28, ఆగస్టు 2013, బుధవారం

పాహి రామప్రభో - 220.. 228 ఉత్సాహరామాయణం (అరణ్యకాండ)

ప్రేమ మీర లక్ష్మణుండు వివిధగతుల గొల్వగా
రామచంద్రమూర్తి విడిసె రమ్యసుగుణధామయౌ
భూమిజాత తోడ విపినభూమి పర్ణశాలలో
నా మనోజ్ఞపంచవటి ననంతసుఖవిలాసుడై    220

అంత చుప్పనాక యనగ నచటి కేగు దెంచి దు
శ్చింత తోడ దనుజ యోర్తు జేరి రాము డొల్లమిం
పంతగించి గీడు సేయ వచ్చు టెఱిగి లక్ష్మణుం
డింతి ముక్కుచెవులు కోసె నేగె నదియు భీతయై    221

ఖరుడు దూషణుండు నాగ కలరు దాని కన్న లా
సురవిరోధు లంత డాసి సొదను జొచ్చు పుర్వు ల
ట్లరిది వీరు వలన కూలి రరయ పదియు నాల్గు వే
వురగు సైన్య సమితి తోడ పోర రామశరములన్    222

అన్న రావణా నృశంసు డైన రాము డనెడు వా
డన్ని విధము లెన్న నీకు నంకపీఠి నుండగా
నెన్నదగిన నాతి తోడ నెసగ దాని గొంచు రా
జన్న నన్ను దఱిగి వాడు జంపె నచట నందరన్    223

నీ చెలియలి పగను వేగ నీవు దీర్చు మంచు నా
నీచురాలు చుప్పనాక నిప్పుబెట్ట వాడు మా
రీచు డన్న వాని మాయ లేడి చేసి పంపి తా
వేచి సీత నపహరించి వేగ లంక కేగినన్     224

రామపత్ని నకట దుష్టరాక్షసుండు గొంచు బో
నామె మొఱ్ఱ లాలకించి యడ్డు రా జటాయువుం
దామసించి నరికి వేయ ధరను గూలి వివరముల్
రాము డెఱుగ బల్కి పక్షిరాజు చేరె స్వర్గమున్      225

లలన జాడ లరయ రామలక్ష్మణులు వనంబునన్
కలయ దిరుగు చుండి యొకట కాంచి రొక్క రక్కసున్
పొలియ ద్రొక్క వాడు శాపముక్తు డగుచు దివిజుడై
తెలియు డయ్య శబరి మీకు తెఱవు జూపు పొండనన్  226

పోయి వారు కలసి నారు పుణ్యమూర్తి శబరి నా
బోయవనిత సత్కరించి పొంగి రామచంద్ర నీ
జాయ జాడ లరయ నీకు చక్కగా సహాయముం
చేయగల సమర్థుడైన స్నేహ శీలి గలడయా    227

లావు గలడు చాల ధర్మలక్ష్య బుధ్ది గలడు సు
గ్రీవు డనెడు సూర్యసుతుడు కీశరాజు వాడికన్
మీ వలన శుభంబు నొందు మీకు మేలు చేసెడిన్
పోవు డతడు ఋష్యమూక భూధరమున గలడనెన్   228

4 కామెంట్‌లు:

  1. అన్న పై ప్రేమతో లక్ష్మణుడు వివిధ రకాలుగా కొలుచుచుండగా రామచంద్రులవారు రమ్యమైన సీతమ్మ తోడుగా పర్ణశాల యందు విలసిల్లె

    అలా ఓ మారు శుర్పనఖ అక్కడికి వచ్చి దురాశ తో భూమ్యాజ తోడూ నీడైన రాముని వలిచేనని పలికే, అలా పంతం పట్టి ఉండగా కోపము తో లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు తెగ నరికే. ప్రాణ భయం తో శుర్పనఖ అచటి నుండి వెళ్ళిపోయే

    ఖర దుషణ ఇత్యాది దానవులను వెంట బెట్టుకొని రాముని పై యుద్ధం చేసి ఓడిపోయి తన అన్న అయినా దశకంఠుని చేర వచ్చి వృత్తాంతమును తెలిపే " అన్న ! ఎవరో నరంశమున పుట్టిన రాముడట నన్నిలా అవమాన పరిచి పంపించాడ"ని పలికే
    "నీ చేల్లెల్లి పగను నువ్వు తీర్చు అన్నయ్య"ని మొరపెట్టుకుంది, మారు ఆలోచింపక మారీచుడిని బంగారు లేడి గ పంపించి తానూ భిక్షు రూపమును ఎత్తి సీతమ్మను చెరబట్టి లంక కు వేగినాడు

    అది చూసి పక్షి రాజు అయిన సంపాతి అనుజుడు జటాయు లంకేస్టి తో పోరు తలపడి రెక్కలు తెగి నేలరాలి, జరిగినదంతా రామునికి దెల్పి స్వర్గాసినుడయ్యాడు జటాయు.

    సీతమ్మ జాడను వెతుకుతూ కలియతిరుగుతూ ఉండగా అచట ఓ పెద్ద చెట్టు లాంటి రక్కసుడు తలపడే రాముని తో. పోరు ముగిసి ఆ రక్కసుర సంహారము చేత ఓ దివ్య మనుజ రూపము వారిరువురకు మహా తపస్వి సాధ్వి ఐన శబరీ గూర్చి తెల్పే.

    వారు శబరీ ఉన్న చోటికి చేరే. వారి రాకను ఉపేక్షిస్తున్న బోయమాత ఫలములతో వారిని సత్కరించే. సంతుస్తులైన రామ రామానుజులు సీత మాటను గుర్చిన వివరములు అడిగే అనినా శబరీ ఇలా పలికే : ఓ అయ్యా నీకు సహాయము చెయ్యగల వాడు ఆ ఋష్య శృంగ పర్వతము పై "సుగ్రీవు" అనెడి కపి రాజు.

    తాడిగడప శ్యామల రావు గారికి నమస్కారం. నేను మీ రెండు బ్లాగ్ లను అనుసరిస్తున్నాను (శ్యామలియ మరియు భాగవతం ). నాకు దైవ చింతన అంటే చాల చాల ఇష్టం. వయసు మీలో సగమే సుమీ!! (28). నేను పుట్టింది ఆంధ్ర లో వరంగల్ అయినా నా మాతృభాష మాత్రం తెలుగు కాదు. ఈ తెలుగు నా వ్యవహారిక భాష. నాకు తెలిసిన సంస్కృత జ్ఞానం తో మీ "ఉత్సాహ రామాయణం అరణ్య కాండ లోని 220-228 పద్యాలను తెలుగు లో తాత్పర్యము చేసాను. తప్పులేమైన ఉంటె క్షమించండి. నా బ్లాగ్ కు మీరు అప్పుడప్పుడు వచ్చి వ్యాఖ్యాలు ఇస్తూ ఉంటారు అందుకు చాల ఆనందం.

    జై శ్రీమన్నారాయణ

    Regards,
    Sridhar Bukya

    ​నా బ్లాగ్ : http://kaavyaanjali.blogspot.in/​

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీటిని అచ్చతెలుగు నుండి వ్యవహారిక తెలుగు లో మార్చడానికి నేనే గ్రంథమును వాడలేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను

      తొలగించండి
    2. శ్రీధర్‌గారూ
      నృశంసుడు అంటే క్రూరుఁడు అని అర్థం.
      దివిజుడు అంటే దేవలోకానికి చెందిన వాడు అని అర్థం. దివ్యమనుజ అన్న పదం ఉండదు.
      మీరు ఉపేక్షిస్తున్న అన్న మాట పొరపాటున వాడారు. ఉపేక్షించటం అంటే పట్టించుకోక పోవటం కదా. మీరు ప్రతీక్షిస్తున్న (ఎదురుచూస్తున్న) అనబోయారని భావిస్తున్నాను.
      మీ‌మాతృభాష తెలుగుకాకపోయినా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. చాలా ఆనందం.

      తొలగించండి
    3. ఆచార్యవర్య, మీ ప్రత్యుతరానికి చాలా చాలా సంతోషం. సాధారణంగా నరసింహ స్వామిని నృసింహ అని వాడుతారు కదా .. బహుశ ఇది అలాటి పదమే ఏమోనని తెలియక వాడాను, అందుకు మన్నించండి. ఇక దివిజ దానవులు అనిన దేవుళ్ళు రక్కసులు అన్నది తెలుసు. కాని పొరపాటున టైపింగ్ లో తొందరపాటు వలన అది అలా వచ్చేసింది. శబరీమాత వెయిట్ చేస్తున్నారు అనేదాన్ని ప్రతీక్ష కు బదులుగా ఉపెక్షిస్తు నట్టు రాసాను. ఇందుకు నన్ను క్షమించాలి. ఎంతో ఓర్పుతో నా తప్పులని తెలిపారు అందుకు కృతజ్ఞుడిని.

      మీ అనుపమాన ఓర్పుకి మీ ఆలోచన శక్తికి, మీరు తెలిపే ఆసక్తికర విషయాలకి మీకు నాలాటి వాళ్ళు ఋణ పడి ఉంటారు
      మొన్న ఒక టపా "మా బేబీ పిన్ని కోసం మరో సారి శ్రీకృష్ణ యదు భూషణ" ను చూసి ఆశ్చర్య పోయాను .. కారణం మా పిన్ని పేరు కూడా బేబీ నే ! అసలు పేరు భువన.

      మీ సమాధానం నన్ను సంతుష్టుడిని చేసిందని మరొక్కమారు తెలుపుకుంటూ. మీ ఆశిషులు కోరుకుంటూ, అప్పుడప్పుడు వ్యాఖ్యలు ఇస్తూ సరి చేస్తూ ఉంటారని సవినయంగా కోరుకుంటూ

      శ్రీధర్ భుక్య పాత్లోత్
      http://kaavyaanjali.blogspot.in/

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.