16, ఫిబ్రవరి 2023, గురువారం

ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు - అన్నమయ్య శృంగారసంకీర్తనం



     దేసాళం

ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు
కంకణాలు గట్టిన నీకళ్యాణపు సుద్దులు

ముంగిటికి వచ్చె నివె మోహపు నీ సుద్దులు
అంగడిలోనికి నెక్కె నా సుద్దులు
కొంగుబంగారము లాయె కోరికె నీ సుద్దులు
యెంగిలి మోవికి సోఁకె నీ సుద్దులు

పొంచులకు లోనాయ పొరుగుల నీ సుద్దులు
యెంచితే నెన్నైనాఁ గల నీ సుద్దులు
కంచపు పొత్తు గలసె కడలేని నీ సుద్దులు
దించరాని మోపులాయె దినదినసుద్దులు

ఇసుకపాఁతర లాయె నిదివో నీ సుద్దులు
ముసిముసి నవ్వులాయె ముందే సుద్దులు
యెసగి శ్రీవేంకటేశ ఇంంతలో నన్నేలితివి
కొసరితే నిగిరించీ కూరిమి నీ సుద్దులు

ఇదొక అందమైన శృంగారసంకీర్తనం. ఇరవైతొమ్మిదవ సంపుటంలోని 189వ సంకీర్తనం.

ఈకీర్తనలో మాటిమాటికీ సుద్దులు అన్న మాట వస్తూ ఉంటుంది. సుద్దులు అంటే మంచిమాటలు అని అర్ధం. ఈ సుద్దులు వారివీ వీరివీ‌ కాదు శ్రీవేంకటేశ్వరుల వారివి. అయన అమ్మవారితో సెలవిచ్చిన అందమైన మాటలు. అసలిక్కడ సుద్దులు అంటే అందమైన మాటలు అని తీసుకుంటేనే‌ పసందుగా ఉంటుంది.

అందమైన మాటలు మరి అవి యెటువంటి వనుకుంటున్నారూ? అవి కళ్యాణపు సుద్దులు. అంటే స్వామివారు తమ వివాహ సమయంలో అమ్మవారితో మొదలుపెట్టిన అందమైన పలుకులు. అవి ఇంతలో అందలో వెన్నెతగ్గే రకం‌ మాటలా అని? లోకంలో ఆలుమగలు పెండ్లి ఐన కొత్తలో పరస్పరం ఎంతో అందంగా పొందికగా సరసంగా మాట్లాడుకుంటారు. రానురానూ కొత్త మురిపెం తీరి ఆమాటల్లో కొంత అందచందాలు తగ్గుతాయి. అవి క్రమంగా వెన్నెవాడి మెల్లగా కొంతమందిలో దెప్పుళ్ళకూ దెబ్బలాటలకూ దారితీసేంత అధ్వాన్నంగా మారుతూ ఉంటాయి. ఆ కొంత కాలం అన్నది ఎంతకాలమూ అంటే పదహారురోజుల పండుగ వెళ్ళకుండానే పోట్లాటలకు నిలయమైన కాపురాలూ‌ ఉంటాయి, ఇద్దరూ ఎనభైవపడిలో పడ్డా పరస్పరం ఎంతో ముచ్చటగా సంభాషించుకొనే ఉత్తమదంపతుల కాపురాలూ ఉంటాయి. అంతా సృష్టివైచిత్రి.

కాని సృష్టికే మూలమైన ఆదిదంపతుల కళ్యాణపు మాటల అందచందాలు అలాగే ఉంటాయి ఎన్నటికీ. వాటితీరుతెన్నులను అన్నమయ్య గారు ఈసంకీర్తనలో వర్ణిస్తున్నారు.

మరొకరకంగా కూడా ఈకళ్యాణపుసుధ్దులు అన్న ప్రయోగాన్ని అర్ధం చేసుకోవచ్చును. కళ్యాణప్రదమైన సుధ్ధులు అని. కళ్యాణం అంటే శుభం అని అర్ధం కదా. అంటే శ్రీవారి సుద్దులన్నీ శుభప్రదమైనవి అని చెప్పటం. ఎటువంటి శుభాలో ఈ సంకీర్తన వివరిస్తూ ఉంది. ఐతే ఇక్కడొక చిక్కు వస్తోంది. ఆకళ్యాణపుసుధ్ధులు సామాన్యమైనవి కావూ కంకణాలు కట్టినవీ అంటున్నారే, దానికి అన్వయం ఎట్లా చేయటమూ అని ప్రశ్న ఒకటి ఉంది కదా. దానికి సమాధానం ఏమిటీ అన్నది చెప్పుకోవాలి. రెండువిధాలుగా సమాధానం చెప్పవచ్చును మనం. ఒకడు ఈపని చేస్తానూ ఇలాగే చేస్తానూ అని కంకణం కట్టుకొని కూర్చున్నాడు అని అనటం లోకంలో ఒక వ్యవహారం ఉంది. దాని అర్ధం పట్టుబట్టుకొని ఉండటం అని. నామాటలు శుభాన్నే‌ కలిగించాలీ అని స్వామివారు కంకణం కట్టుకొని ఉన్నారని సమాధానం చెప్పి సమన్వయం చేయవచ్చును. మరి కీర్తనలో కట్టుకొన్న అని కాక కట్టిన అని ఉంది కదా అని శంక చేయవచ్చును. దానికేం ఆచార్యుల వారు గీత సౌలభ్యం కోసం అలా వ్రాసారని అనుకోవచ్చును లెండి. ఇబ్బంది లేదు. మరొక పక్షం ఏమిటంటే,  మొదట మనం అనుకున్నట్లే స్వామి వారు కళ్యాణంతో మొదలైన సుద్దులు అని చెప్పుకోవటం.

ఆస్వామి వారి సుద్దుల గురించి సంకీర్తనం ఎలా వివరిస్తోందో చూదాం.

ఈ సంకీర్తనంలో చివరి చరణంలో ఉన్న నన్నేలితివి అన్న ప్రయోగాన్ని బట్టి ఈ మాటలన్నీ అమ్మవారు అయ్యవారిని ఉద్దేశించి పలుకుతున్నట్లుగా భావన చేయాలి మనం.

ఒకరోజున అయ్యవారు కొంచెం ముభావం నటించారు. అయ్యవారికీ అమ్మవారికి మధ్యన ఏమైనా ప్రణయకలహం‌ నడిచిందా ఈసంఘటనకు ముందుగాను లేదా అయ్యవారు మరేదైనా కారణం వలన అలసి ఉండి సరసోక్తులను పలుకకుండా ఉన్నారా అమ్మవారి వద్దకు వచ్చి కూడా కొద్దిసేపు అన్నది విచార్యం. ఐతే అమ్మవారు అయ్యవారిని హుషారు చేయటానికి ప్రసంగం మొదలు పెట్టింది.

ఎందుకయ్యా దాస్తున్నావూ అందమైన నీ మాటలన్నీ నాదగ్గర ఈవేళ, ఎంతో శుభకరమైన నీ మాటలను దాచటం దేనికీ, అని నిలదీస్తున్నట్లుగా అడుగుతోంది.

ఓ వేంకటరాయడా నీ మోహపూరితమైన సుద్దులు నా ముంగిట్లోకి వచ్చాయి. అలా ముంగిట్లోనే మొదలైన ఆ సుద్దులు అంగడికెక్కాయి కదా! అలా ఎవరైనా ముంగిట్లోనే సరసాలు మొదలుపెడతారటయ్యా నీమోహమూ నీవూను కాకపోతే. దానితో బజార్న పడ్దాం. ఊళ్ళో అందరూ మన విడ్డూరం గురించే చెప్పుకోవటమూ నవ్వుకోవటమూ కదా! నీ సరసవచానాలు నాకు కొంగుబంగారాలు ఐనాయి. కోరిన కోరికలన్నీ శుభప్రదంగా తీరుస్తూ ఉన్నాయిలే. అసరసవచనాలు ఎప్పుడూ నామూతిని ఎంగిలి చేసి వదలటమే కదా అని అమ్మవారు ముసిముసి నవ్వులు చిందిస్తూ అంటున్నది. ఇలా స్వామితో ముచ్చటించటం అంతా అయనలో నేడు కనిపిస్తున్న ముభావాన్ని వదిలించటానికే.

మరలా అమ్మవారు ఇలా అంటోంది. నీ ముచ్చట్లు ఎంత గుట్టుగా ఉంటాయో తెలిసిందే అందరికీ. అందుకే ఈమహానుభావుడి నేటి వ్యవహారం ఏమిటో అని అందరూ పొంచి దొంగతనంగా మననిచూడటమే నిత్యమూ. నీకైతే పట్టింపే‌ లేదు కదా! ఇలా అందరి చెవులా పడేలా నువ్వాడే సరసాల గురించి చెప్పేదేముంది. ఇన్నా అన్నా? ఎంచబోతే లెక్కేలేనన్ని కదా!

నీ‌అంతులేని సరసవచనాలు భోజనాల దగ్గరైనా ఆకాసేపైనా ఆగేది ఉందా అంటే, ఏమి చెప్పేది. ఆధరవులపైన వంకలు పెట్టి కూడా చిత్రమైన సరసవాక్యాలు చెప్తావు కదా. (అన్నమయ్య గారు వేరొక సందర్భంలో కంచపురతులు అన్న చిత్రమైన ప్రయోగం కూడా చేసారు) కంచాల దగ్గర నీ సరసాలు అంతూ పొంతూ లేనివి కదా. అవి మోపులుమోపులుగా పేరుకొని ఉన్నాయి. అవి నాతలకెక్కి దించరాని మాధుర్యాన్ని అందిస్తూ ఉన్నయి నిత్యమూ.

అబ్బే మోపులుమోపు లేమిలే నీసరసాలు అంత చిన్న ఉపమానం సరిపోతు. అవి ఇసకపాతరలే అనుకో. ఎంత తవ్వుకొన్నా తరగకుండా ఉండేవి కదా. అలా అనటమే‌ బాగుంటుంది.

అమ్మవారు ఇలా ఆ శ్రీవేంకటేశ్వరుని సరసవచనాలను గురించి తన భావన ఎలా ఉందో చెప్తూ ఉండే సరికి అయ్యవారికి అనందం కలిగింది. ముభావంగా ఉన్న మోము విచ్చుకుంది.

అంతలోనే ఆయన ముసిముసి నవ్వుల విరజిమ్ముతూ అమ్మను తిలకించటం మొదలుపెట్టాడు ఇంకా ఏమంటుందా అని.

ఓ వేంకటేశా ముందుగా ముసిముసి నవ్వులు పూసాయి నీమోముపై. అమ్మయ్య నన్ను కరుణించావు. సంతోషం. ఇదిగో మళ్ళా విజృంభిస్తున్నావు ఉత్సాహంతో.  బాగుంది బాగుంది ఇలా ఉండాలి అంటోంది అలమేలు మంగమ్మ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.