అమాయకత్వం గొప్పది.
చిన్నపిల్లల అమాయకత్వం అమూల్య మైనది.
మా చిన్నతనంలో మేము గెద్దనాపల్లె అనే ఊరిలో ఉండేవాళ్ళం.
తూ.గో. జిల్లాలో ఉన్న ఆ ఊరి మిడిల్ స్కూల్ హెడ్మాష్టరు మా నాన్నగారు.
ఆఊరి కరణంగారు సోమప్ప గారు. ఆయన తమ్ముడు గవరప్ప వేరే ఊరికి కరణంగా వేరేచోట ఉండేవాడు. సోమప్ప గారి చిన్నతమ్ముడు సత్తెప్ప టీనేజర్ - కొంచెం జులాయి మనిషి కూడా. ఈ. అప్పల కన్నతల్లి అన్నపూర్ణమ్మ గారు భలే బోళా మనిషి.
వీళ్ళింట్లో ఒక వాటాలో మేము ఉండేవాళ్ళం.
పల్లె కదా. రోజూ వెచ్చాల వాళ్ళూ గిన్నెలమ్మే వాళ్ళూ కూరలమ్మే వాళ్ళూ ఇంటింటికీ వచ్ఛే వాళ్ళు.
కావిడితో వచ్చి కూరలమ్మే అతను రోజూ రావటమూ మా అమ్మగారు వాడితో బేరమాడి కూరలు కొనటమూ అందరమూ రోజూ చూసే వ్యవహారమే.
ఒక రోజున కూరలు తీసుకుని అతడు ఎప్పటిలాగే ఉదయమే వచ్చాడు.
అమ్మగారూ కూరలు అని కేక పెట్టాడు.
అప్ఫుడు మేం పిల్లలం వీధి చావిడి లోనే ఉన్నాం.
మా అమ్మగారు వచ్చేలోగా మా పెద్దచెల్లెలు కలగజేసుకుంది.
"వంకాయలు వీశ ఎంతా" అని అడిగింది.
"అర్ధరూపాయమ్మా" అన్నాడు కూరలతను.
మా చెల్లెలు బేరమాడింది.
"ముప్పావలా కిస్తావా?"
కూరలతను కూలబడి పగలబడి నవ్వుతూనే ఉన్నాడు చాలాసేపు.
మాఅమ్మగారు వచ్చి ఏమిటయ్యా నవ్వుతున్నావూ అని ఆశ్చర్యంగా అడిగారు.
అతను నవ్వు ఆపుకొని సమాధానం చెప్పటానికి కొంత సమయం పట్టింది.
చివరికి విషయం తెలిసి మా అమ్మగారూ బాగా నవ్వుకున్నారు.
అతను కూరలు ఇచ్చి వెళ్తూ "పాప గారూ రేపు మీరే బేరం ఆడాలి" అని మరోసారి నవ్వుకుంటూ వెళ్ళాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.