4, ఆగస్టు 2013, ఆదివారం

ఈ దారెటు పోతుందో ఎవరికి తెలుసు?

ఈ దారెటు పోతుందో ఎవరికి తెలుసు
అసలే దారిని వచ్చానో నాకేం తెలుసు

నడచి నడచి యీ‌ నడక విసుగనిపిస్తే
నడవలేక యీ కాళ్ళకు నొప్పులు వస్తే
అడుగుతీసి వేయలేని అలసట వస్తే
అడగా లింకెంత దూరమో‌ అనిపిస్తే
అడగనా? ఎవరినీ ? ఏమనీ?
అడిగినా? చెప్పేవా రెవ్వరనీ?

ఇన్నాళ్ళ నుంచి నేను చూస్తూనే‌ ఉన్నాను
ఎన్నోన్నో నదులనూ గిరులనూ వనులనూ
అన్నీ చిరపరిచితాల వలె తోస్తున్నాయి
ఎన్నెన్ని మార్లు యీ దారివెంట తిరిగానో
ఎన్నాళ్ళు నడవాలి నే నింకా
తిన్నగా చెప్పేవా ళ్ళసలున్నారా

తుదీ మొదలు లేని గొప్ప వృత్తమా యిది
అదే నిజం అయితే నే మొదటికే వచ్చేది
అది సరే మరల మరల ఎందుకు తిరగాలి
అది నిజం కాక పోతే యీ‌ దారికి అంతేదీ
ఇది నేను ఎవరిని అడగాలీ
బదులు చెప్పే వాళ్ళే దొరకాలీ