17, ఆగస్టు 2013, శనివారం

కథ: దొంగరాజుగారి కథ

అనగనగా ఒక రాజు.

రాజుగారి పేరా?  ఆయన పేరుతో మీకేం పనండీ?
ఈ‌ కథకు ఆ రాజు పేరుతో‌ పని లేదు.  కాబట్టి దానిగురించి పట్టించుకోకండి.  సరేనా?

అసలు ఆయన గారు ఏలే రాజ్యానికైనా ఒక పేరుందా?

ఉండక చస్తుందా?  ఏదో ఒక పేరు ఉంది లెండి కాని మనకు ఆ రాజ్యం పేరుతో కూడా పనేమీ లేదు.  ఒట్టు. నమ్మండి.

ఆగండి అలా వెళ్ళి పోతున్నారేఁవిటీ?
చెప్పటానికి నాకూ,  వినటానికి మీకూ ఒక మంచి కథ ఉంటేనూ?

ఈ రాజుగారు దివ్యంగా పరిపాలిస్తున్న రాజ్యంలో ఒక గజదొంగ బయలు దేరాడు.

ఓరి నీ యిల్లు బంగారం కానూ,  వీడి కన్నా పేరుండి చచ్చిందా లేదా, అంటున్నారా?.

అబ్బే అంత కోప్పడకండీ.  దొంగకు వాళ్ళమ్మా నాన్నా నిక్షేపంలాంటి పేరు పెట్టారని నమ్మొచ్చునండీ.  కానీ నేను సవినయంగా మనవి చేసి పారేసే దేమిటంటే,  వీణ్ణి గజదొంగ అని పిలిస్తే‌ సరిపోతున్నప్పుడూ,  మనం పోయి, ఒరే గజదొంగా, గజదొంగా నీ పేరేమిటి నాయనా అని అడిగి తెలుసుకోవాలాండీ?  అవసరం‌ లేదు కదా?  చిత్తం‌. అదే నండీ, చెప్పొచ్చేది.

అయినా బాబ్బాబు.  వెళ్ళిపోకండి.  ఓపిగ్గా కథను చదివేయండేం.   మీరు చాలా మంచి వాళ్ళని నాకు తెలుసు.  తప్పకుండా చదివే తీరుతారు.  బోలెడు ధన్యవాదాలండీ.  చదవండి మరీ.

*    *    *    *    *    *    *    *
 
మన దేశంలో రాజులన్న వాళ్ళకు భలే‌ భలే సరదాలుంటాయి.  కవుల్నీ భట్రాజుల్నీ‌ సభలో కూర్చో బెట్టుకుని వాళ్ళతో, నువ్వంత వాడివీ, ఇంత వాడివీ అని పొగిడించు కోవటం అనే ఒక సరదా ఉంటుంది.   పిచ్చాపాటీ కబుర్ల రాయళ్ళని ఒకళ్ళిద్దరిని విదూషకులూ అని గౌరవంగా పక్కనే పెట్టుకుని,  తిని కూర్చుని వాళ్ళు చతుర్లాడుతుంటే,  పని మాని అవన్నీ వింటూ ఆనందించేస్తూ ఉండటం మరో సరదా.  మనలో మన మాట, ఈ పాతిక ముఫై ఊళ్ళ ప్రభువులకు రోజూ పెద్దగా  పనేమీ అఘోరించదు లెండి. అది వేరే విషయం. సంగీతం పాడే వాళ్ళూ, నాట్యాలు చేసే వాళ్ళూ లాంటి కళాకారులతో కాలక్షేపాలు చేయటమూ రాజుల సరదాల్లో తప్పకుండా ఉంటుంది.  మన రాజు గారికీ ఓ వందా నూటపాతిక ఊళ్ళున్నాయి కాబట్టి జరుగుబాటుకీ లోటు లేదు - ఈ  విరగబాటుకీ లోటు లేదు.

మర్చిపోయానండోయ్. వేట అనే మరో ముఖ్యాతి ముఖ్యమైన సరదా కూడా అందరి రాజులకూ తప్పకుండా ఉంటుంది.  మన రాజుగారి కెందుకుండదూ‌ మరి?

ఈ మధ్యనే ఒక ఆస్థాన విద్వాంసుడు రాజుగారి కీర్తిని వర్ణిస్తూ ఒక కావ్యం రాసాడు. రాజుగారు రాయమంటే రాయాలి కదా?

ఈ దిక్కుమాలిన రాజు చేసిన యుధ్దాలూ అవీ లేవు. పదిమంది అమ్మాయిలు ఈ మానవుణ్ణి వలచి వరించి పెళ్ళాడిందీ లేదు.   ఇలాంటి అప్రయోజకపు రాజుమీద కావ్యం రాయాలంటే, నిజానికి కవి అన్న వాడికి కంపరంగా ఉంటుంది.  అయినా రాజుగారు నా మీద మాంచి కావ్యం రాయీ అంటే,  తప్పుతుందా?  ఏదో ఒకటి చేయాలిగా?  అయినా,  డబ్బూ అవీ‌ చేదా ఏమిటి. 

అందుకని కవిగారు ఒకటి రెండు రోజులు బాగా అలోచనలో పడ్డాడు.

ఒకప్పుడు ధర్మరాజు అనే పెద్దాయన, మరేం‌ పనిలేక,  తమ్ముళ్ళను వెంటేసుకుని అడవుల్లోని జంతువు లన్నింటినీ‌ ఎడాపెడా చంపి పోగులు పెట్టేసాడట.   అప్పుడు, ఆ జంతువుల్లో కల్లోలం పుట్టి,  అవి ఆయన కలలోకి వచ్చి బాబ్బాబు చంపింది చాలూ, కాస్త మమ్మల్నీ యీ భూమ్మీద బతకనియ్యి మహాప్రభో అని మొర పెట్టుకున్నాయట.  పాపం ఈ ధర్మరాజుగారు చాలా మంచాయన.  ఆయనకు వీలై నప్పుడల్లా బోలెడు జాలి పుడుతుంది.  అంచేత ఆయన జాలిపడి నీరైపోయి,  ఇంక వేటలు చాలించేస్తున్నా అని వాటికి అభయం ఇచ్చేసాడట.

మనకవిగారు గొప్ప గడుగ్గాయి.  సరిగ్గా ధర్మరాజుగారి జాలిగుణం కాస్తా మన రాజుగారికి కట్టబెట్టి రాస్తే పోలా అనుకున్నాడు.  దానితో ఆయనగారి కావ్యంలో ముఖ్యవస్తువు కాస్తా మన రాజుగారి మృగయావినోద ప్రావీణ్యత అన్నమాట. ఆపైన, ఆయన ధర్మగుణం, జాలీ వగైరాలతో గ్రంథం సిథ్థం.

సరే, రాజుగారు  ఈ  కావ్యాన్ని అంకితం పుచ్చుకోవటానికి ఆస్థాన పురోహితులవారు ముహూర్తం నిర్ణయించటమూ,  ఆ రోజు కాస్తా రావటమూ‌ జరిగాయి.


*    *    *    *    *    *    *    *

అంకితం వ్యవహారం ముగిసి, కవిగారికి భూరి సన్మానం చేయటం ఒక్కటే మిగిలి ఉన్న సమయంలో రాజ్యానికి తూర్పు సరిహద్దు గ్రామాల నించి మనుషులొచ్చారూ ఏదో మనవి చేసుకుంటారటా అని కబురు వచ్చింది. 

కాస్సేపాగి రమ్మనండి అందా మనుకున్నాడు రాజు.  కాని అంతలోనే మనసు మార్చుకున్నాడు.  ఇక్కడ ఇంత పెద్ద సభా ఉత్సవమూ జరుగుతుంటే వాళ్ళూ కళ్ళారా చూసి రాజ్యం అంతా టముకు వేస్తారు మంచిదేగా అనుకున్నాడు.  వాళ్ళని ప్రవేశ పెట్టండి అని అజ్ఞ వేసాడు.

వాళ్ళు వచ్చారు సభలోకి.  కవి గారికి సన్మానం గట్రా ముగిసాక, రాజు వాళ్ళని అడిగాడు, ఏమిటర్రా సంగతీ అని.

ఎవడో గజదొంగ మహాప్రభో. ఊళ్ళు దోచేస్తున్నాడు. కాపాడాలీ అన్నారు వాళ్ళంతా కూడబలుక్కున్నట్లు. 

ఓయ్ కొత్వాల్ ఇలా రావోయ్ అన్నారు రాజుగారు దర్పంగా.

సమ్ముఖానికి వచ్చి కొత్వాలు కాస్త వినయంగానే మనవి చేసాడు.  మహాప్రభో ఈ‌ గజదొంగ సంగతి మా ఎరుకలోకి రానే వచ్చిందీ, వాణ్ణి పట్టుకుందుకు మూణ్ణెల్న నుంచీ ప్రయత్నిస్తున్నాం అని.

ఎంత రాజుగారి కొలువైనా కొంచెం‌ కుమ్ములాటలూ‌ అవీ ఉంటాయిగా మరి.   పురోహితుడికీ‌ కొత్వాలుకీ చుక్కెదురు.  అంచేత పురోహితుడు అవకాశం దొరికింది కదా అని ఓ‌ ముక్క తగిలించాడు.

ఓ దొంగ వెధవని పట్టుకుందుకు మూణ్ణెల్లా అని.

కొత్వాలు పురోహితుడి కేసి కొరకొరా చూసి, వాడు ఆరితేరిన గజదొంగండీ, అయినా దొంగని పట్టటం అంటే పుస్తకంలో‌ చూసి ముహూర్తం పెట్టటం అనుకున్నారా అని కసిరాడు.

రాజుగారికి చిరాకొచ్చింది.  సరిసరి,  వాణ్ణి పట్టుకుందుకు మీరే స్వయంగా వెళ్ళండి.  పాపం జనం అవస్థ పడుతున్నారు కదా అని ఓ నిర్ణయం ప్రకటించాడు.

పురోహితులవారు వెంటనే అందుకున్నారు, అందుకు మంచి ముహూర్తం వెంటనే చూస్తాను అని.

కవిగారికి నవ్వొచ్చింది కాని,  రాజుగారి ముందు ఎవరూ అనవసరంగా నవ్వకూడదు. నవ్వటం గివ్వటం అంటూ జరిగితే అది రాజుగారే ముందుగా చేయాలి.  
.  .  .  .  .   ఇంకా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.