద్యరాజం తో నాకున్న అనుబంధం దివంగతురాలైన నా పిన్ని సువర్ణలక్ష్మి యొక్క దివ్యస్మృతితో ముడిపడి ఉంది.

మా పిన్ని సువర్ణలక్ష్మిని అందరూ బేబీ‌ అని పిలిచే‌వారు. ఆమె నాకు బేబీపిన్ని.  ఎంతో సౌమ్యురాలు.  బేబీపిన్ని నా కంటే మహా అయితే ఏణ్ణర్థం పెద్ద. నా కంటే ఒక తరగతి పై చదువులో ఉండేది.

ఒకసారి మా అమ్మానాన్నగార్లతో పాటు మా మాతామహుల ఇంటికి వెళ్ళినప్పుడు, బేబీపిన్ని బావ దగ్గరకు వెళ్ళి చదువుకుంటాను అని పేచీ‌ పెట్టింది.  అంతా సరే నన్నారు. అలా గెద్దనాపల్లి వచ్చింది మాయింట్లో ఉండి చదువుకోవటానికి.  ఆ యేడే నేను ఆరవతరగతిలోకి వచ్చాను. తను ఏడవ తరగతి.  ఇద్దరం బాగనే చదువుకునే వాళ్ళం‌ కాని ఆడుకుంటూ గిల్లుకుంటూ విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. పాపం అల్లరంతా నాదే కాని నా వెన్నంటే ఉండేదేమో తనకూ ఆ ఘనత దక్కేదన్న మాట.

గెద్దనాపల్లిలోని మిడిల్ స్కూల్‌కు మా నాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణగారు ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు.  అయనకు లలితకళలూ సాహిత్యం వంటీ వాటిమీద చాల ఆసక్తి.  పాఠశాల వార్షికోత్సవాలకు రకరకాల పోటీలు నిర్వహించేవారు. నాటకాలు వేయించేవారు. అప్పుడపుడూ పద్యాలు కూడా వ్రాసేవారు. సుమధురమైన గాత్రంతో పద్యాలు గానం చేసేవారు.

పాఠశాల వార్షికోత్సవానికి విద్యార్థులకు పెట్టిన ఒక పోటీ పద్యపఠనం.  ఎక్కువ పద్యాలు కంఠస్థం చేసి, అడిగిన పద్యాలు తప్పుల్లేకుండా ఒప్పగించాలన్నమాట.  ఇంక నేనూ మా పిన్నీ అల్లరి కట్టిపెట్టేసి పద్యాల మీద పడ్డాం. ఇంట్లో ఉన్న పుస్తకాల్లోంచి పద్యాలు తీసుకోవటం,  మా నాన్నగారికి చూపి వారు సరే నన్నవన్నీ‌ ఇద్దరం‌ బట్టీ పట్టటం. ఇంట్లో ఉన్నంతసేపూ మా ఇద్దరికీ‌ ఇదే యావ. అప్పట్లో మా యింటికి ప్రముఖవారపత్రిక ఆంధ్రప్రభ వచ్చేది. అందులోనూ‌ పద్యాలు అచ్చయ్యేవి తరచుగా.  వాటిని కూడా బట్టీ పట్టేయటమే.  పద్యం దొరికితే చాలు. మొదట్లో అర్థం చేసుకోవటం‌ కష్టంగా ఉండేవి చాలా పద్యాలు.  మా నాన్నగారిని వేధించి మరీ‌ అర్థం చెప్పించుకునే వాళ్ళం - అయన భోజనం చేస్తున్నా - తినే దాకా ఆగటం‌ ప్రసక్తే లేదన్న మాట.

అప్పట్లో మేమిద్దంరం భట్టీయం వేసిన పద్యాల్లో ఈ‌ శ్రీకృష్ణా యదుభూషణా పద్యం కూడా ఉంది. మా ఇద్దరికీ బాగా నచ్చింది ఆ పద్యం.  మా బేబీపిన్ని కయితే, ఆ పద్యం ఎంత నచ్చిందో చెప్పనలవి కాదు. అనేక రోజులపాటు - పోటీ ఐపోయిన తరువాత కూడా - పిన్ని నోట ఈ‌ పద్యం శ్రావ్యంగా వినిపిస్తూనే ఉండేది.

అందుచేత, ఈ‌ శ్రీకృష్ణా యదుభూషణా పద్యం‌ ప్రసక్తి వచ్చినప్పుడు నాకు మా బేబీపిన్ని జ్ఞాపకం వచ్చి కళ్ళ నీళ్ళు తిరుగుతాయి.

బేబీపిన్ని మా యింట్లో ఒక సంవత్సరమే చదివింది. కాని మా స్నేహం కాలానికి నిలచింది. అనంతరకాలంలో మా బేబీపిన్ని కొవ్వూరు గీర్వాణవిద్యాపీఠంలో భాషాప్రవీణ చదివింది. నిడదవోలులో తెలుగుపండితురాలిగా ఉద్యోగం చేసింది.  మా పిన్ని కొవ్వూరు వెళ్ళిపోయినా, నేను ప్రతీ‌సంవత్సరమూ వేసవిసెలవుల్లో మా పిన్నికోసమనే కొవ్వూరు వెళ్ళే‌వాణ్ణి. మా యిద్దరి మధ్యా కవులూ సాహిత్యమూ పద్యాలు వగైరా విషయాల మీద జోరుగా చర్చలు జరిగేవి.  వాటిలో మా మామయ్య శ్రీజగన్నాధరావు కూడా పాల్గొనే వాడు. ఆయన్ను మేము జగ్గుమావయ్య అంటాం. మావయ్య అప్పట్లో విద్యాప్రవీణ చదివే వాడు. ఇప్పుడు రెటైర్ అయ్యాడు కూడా.

అది 1980వ సంవత్సరం. ఆ సంవత్సరం ఫిబ్రవరినెలలో, సంపూర్ణసూర్యగ్రహణం నాడు మా పిన్ని హైదరాబాదు వచ్చింది. నాతో ముఖ్యంగా నీకోసమే వచ్చాన్రా అంది. నాకు చాలా సంతోషం వేసింది.  అరోజు జరిగిన విషయాలన్నీ‌ నాకు పూసగ్రుచ్చినట్లు గుర్తే. ఆ రోజు దూరదర్శన్ వాళ్ళు 'ఓ సీత కథ' సినిమా వేసారు మధ్యాహ్నం గ్రహణం సమయంలో. 

ఆ నాడు మాయింటి నుండి వెడుతూ, నిడదవోలు రారా నీతో చాలా మాట్లాడాలీ అంది.  అలాగే అన్నాను.  కాని మాట నిలబెట్టుకో లేక పోయాను.  నేను నిడదవోలు వెళ్ళాలీ‌ అనుకుంటూనే ఉన్నాను.

ఆ సంవత్సరం జూన్  24వ తేదీ. ఆఫీసులో ఉండగా నాకు ఒక టెలిగ్రాం వచ్చింది. బేబీపిన్ని హఠాత్తుగా స్వర్గస్థురాలయ్యిందని నమ్మశక్యం కాని వార్త.

బేబీపిన్ని, నిడదవోలు నుండి ప్రతివారాంతంలో లాగే కొవ్వూరులోని అన్నగారు జగన్నాధరావు (జగ్గుమావయ్య) ఇంటికి వచ్చింది. కాని సోమవారం యథాప్రకారం తెల్లవారకముందే లేవలేదు. అన్నావదినలు లేపినా పిన్ని లేవలేదు. నిద్రలోనే కోమాలోకి వెళ్ళిపోయింది.  అమె హఠాన్మరణం ఇప్పటికీ‌ నాకు దుఃఖం తెప్పిస్తూనే ఉంది.

నాకు మా పిన్ని కోసం నిడదవోలు వెళ్ళలేకపోయానే‌ అన్న అపరాధభావం వదలకుండా వెంటాడుతూనే ఉంది.

గతరాత్రి  కుంతీమహాదేవి భక్తి తత్పరత గురించి టపా వ్రాసాక, బేబిపిన్నికి చాలా ఇష్టమైన ఈ పద్యం, నా మనస్సును ఆక్రమించుకుని కూర్చుంది. బాగా మననం చేసుకున్నాను.  రాత్రి నిద్రపోవటం నా వల్ల కాలేదు.
మరొక్క సారి

శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణసంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే‌ భవలతల్ నిత్యానుకంపానిధీ

నాకు అత్యంత ఆత్మీయురాలైన మా బేబిపిన్నికి ఈ‌ పద్యం తప్ప ఏమి ఇవ్వగలను?

(ఈ టపాకు అతికించటానికి మా బేబీపిన్ని ఫోటో ఏదీ‌ నాదగ్గర లేదు! మ మామయ్యలదగ్గరా పిన్నుల దగ్గరా ఉండే ఉంటుంది కాని నా దగ్గరమాత్రంలేదు)

గమనిక:
ఈ టపా వ్రాసినది 2013లో. ఈ మధ్యకాలంలో బేబీపిన్ని ఫోటోలు కొన్ని దొరికాయి. అందులో ఒకటి ఇక్కడ ఈరోజున (29/01/2019న) జతపరచి టపా పునఃప్రచురిస్తున్నాను.

6 కామెంట్‌లు:

 1. నా కంటనీరొలికింది. మీ చేదు జ్ఞాపకాలని గుర్తు చేశానా అని బాధ పడుతున్నా. నాకీ పద్యం చాలా ఇష్టం, ఆ ఇష్టం దాచుకోలేకపోయా.
  ఇక మనం చెప్పాలనుకున్నది చెప్పెయ్యడమే, మరొకరు ఆచరించలేదనుకోడమెందుకు, ఎవరిష్టం వారిది, వదిలెయ్యండి. భాగవతం బాగుంది, కొన సాగించండి, చదువుతున్నారు, నేను చూస్తున్నా కదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొన్ని కొన్ని విషాదస్మృతులూ మధురంగానే ఉంటాయండి!

   తొలగించండి
 2. చాలా విచార కరం. మీ జ్ఞాపకంలో ఆమెని ఇంత బాగా గుర్తుంచుకోవడం అభినందనీయం. ఇలాగే పద్యాలతో మీకున్న అనుబంధాన్ని ముచ్చట్లతో కలిపి చెప్పండి. ఆసక్తిగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 3. శ్యామలరావుగారూ,మంచి అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.అటువంటి వాతావరణంలో పెరిగిన మీకు పద్య విద్య పట్టుబడడం లో అబ్బురమేమీ లేదు.భుక్తి కోసం ఏదో పని చేయక తప్పదు కాని సాహితీ లోకం లో విహరించడం కంటే ఆనందదాయకమైనది నాకైతే మరొకటి కనిపించదు.

  రిప్లయితొలగించండి
 4. ఈ పద్యాన్ని మొదటసారి విన్నది దానవీరశూరకర్ణ సినిమాలో. అందులో విదురుడు ఈ పద్యం పాడినట్లు చూపించారు. వినడానికి చాలా బావుంటుంది.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.