18, ఆగస్టు 2013, ఆదివారం

పాహి రామప్రభో - 201 హరిగతి రామాయణ రగడ

హరిగతిరగడ (ఏకతాళము)

బాలకాండ
హరి గతి నీవే కావగ రావే యసురాంతక యని యమరులు రామా
పరమాత్మా ప్రార్థింపగ నంతట పంక్తిశిరాసురు జంపగ రామా
నరరూపంబున భూమికి వచ్చిన యంబుజనాభ యనామయ  రామా
తరణికులాగ్రణి ధీమణి శ్రీమద్దశరథు నింటను వెలసిన రామా
మునిపతి యాగము నాగము జేసెడు ముష్కరులను దండించిన రామా
ఘనతపమున నొక శిలవలె నుండిన గౌతమ పత్నిని బ్రోచిన రామా
శివధనువును వెస నెక్కిడి చక్కగ సీతను పరిణయమాడిన రామా
అవలీలగను పరశ్వధరాముని యతిశయ మణచిన గుణనిథి రామా

అయోథ్యకాండ
జనకుని యానతి గొని వన వాసము సలుపగ కానల కరగిన రామా
వినయాన్వితుడును హితుడగు గుహునకు ప్రేమాలింగన మిచ్చిన రామా
మునిపతి యైన భరద్వాజుని చే పూజితుడైన మునిప్రియ రామా
తన పాదుకలకు పట్టము గట్టగ తమ్మున కనుమతి నిచ్చిన రామా

అరణ్యకాండ
శరభంగాది మహామునివరులను సందర్శించిన దశరథ రామా
సురుచిర పంచవటీ ప్రాంతంబున సుఖముగ విడిసిన సీతారామా
వైశ్రవణుని పెనుమాయకు లోబడి వైదేహిని కోల్పోయిన రామా
ఆశ్రమమున సీతను గానక బిట్టరచిన మాయామానుష రామా
ఖగరాజు జటాయువునకు మోక్షము కరుణించిన పురుషోత్తమ రామా
అగణితగుణమణి శబరికి మోక్షం బనుమతి సేసిన జనపతి రామా

కిష్కింధకాండ
ధర్మవిరోధిని వాలిని కోలను ధరపై గూల్చిన రాజారామా
ధర్మాత్ముని సుగ్రీవుని రాజ్యపదంబున నిల్పిన దశరథరామా
ధరణిజజాడ లెరుంగ కపీంద్రుల దశదిశలకు పుత్తెంచిన రామా
గురుతుగ హనుమంతున కంగుళి నతికూరిమి నిచ్చిన సీతారామా

సుందరకాండ
త్రిజటాస్వప్నముతో నిజవిజయపు తీరును జగతికి చాటిన రామా
నిజదివ్యకరాంగుళి కతమున భూమిజకతి మోదము గూర్చిన రామా
దనుజుని యిరువది చెవులను బొడిచిన హనుమత్సన్నుత నిజయశ రామా
హనుమముఖంబున సతిసేమంబును విని మనమున కడు మురిసిన రామా

యుధ్ధకాండ
రయమున జడథికి వారథి కట్టిన రావణుపై దండెత్తిన రామా
భయదరణంబున దుష్టదశాస్యుని బ్రహ్మాస్త్రంబున మొత్తిన రామా
సీతామాతను సుగుణోపేతను చేకొని పురమున కరిగిన రామా
ప్రీతి నయోధ్యాపురమున మణిమయపీఠం బెక్కిన సీతారామా

ఉపసంహారము
దినమణికులమణి  నీదు ప్రభావము తెలియగ నెంతటి వాడను రామా
మనుజుడ నల్పజ్ఞుడ నను దయతో మన్నింపుము పరమేశ్వర రామా

ఫలశృతి
రామరగడ పారాయణ పరులకు రాముని దయ పుష్కలమై యుండును
భూమిని సర్వసుఖంబులు గలుగును పొలుపుగ మోక్షము గలుగుచు నుండును


(వ్రాసిన తేదీ: 2013-5-15)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.