8, ఆగస్టు 2013, గురువారం

పంచాగ్నిహోత్రాల మధ్య సాధన

ఒకప్పుడు కొందరు ఋషులు చేసేవారట
పంచాగ్నిహోత్రాల మధ్య ఘోరతపస్సు
ఇప్పుడు నేనూ ఓపిగ్గా చేస్తున్నాను
పంచాగిహోత్రాల మధ్య ఘోరతపస్సు

ఉపాధిని నిర్దాక్షిణ్యంగా ఉడికించి వేస్తున్న కాలాగ్ని 
నిరంతరం‌ మండుతూ నిలబడ నీయని క్షుదాగ్ని 
వచ్చి పడితే‌ మాత్రం ఎముకల్ని వణికించే శీతాగ్ని 
ఏక్ష‌ణం విరుచుకు పడుతుందో‌ తెలియని క్రోధాగ్ని 
అంతులేని అహాన్ని అతి మెల్లగా కరిగించే జ్ఞానాగ్ని
ఈ‌ పంచాగ్నుల మధ్య ఓపిగ్గా చేస్తున్నాను సాధన

సంస్కార కవచాన్ని క్షణంలో మండించే కామాగ్ని
అవతలి వాడి ఉన్నతిని ఓర్వలేక మండే ఉదరాగ్ని
చిన్నచిన్న నిరాశలెదురైనా చెలరేగి మండే శోకాగ్ని
భవవార్థిలోంచి బయటపడలేనని మండే బడబాగ్ని
ఒక చిన్న మంచిమాటా అరిగించుకోలేని మందాగ్ని
ఈ‌ పంచాగ్నుల మధ్య ఓపిగ్గా చేస్తున్నాను సాధన

ఎప్పుడు కురుస్తుందో తెలియని ఈశ్వర మేఘం
ఇక్కడే పట్టి ఉంచి గిరగిరా తిప్పుతున్న ఈ భూమి
నా లోనే ఎక్కడో‌ దాగి కూర్చున్న అక్షరపురుషుడు
ఈశ్వరుడి జాడను దాచి ఊరిస్తున్న ప్రకృతి కాంత
స్వాప్నిక జగత్తులో క్షణక్షణం మెరిసే ద్యులోకం
ఈ‌ పంచాగ్నుల మధ్య ఓపిగ్గా చేస్తున్నాను సాధన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.