25, ఆగస్టు 2013, ఆదివారం

ప్రస్తుత తెలుగునేల రాజకీయ క్షేత్రంలో చిరంజీవి పాత్ర.

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా! అని ఒక తత్త్వగీతం చెబుతోంది.  చాలా మంది వినే ఉంటారు.


హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నూటికి ఎనబైమంది  శాంతిస్తారని చిరంజీవిగారు చెప్పినట్లుగా వినిపించే కథనానికి పెద్ద విలువ ఉందని అనుకోవటం లేదు.  ఈ‌ ప్రతిపాదనకు సహజంగానే తెలగాణాప్రాంత ప్రజలూ, నాయకులూ ఒప్పుగోరు.  సీమాంధ్రవాళ్ళు ఒప్పుకుంటారని చిరంజీవి అభిప్రాయం అయితే అది కూడా అనుమానమే.  అదీ కాక, సీమాంధ్రవాళ్ళు మాత్రం ఒప్పేసుకుంటే చాలా?  అప్పుడు గొడవ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంది కాని మరేం ఒరిగేది లేదు.

లోగడ, ఈ చిరంజీవి గారే, హైదరాబాదును శాశ్వత రాజధాని చెయ్యాలీ రెండు ప్రాంతాలకీ అని ఒక ఉధ్ఘాటించి చూసారు.  అదొక తలతిక్క ఆలోచన.  సీమాంధ్రవాళ్ళకు అది ఇష్టం ఉంటుందా? సీమాంధ్రరాష్ట్ర బడ్జెట్ నుంచి తెలంగాణా వాళ్ళకు ఎప్పుడు సొంతం ఐపోతుందో తెలియని హైద్రాబాదుకు నిధులు నిరంతరం ధారపోయటానికి వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? ఎల్లకాలమూ సీమాంద్రతో రాజధానిగా తమ ముఖ్యనగరాన్ని పంచుకుందుకు తెలంగాణా వాళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలీ?  అందుచేత ఈ‌ తింగరి ప్రతిపాదన అటకెక్కింది. అలా అని మరీ భరోసా యేమీ లేదు.  ఈ‌ కాంగ్రెసు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసేసుకుంటారో సాక్షాత్తూ ఆ నిర్ణయాలు తీసుకునే అధిపతులకే తెలియదు కాక తెలీదు.  కాబట్టి, తస్మాత్ జాగ్రత!

ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన, చిరంజీవికి కొద్దో గొప్పో సీట్లు కట్టబెట్టటం అనేది ప్రజలు అయనకు చేసిన మేలో, కీడో అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మరి.  కాసిని సీట్లతో ధోబీ కా కుత్తా పరిస్థితిలో పడిపోయిన సదరు చిరంజీవి చిరుజీవిగా మనలేక, ప్రజల్ని ఏమనలేక, తనకు బుధ్ధిలేక, ఇంక గతిలేక, కాంగీమురికికాసారం లోకి దూకేశాడు.

రేప్పొద్దున్న భారత దేశపు కుమారచక్రవర్తిగారి పట్టాభిషేకానికి స్వంత బలగం  తాలూకు, బలం దర్పం ఎంత మాత్రం చాలకుండా పోతోందని గ్రహించుకున్న ఈ దేశపు - 'అసలుసిసలు' - ప్రధానమంత్రిణీదేవిగారు, అందిన ప్రతిచోటినుండి కిరాయిబలగాల్ని పోగేసుకోక తప్పదన్న స్థితప్రజ్ఞురాలై, చిరంజీవి లాంటి రకరకాల చిరుజీవుల్ని పోగేసుకుంటున్నారు.   అందుచేతనే, మిణుకుమిణుకు దీపంలాటి చిరంజీవిగారికి కాంగీకాలుష్యగంగాప్రవేశమహోత్సవం జరిపించటమూ, వారికో  కేంద్ర మంత్రి దసరావేషమూ వేసి వినోదం రక్తి కట్టించారు.

తెలుగునేలను ముక్కలు చేయకపోతే, సీమాంధ్ర, తెలంగాణా లనే రెండు ప్రాంతాల్లోనూ ఎవరూ కాంగీబంగీని నమ్మి ఓట్లూ సీట్లూ కట్టబెట్టరని నిశ్ఛయం ఐపోయింది.  


కాబట్టి, రెండు ముక్కలు చేస్తే, ఆ తెలంగాణాలో ఏదో ఇచ్చామన్న కృతజ్ఞతతో ఐనా కాసిని సీట్లు రాల్తాయి.  పైగా మహానేత  కె.సి.ఆర్ ఎప్పుడొ హామీ ఇచ్చారామె.  మనలో మనమాట, ఆ హామీని లోపాయకారీగా నిర్థారించుకోకుండా అడుగేసే అప్రయోజక పార్టీ కాదేమో  కాంగీ.  ఒకవేళా ఆ పార్టీ నిర్ణయాల్లో ఉన్న గందరగోళం చూస్తుంటే అలా హామీని నిర్థారించుకోక పోయినా ఆశ్చర్యం‌ ఎంత మాత్రం లేదు.

సీమాంధ్రలో అడ్రసు గల్లంతైనా ఆ సీట్లలో చాలా భాగం ప్రస్తుతం జనమూ రాజకీయులూ కూడా ముక్త కంఠంతో పిల్లకాంగ్రెసు అని పిలుచుకుంటున్న పార్టీ ఎగరేసుకు పోయేలా ఉంది.  కానీ ఆట్టే భయం అక్కర లేదు.  అది పిల్ల కాంగ్రెసు అన్న బిరుదుకు రేపైనా న్యాయం చేస్తుంది.  అదీ గాంగీయుల ప్రగాఢనమ్మకం.  అది వాళ్ళు చదువుకున్న స్వంత పార్టీ చరిత్ర కుండ బద్దలు కొట్టి చెబుతున్న నిజం.  అందు చేత, ఈ వేళ, సీమాంధ్రప్రజలు జెల్లకొట్టి పంపినా, ఆనక జగన్మోహనం గారిని సముదాయించుకుని అక్కడా మేమే అని తీరిగ్గా పళ్ళికిలించుకో వచ్చును.  ఎవరూ ఏమీ అనుకోరు.  రాజకీయాల్లో ఉఛ్ఛనీచాలేమీటీ, శత్రువులూ మిత్రులూ‌ ఏమిటీ అని ఘనతవహించిన అత్తగారే ఒకప్పుడు అప్పటి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పిన విషయం సోనియమ్మగారికి తెలియదా ఏమిటి.  పైగా ఆంధ్రులు ఆరంభశూరులూ అన్న బిరుదుకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు, ఇకముందు చేయరనీ నమ్మొచ్చును. 

అందుచేత తెలుగుగడ్డను పగులగొట్టటమే అన్ని విధాలా ఉభయ తారకంగా ఉంటుందన్న భావనే కాంగీ దొంగాటకు  మూల సూత్రం. 

ఇకపోతే చిరుగారు, నిజంగా ఒక చిరుచేప.  ఆయన డాంబిక ప్రవర్తన, చేసే అమాయకపు ప్రకటనలూ నమ్మే పిచ్చిమాలోకాలు తెలుగుగడ్డ మీద ఎవరైనా ఉన్నారని అనుకో నక్కర లేదు. 

ఆయనకు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చి జారిపోయింది.  సీమాంధ్రలో ఉద్యమం (తెలంగాణావాళ్ళు ఆ మాట ఒప్పుకోరనుకోండి, అది వేరే విషయం) రగులుకున్నాక అయినా ఆయన ఆ దిక్కుమాలిన బఫూన్ వేషం వదిలేసి వచ్చి జనంలో పడి నాయకత్వం అందుకుంటే,  తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నించే అదృష్టం పట్టేదేమో.  కాని తలుపుతట్టిన అదృష్టాన్ని ఆయన గమనించ లేక పోయాడా, లేక కాంగీ ఓడనుండి దూకటానికి ధైర్యం చేయలేకపోయాడా లేక వేరే ఇబ్బందులు ఏమన్నా ఆయన కాళ్ళూ‌ చేతులూ కట్టేసాయా అన్నది అప్రస్తుతం.  ప్రజలదృష్టిలో ఆయన వట్టి తటపటాయింపుల పిరికి మనిషిగా మిగిలి పోయాడు. అదీ‌ మనం ముఖ్యంగా గమనించ వలసింది.

ఆయన పాత్రచేత చెప్పించబడే చిలకపలుకులకూ ఆయనకున్న విలువకన్నా ఎక్కువ విలువ లేదు. అది చిరంజీవిగారికీ బాగానే తెలుసు అనుకోవచ్చును.

9 కామెంట్‌లు:

  1. పచ్చి కుండలు బద్దలు కొట్టేశారు, నిజాలు చెప్పేసి.పాపం కాంగీ వారికి మిగిలిన ఏకైక ఆశ పంజరం లో చిలక.

    రిప్లయితొలగించండి
  2. ట్వింకిల్ ట్వింకిల్ మెగాస్టార్ (ఒకప్పుడు)
    చిరంజీవి దగా స్టార్ (ఇప్పుడు)

    రిప్లయితొలగించండి
  3. శ్యామలీయం మాస్టారూ, మీ అంతటి పెద్దవారు తమ అమూల్య సమయం వెచ్చించే స్తాయికి చిరంజీవి గారు రాలేదు, ఎన్నటికీ రారు. ముఖానికి రంగులు పూసుకొని తైతక్కలేసే మనుషులపై ఆలోచించడం వృధా .

    వ్రుత్తాంతి (చంద్రశేఖర్) గారూ, చిరు దగా 2009 లోనే బయటపడింది. సామాజిక తెలంగాణా అంటూ రంకెలేసి చిందులేసి తీరా సమయం వచ్చాక తోక ముడిచిన ఈయన నిజస్వరూపం మేము అప్పుడే గుర్తించాం. మీరే నాలుగేళ్ళు ఆలస్యం

    రిప్లయితొలగించండి
  4. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేయడమన్న ప్రతిపాదన వెనక చాలా దుర్మార్గం ఉంది. మాకు దక్కని నగరాన్ని మీకు వదలమన్న ఉక్రోషంతో బాటు కేంద్రం ముసుగులో కబ్జాలు బయటపడకుండా ఉండాలన్న కోరిక స్పష్టం. దీనివల్ల ఆంధ్రులకు ఏమి ఒరుగుతుందో నాకయితే అర్ధం కావట్లేదు. గతంలో ఇదే తరహా కుట్ర మదరాసు వారు తిప్పికొట్టారని గుర్తు తెచ్చుకుంటే అందికీ శ్రేయస్కరం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజకీయాల్లో సన్మార్గాలూ దుర్మార్గాలూ ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారూ? అన్నీ రాజకీయ మార్గాలే ఉంటాయి. అవి సన్మార్గాలా దుర్మార్గాలా అన్నది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. 'గతంలో ఇదే తరహా కుట్ర' అని మీ రాజ్కీయ దృక్కోణంలో బాగానే సెలవిచ్చారు. ప్రకాశంగారు ప్రజాసేవకుడే కాని రాజకీయపక్షి అని అనుకోలేం. అలాగయైతే మన ఘనతవహించిన రాజకీయ పెద్దకుటుంబాలవారిలగా లక్షలు తగలేసి కోట్లు సంపాదించేవాదే కాని నా ప్రజలో అంటూ ఉన్నదంతా హారతి కర్పూరం చేసుకునే వాడు కాదు కదా. ప్రకాశంగారు గద్దె కెక్కకుందా చూడటానికి మన తెలుగు ఘనాపాఠీల్లో చాలామంది చాలా కష్టపడ్దారని మరచిపోకూడదు. బహుశః వాళ్ళలా చేయకపోతే మద్రాసు అనబడే చెన్నపట్తణం మనకే వచ్చేదేమో.

      తొలగించండి
    2. ప్రకాశం పంతులు పేరే నేను ఎత్తలేదు. మదరాసు నగరాన్ని తరలిద్దామని అది కుదరకపోతే కేంద్రపాలితం చేయాలని చేసిన శుష్క ప్రయాసం (మీకు కుట్ర అనే మాటపై అభ్యంతరం ఉంది కాబట్టి) ప్రకాశం గారోక్కరిదే కాదు. మీరు చెప్పిన కళా వెంకటరావు గారితో బాటు ఎందరో అదే పని చేసారు. చివరికి జేవీపీ కమిటీ సభ్యులయిన పట్టాభి గారు కూడా చీఫ్ కమిషన్ రాజ్యం (ఇప్పటి భాషలో కేంద్రపాలిత ప్రాంతం) అంటూ మెలికలు తిప్పారు .

      నగరంలో పావు జనాభా కూడా లేని ఆంధ్రులు మదరాసు కావాలనుకోవడం విడ్డూరం. దానికి నాయకులందరూ తందానా పాడడం వల్ల చివరికి పొట్టి శ్రీరాములు గారిని కోల్పోవలిసి వచ్చింది. 4 ఏళ్ళపాటు అనేక ప్రయాసాలు చేసినా మదరాసు దక్కలేదు సరికదా అనవరమయిన అపార నష్టం జరిగింది .

      ప్రకాశం గారే కాదు అనేక నాయకులు స్వాతంత్ర్య సమరంలో ఆస్తులు హారతి చేసుకున్నారు. అంతమాత్రాన వారు రాజకీయ నాయకులు కాకుండా పోరు. నిరాడంబరతే కొలబద్దగా తీసుకుంటే ఔరంగజేబు అందరికన్నా ముందుంటాడు.

      తొలగించండి

  5. బాబుగారూ .. బాబుగారి భజన చేసే పచ్చపత్రికలూ .. బాబుగారి భుజకీర్తులని మోసే టీవీ చానల్సూ

    శ్యామలీయంగారూ, వారి బ్లాగులో కామెంటే స్వయంప్రకటిత మేధావులూ .. తెలుగుబ్లాగుల్లో ఇన్ఫో సిస్ నామూ తర్వాత అంతటి మేతావులైన SNKR గారూ ... అనేసుకుంటే ....

    .............జనమూ రాజకీయులూ కూడా ముక్త కంఠంతో పిల్లకాంగ్రెసు అని పిలుచుకుంటున్నట్లేనా?

    రిప్లయితొలగించండి
  6. @జై,
    ప్రకాశం పంతులు గురించి మాట్లాడుతుంటె, నిరాడంబరతలో ఔరంగజెబు తరువాతె అని అనటంలొ అర్థమెమిటి? అన్నను చంపి, తండ్రిని జైల్ లొ వేసినవాడు సర్వసంగ పరిత్యాగి లా గా మీరు పొగడటం చూస్తూంటె మీకెమైనా మతిభ్రమించిందో అన్న అనుమానం చేస్తోంది. అది కాకపోతె బహుసా మైనారిటిలను బుజ్జగించే రాజకీయ నాయకుడి గాలి సోకిందేమో!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.