15, ఆగస్టు 2013, గురువారం

పాహి రామప్రభో - 189

పూజావిధానంలో గంధం సమర్పించుకోవటం అన్న ఉపచారం తరువాత మరి రెండు అదనపు ఉపచారాలు 1.అక్షతలు, 2. ఆభరణములు సమర్పించటం‌కూడా తరచు కనిపిస్తోంది. అక్షతాసమర్పణం అనే ఉపచారం చెప్పుకున్నాం‌ కదా, గత టపాలో.  ఇప్పుడు ఆభరణం సమర్పించుకోవటం చేదాం.

ఆభరణం

కం. విలువగు రత్నము లైదన
గలవు సుమా నాదు ప్రాణఘనరత్నము లో
కుల దైవమ నీ పాదం
బుల కడ నుంచెదను రామ భూవర ప్రీతిన్

తాత్పర్యం.  ఓ‌ శ్రీరామచంద్రప్రభూ, నీ వంటి వానికి మిక్కిలి అమూల్యమైనవే సమర్పించాలి కాని అలాంటివీ‌ ఇలాంటివీ ఇవ్వవచ్చునా.  నీవు రాజువు, రాజులు రత్నప్రియులు కదా.  నా దగ్గర అత్యంత విలువైన ఐదు రత్నాలున్నాయి.  అవి నా ప్రాణాలన్న పేరుతో‌ పిలువబడుతూ ఉంటాయి.  నాకు సంబంధించినంత వరకూ  ఈ‌ ప్రపంచంలో,  ఇంత కంటే విలువైన రత్నాలే లేవు మరి.  ఎంతో సంతోషంగా ఈ ఐదింటినీ‌ కూడా కులదైవం అయిన నీ‌ పాదాల వద్ద ఉంచుతున్నాను. స్వీ‌కరించి అనుగ్రహించ వలసింది.

(ఆగష్టు 2013)