12, మే 2021, బుధవారం

జ్ఞాపకంగా మారిపోయిన మా తమ్ముడు రామం.

 


ఈ పాడు కోవిడ్ మా తమ్ముడు తాడిగడప సత్యశ్రీరామచంద్రమూర్తిని పొట్టన బెట్టుకుంది.

కొద్ది రోజులు ఆ రక్కసితో పోరాడి అలసి చివరకు నిన్న 11వ తారీఖు కాకినాడలో ఉదయం 5:53సమయంలో పరమపదం చేరుకున్నాడు.

స్వయంకృషితో పైకి వచ్చిన వాడు మాతమ్ముడు. 1975లో, మానాన్న గారి మృతి అనంతరం నా అభ్యర్ధనపత్రం మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు గారు తక్షణం స్పందించి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు మాతమ్ముడికి. వాడు చిన్నవాడు. అప్పుడప్పుడే డిగ్రీ పూర్తిచేసి ఉన్నవాడు. నేనా హైదరాబాదులో ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం మాత్రం ఐనది అప్పటికి.

ఆతరువాత అతడి ఎదుగుదల అంతా అతడి స్వయంకృషి ఫలితమే. చివరకు మంచి హోదాలోనే జిల్లాపరిషత్ సర్వీసు నుండి పదవీవిరమణ చేసాడు. ఆ తరువాత కూడా వారు మాతమ్ముణ్ణి వదలలేదు. కొత్తగా వచ్చే బేచ్ అఫీసర్లకు అడ్మిస్ట్రేటివ్ ప్రొసీజర్ల గురించి ట్రయినింగు క్లాసులు కండక్ట్ చేయమని పిలిచే వారు. అలా ఎందరికో కోచింగ్ ఇచ్చాడు. ఇక పెంక్షనర్ల కోసం అవిశ్రాంతంగా సహాయం అందిస్తూనే ఉండే వాడు. సామాజిక కార్యక్రమాల్లోనూ‌చురుగ్గా ఉండేవాడు. ఇలా కాకినాడలో అందరికీ తలలోనాలుకలా ఉండే మాతమ్ముణ్ణీ కరోనా బలితీసుకుంది.

ఉద్యోగరీత్యా నేను హైదరాబాదుకు రావటం వలన మానాన్నగారి నిర్యాణానంతరం మా అమ్మగారూ మిగిలిన సోదరసోదరీమణులూ అందరూ కూడా హైదరాబాదుకు వచ్చేసారు నాదగ్గరకు. కాని జిల్లాపరిషత్ సర్వీసు కావటం వలన మా తమ్ముడు మాత్రం తూర్పుగోదావరిలోనే ఉండిపోవలసి వచ్చింది.  అతడొక్కడూ‌ కాకినాడలో, మిగిలిన అందరమూ హైదరాబాదులో అన్నమాట. ఐనా అస్తమానూ మాకోసం హైదరాబాదు పరుగెత్తుకొని వస్తూ ఉండేవాడు.

మేమంటే సహజమైన అభిమానం అనేకాదు. అతను మిక్కిలి స్నేహశీలి. ఎందరినో ఆదరంగా చూసేవాడు. ఎందరికో చదువు విషయంలో సహాయం చేసేవాడు. ఎప్పుడు చూసినా ఏబంధుత్వమూ లేని ఎవరో పిల్లలు ఒకరిద్దరు ఆతని ఇంట్లో స్వంతమనుష్యుల్లాగా తిరుగుతూనే ఉండేవారు. 

ఇంకా ఎంతో చెప్పవలసింది ఉంది ఆతని గురించి. విడిగా వ్రాస్తాను వీలు చూసుకొని.

ఈ సర్వజనప్రియిడి మృతి విషయం మరునాడు అంటే‌ నేటి స్థానిక పత్రికలలో కూడా వచ్చింది.






అతడి ఫోటోలు, కొన్ని కొన్ని ఆడియో వీడియో రికార్డులు చివరకు మాకు అతడి జ్ఞాపికలుగా మిగిలాయి.






రామకీర్తనలను అచ్చులో చూడాలని రామానికి ప్రగాఢమైన కోరిక. మన తెలుగు వాళ్ళు పుస్తకాలు చదువుతారా అదీ కొని మరీను. అందులోను కీర్తనలూ గట్రా అంటే ఎవరికి ఆసక్తి ఉంటుందిరా పోనివ్వు అని అంత సుముఖంగా ఉండే వాడిని కాను. ఐనా అదే విషయం ఏదో ఒక సందర్భం చూసుకొని ప్రస్తావిస్తూనే ఉండే వాడు. 

ఈ 9వ తారీఖు సాయంత్రం ఐదున్నర మా రామానికి నేను పంపిన చివరి వాట్సాప్ సందేశం.

మధ్యాహ్నం డా. సందీప్ గారితో మాట్లాడాను. ఇంకా కొన్నిరోజుల పాటు ఆక్సిజన్ అవసరం అన్నారు. ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోవాలని నొక్కి చెప్పారు. సహించకపోయినా ధారకం లేకపోతే చిక్కుకదా. పుష్టిగా తినవలసిందే. త్వరలోనే నయం అవుతుంది. పైనెలలో నీచేతులమీద  రామకీర్తనలు  పుస్తకం విడుదల చేయాలి నువ్వు. ఏమీ దిగులు పడకుండా ఆహారం-మందులు-విశ్రాంతితో తొందరగా ఇంటికి వచ్చేయి.
-అన్నయ్య.

ఇలా ఉత్సాహపరుస్తూ ఉంటే ఐనా మానసికంగా ధైర్యం తెచ్చుకొని మాకు దక్కుతాడన్న ఆశతోనే రామకీర్తనలూ పుస్తకమూ అంటూ ఆశపెట్టాను. చిన్నపిల్లవాడికి మందుతాగితే మిఠాయి ఇస్తానని చెప్పినట్లు! ఐనా మా దురదృష్టం. వాణ్ణి దక్కించుకోలేక పోయాం.


నాయనా రామం, నీగురించి ఇలా వ్రాసుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదురా తండ్రీ!

15 కామెంట్‌లు:

  1. కొత్తగా ఈవ్యాసంలో చేర్చిన మాటలు.
    ఈ 9వ తారీఖు సాయంత్రం ఐదున్నర మా రామానికి నేను పంపిన చివరి వాట్సాప్ సందేశం.
    మధ్యాహ్నం డా. సందీప్ గారితో మాట్లాడాను. ఇంకా కొన్నిరోజుల పాటు ఆక్సిజన్ అవసరం అన్నారు. ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోవాలని నొక్కి చెప్పారు. సహించకపోయినా ధారకం లేకపోతే చిక్కుకదా. పుష్టిగా తినవలసిందే. త్వరలోనే నయం అవుతుంది. పైనెలలో నీచేతులమీద రామకీర్తనలు పుస్తకం విడుదల చేయాలి నువ్వు. ఏమీ దిగులు పడకుండా ఆహారం-మందులు-విశ్రాంతితో తొందరగా ఇంటికి వచ్చేయి.
    -అన్నయ్య.
    (ఇప్పటికే ఈవ్యాసం చదివిన వారి సౌకర్యార్ధం వ్యాఖ్యగా కూడా చూపుతున్నా)

    రిప్లయితొలగించండి
  2. "నాయనా రామం, నీగురించి ఇలా వ్రాసుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదురా తండ్రీ!"

    జీవితంలో ఇటువంటివి తప్పవేమో. మీ రామ కీర్తనల పుస్తకం ప్రచురించి కొంచెం బాధ మరచి పోండి. మీ పుస్తకానికి సహాయం కావాలంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. జీవితంలో ఇటువంటివి తప్పవేమో. మీ రామ కీర్తనల పుస్తకం ప్రచురించి కొంచెం బాధ మరచి పోండి. మీ పుస్తకానికి సహాయం కావాలంటే చెప్పండి.
    నా మాట కూడా ఇదేనండి.
    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్కరాజు వారు, నీహారిక గారు, "జీవితంలో ఇటువంటివి తప్పవేమో" అన్నది నిజమే, ఆయువు పెరిగిన కొలదీ, ఆత్మీయులను కోల్పోవటాన్నీ చూడవలసి వస్తుంది కదా.

      తొలగించండి
  4. అయినవారిలో వయసు చిన్నవారు ముందే వెళ్ళి పోవడం దారుణమైన పరిణామం. మీ తమ్ముడు హఠాత్తుగా మరణించడం దిగ్భ్రాంతి కలిగించే వార్త. కరోనా మహమ్మారి తీసుకున్న మరో బలి.

    మీకందరకూ నా ప్రగాఢ సానుభూతి.
    దివంగత ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, చిన్నవారు తమకళ్ళముందే వెళ్ళిపోవటం పెద్దవారు చేసుకున్న పాపం అని వినికిడి. ఏమి పాపం చేసుకున్నానో తెలియదు.

      తొలగించండి
  5. శ్యానా బాధాకరమైన ఇషయం. మా దూరపు చుట్టాలలో ముప్పై ఏడేళ్ళతనికి మేరిక నుండి చెన్న పటం మీదుగా హెద్రాబాద్ వస్తూనే గాంధి ఆసుపట్రి చేరుకునే సరికే అటాక్ జరిగి, ఆకస్మికంగా కోవిడ్ తో పరమపదించారు.
    అలానే నా భార్య మేనత్త కు కూడా కోవిడ్ సోకి అర్ధాంతరంగా తనువు చాలించారు.

    మొదటతను క్వారెంటైన్ రూల్స్ ను సరిగ్గ పాటించలేనందువలన. ఇహ ఆమే మాత్రం ఎటువంటి మాస్క్ లు, శానిటైజర్ లు, సోషల్ డిస్టెంసింగ్ పాటించలేనందువలన. పైగా ఆమే అల్కాహాలిక్ కావునా హైపర్ టెన్సివ్ 320/110mmHg బ్రెయిన్ స్ట్రోక్, హైపర్ గ్లైసేమియ 450mg/dLకోమార్బిడిటి.

    జన సహూమహులో తిరగాడే వారు తెలిసో తెలికో చిన్న చిన్న అజాగ్రత మూలాన కోవిడ్ బారిన పడుతున్నారు. ఎవరి జాగ్రతలో వారుంటే ఏమో ఇంకో నాలుగైదు నెలల ఆయువైన వెనకేసుకోగలం. ఏమో ఈ మహమ్మారి అదేదో మూవిలో డైలాగ్ లా కంటికి కనపడని శత్రువుతో పోరాటమేమో..
    కోవిడ్ బారిన పడి పరమపదసోపానాన్ని అధిరోహించిన వారి ఆత్మశాంతికై ఆ శంకర స్వామిని వేడుకుంటూ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నిజాగ్రతలు తీసుకున్నా కోవిడ్ వచ్చేస్తున్నదండీ. మా చిన్నతమ్ముడి కుటుంబం అసలు తలుపులు తెరవనే తెరవరన్నట్లు జాగ్రతపడినా ఇంట్లో‌ అందరినీ అది పట్టుముంది. అదృష్టవశాన అంతా చక్కగా కోలుకున్నారు.

      తొలగించండి
  6. అయ్యయ్యో!

    మొదటిసారి తొలినాళ్ళలో ఎలా వస్తుందో అలానే పోతుందని నిర్లక్ష్యం చేశాయి ప్రభుత్వాలు.జనమూ మీడియా గోల చెయ్యడంతో లాక్ డౌన్ పెట్టేసి జనాన్ని ఇళ్ళలో కూర్చోబెట్టి చావుల్ని తగ్గించారు.కానీ లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ప్రజల్ని వాళ్ళ చావుకి వాళ్ళని వదిలేశారు.ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది చనిపోతున్నారు.

    కరోనాకి అసలు పరిష్కారం లాక్ డౌన్ కానే కాదు.అది కేవలం ప్రధమ చికిత్స లాంటిది.ఆ సమయంలో వ్యాక్సిన్ గానీ పూర్తి స్వస్థతని ఇచ్చే మందుల్ని కనిపెట్టడం గానీ చేసి ఉంటే బావుండేది.లేదా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ లీడ్ చేస్తూ తమ బాధ్యతల్ని నిర్వర్తించి ఉంటే ఇన్ని చావుల్ని చూడాల్సి వచ్చేది కాదు.ప్రభుత్వాలు ప్రజల్ని గాలికి వదిలేసినప్పుడు ప్రజలే తమ క్షేమం చూసుకోవాలి.

    దేశం నుంచి కరోనా పూర్తిగా అదృశ్యం కావాలంటే యజ్ఞాలు చెయ్యటం తప్ప మరో దారి లేదు.వేదాస్ వరల్డ్ ఇంక్ వారి అధ్వర్యంలో రాజమండ్రి, జగ్గయ్యపేట, విశాఖపట్టణం, హైదరాబాద్ నగరాలలో జరిగిన అన్ని యజ్ఞాలూ నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాయి.కానీ ఇన్ని దశాబ్దాల/శతాబ్దాల పాటు వ్యతిరేకులు చేసిన విష ప్రచారం వల్ల హిందువులకి నాలాంటివాళ్ళు చెవినిల్లు గట్టుకుని చెప్పినప్పటికీ నమ్మకం కుదరడం లేదు.

    ప్రచారం,హడావిడి,జబర్దస్తు,ఆర్భాటం లేనిదే ఏదీ జరగడం లేదు.మొదట కదలాల్సింది యజ్ఞాలు చేసిన అనుభవం ఉన్న వేద పండితులు.వాళ్ళు ముందుకు వచ్చి విజ్ఞప్తి చేస్తే వైదిక ధర్మం పట్ల అనురక్తి ఉన్న వ్యాపార వేత్తలూ పారిశ్రామికాధిపతులూ స్పందిస్తే దృశ్య మాధ్యమం కూడా కలిసివచ్చి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తే జరగాల్సిన చాలా పెద్ద పని అది.

    అంతటి దృశ్యం ఇప్పుడు లేదు గాబట్టి విడివిడి వ్యక్తులు రోగనిరోధకశక్తిని మెరుగు పర్చుకోవటమే పరిష్కారం.ప్రాచీన కాలపు పాకశాస్త్రం చెప్పే చిట్కాలు అద్భుతమైన ఫలితాల్ని ఇస్తాయి.ఆయుర్వేదం ప్రకారం జీవనశైలిని మలుచుకోవటం తప్ప మనం చెయ్యగలిగింది లేదు.ఇప్పటికే చాలా దుఃఖపు వార్తల్ని వింటున్నాం.తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దైవాన్ని స్మరించుకుంటూ కాలం గడపండి.

    సర్వే జనాః సుఖినో భవంతు.
    హరి.S.బాబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జీవనశైలిని సరిదిద్దుకోవాలండీ. పూర్వం శౌచం విధిగా పాటించేవారు. దాన్ని చాదస్తం అన్నారు, ఇతరులను అవమానించటం అన్నారు ఏవేవో‌ అన్నారు. ఇప్పుడు అరఘడియకోసారి శానిటైజర్ పూసుకుంటున్నారు ఆరడుగులదూరం పాటిస్తున్నారు.

      తొలగించండి
  7. ఇపుడే చూశాను. రామం గారికి జోహార్లు. శ్యామలీయం మాస్టారుకు నా సానుభూతి. ఇప్పటికైనా కరోనా పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాల్సి ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంత ఘోరకలిలోనూ‌ ఈ ప్రభుత్వాలన్నీ, పార్టీలన్నీ రాజకీయాల యావలో ఉన్నాయి. కోవిడ్ కూడా బ్లేమ్‌గేమ్‌ కోసం పనికి వస్తోంది. జనానికి ముందుచూపు ఉంటే ఇలాంటీ దరిద్రులు నాయకులు అయ్యేవారు కారు. ప్రభుత్వాలకే ముందుచూపు ఉంటే లక్షలలెక్కన ప్రాణాలు పోతూ ఉండేవీ‌ కావు. ఒకాయనకు గెడ్డం‌ పెంచటం మీదనే ఎక్కువ శ్రధ్ధ. మరొకాయనకు ప్రతిపక్షం వారిని ఎలా లోపలవేయటమా అన్నదానిమీదే శ్రధ్ధ. మరొకాయనకు గొప్పప్రదర్శించుకోవటం మీదే‌ శ్రధ్ధ. కొందరికి విమర్శలు చేయటం మీదనే‌ గురి. సమాజం మీద ఎవరికీ శ్రధ్ధలేదు. సమాజం ఎవరికి కావాలి? కావలసింది ఓట్లు కదా - అవి కాస్తా ఎన్నికలలో నయానో భయానో ఎలాగో అలాగ తెచ్చుకోవచ్చును అని అందరికీ దిలాసా. ఈవ్యవస్థ కుళ్ళిపోతున్నదో కుళ్ళికూలిపోతున్నదో తెలియటం లేదు.

      తొలగించండి
    2. ఒహటి మాత్రం నిజమనిపిస్తోంది శ్యామల్ రావు సర్.. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా.. కోవిడ్ ధాటికి చేతులెత్తేశాయనే భావించాలి.. ఒక్క సారిగా ఈ సెకండ్ వేవ్ లో అమాంతం లక్షల పైచిలుకు జనానికి కోవిడ్ సోకుతుంది.. ఐనా గాని ఎక్కడెక్కువగా ఉంటే ఆయా రాష్ట్రాలదే బాధ్యత అని ఊరుకోవటం ఎంత వరకు సమంజసమో తెలియదు.. పైగా మెడికల్ ఆక్సిజెన్ నిలవలు బహుశ అంతంత మాత్రమే.. బెడ్స్ లేక జనాల అవస్థలు.. ముప్పై నుండి యాభై వేల దాక ఖర్చు.. ఏదేమైనా ఇంతకు ముందు బసులో, ట్రెయిన్ లో, ఫ్లైట్ లో, ఆటోలో ఉండే లైన్ ఇహపై అందరికి వర్తించనుందో ఏమో.. అదే ఎవరి ఆరోగ్యం వారిదే బాధ్యత.. డబల్ మాస్క్, డీనేచర్డ్ రబ్బింగ్ అల్కాహాల్ గల శానిటైజర్, ఆరు నుండి తొమ్మిది గజాల దూరం.. వీటితో పాటు పౌష్టికాహారం, వ్యాక్సినేషన్ మరియు తగిన వ్యాయాయం ఈ కోవిడ్ ప్రభావాన్ని ఓ పది-పదిహేను శాతం వరకు అణచగలదని భావిస్తు.. అందరు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ..

      తొలగించండి
    3. నేను గమనించినదాని ప్రకారం, రాహుల్ గాంధీ ఒక్కడే కరోనా గురించి మాట్లాడుతున్నాడు.

      ఆంధ్రాలో ప్రతిపక్షం గురించి చెప్పాల్సిన పని లేదు. జగను, రాజా రెడ్డి రాజ్యాంగం అని తిడుతూ, నేరాలు చేసిన వారిని అరెష్టు చేస్తే.. వారి తరుపున వకాల్తాలు పుచ్చుకోవడం తప్ప.. ఇక చేసేస్తున్నదేం లేదు.

      తొలగించండి
    4. చిరు గారు, రాజకీయుల్ని పొగడేవారూ తెగడేవారూ కూడా సహజంగానే ఉంటారు. రాహుల్ కంపెనీ అధికారంలో ఉంటే ఏదో గొప్పగా చేసేవారన్న భ్రమలు లేవు.

      ఐనా ఈవ్యాసం రాజకీయాల గురించి కాదు కాబట్టి ఆవిషయాలను గురించి విపులచర్చలు వద్దులెండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.