13, ఫిబ్రవరి 2023, సోమవారం

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ - అన్నమాచార్య శృంగారసంకీర్తనం.



         సామంతం

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతి నలమేలుమంగ           
             
కన్నులనె నవ్వునవ్వి కాంతునిఁ దప్పక చూచి
మిన్నక మాటాడీ నలమేలుమంగ
సన్నలనె యాస రేఁచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతోఁ గొసరీని యలమేలుమంగ              

సారెకుఁ జెక్కులు నొక్కి సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికిఁ గప్పురవిడెమిచ్చి
యారతు లెత్తీ నదె యలమేలుమంగ            

ఇచ్చకాలు సేసి సేసి యిక్కువ లంటియంటి
మెచ్చీ నతని నలమేలుమంగ
చెచ్చెర కౌఁగిటఁ గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగా నురమెక్కీ నలమేలుమంగ        

ఇది అన్నమాచార్యుల వారి శృంగారసంకీర్తనం. తితిదే వారు ప్రచురించిన ఏడవ సంపుటం లోని 21వ సంకీర్తనం.

 


ఈ కీర్తన లోని కొన్ని పదాలను ముందుగా పరిశీలిద్దాం.

మిక్కిలి:  చాలా.
అక్కర:   అవసరం.
మిన్నక:   ఊరుకోకుండా, అప్రయత్నంగా, చల్లగా.
సన్నలు:   సంజ్ఞలు.
జంకెన:   బెదరింపు.
బొమ్మలు:  కనుబొమలు
అన్నువ:   స్వల్పము.
సారెకు:   మాటిమాటికి.
చెక్కులు:  చెంపలు.
మేరలు మీరు: హద్దులు దాటు.
విడెము:   తాంబూలము.
ఇచ్చకాలు:  సరసాలు
ఇక్కువలు:  కళాస్థానాలు.
చెచ్చెర:    వెంటవెంటనే.
ఉరము:   వక్షస్థలము.

అలమేలు మంగ అమ్మవారు చాలా నేర్పుగల పడతి సుమా అని అన్నమాచార్యుల వారు ఈకీర్తనలో ప్రతిపాదిస్తున్నారు. ఎందుకలా అంటాం కదా అని వివరణలను ఇస్తున్నారు.

ఆమె కన్నులతో నవ్వుతున్నదట! అంటే సంతోషభావం ఆవిడ కళ్ళల్లోనే కనిపిస్తున్నది. అటువంటి సంతోషం వెలిబుచ్చే‌కళ్ళతో ఆమె భర్త ఐన శ్రీవేంకటేశ్వరుని పదేపదే చూస్తూ చల్లగా ప్రియమైన మాటలు చెబుతున్నదట. అంటే ఓరకళ్ళతో చూసీచూడనట్లే చూస్తూ అందంగా ఆయనతో సంభాషణ చేస్తున్నది అని పిండితార్ధం. అంతే కాదు తన వివిధమైన సంజ్ఞలతో ఆయనకు ఆశలు రేకెత్తిస్తూ సరసవాక్యాలు మాట్లాడుతూ ఉన్నది. అలాగని ఆయన కొంచెం చొరవచూపించినంత మాత్రాన ఏమి చేస్తోందండీ? ఆవిడ కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉన్నాయి కదా వాటిని కొంచెంగా ముడివేసి వంచి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అభినయం చేస్తూ ఉంది. ఇలా అలమేలుమంగమ్మ ఆయనతో కొసరికొసరి సరసాలాడుతూ ఉన్నది.

కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉండటం గురించి సౌందర్యలహరీ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు.

భువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనిని  
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్‌ 
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః  
ప్రకోష్టే ముష్టాచ స్థగయతి నిగూఢాంతర ముమే.  
 
ఇది సౌందర్యలహరిలో 47వ శ్లోకం.

ఈ శ్లోకం భావం ఏమిటంటే, అమ్మా నీ కనుబొమలు తుమ్మెదల బారులాగా నల్లగా అందంగా ఉన్నాయి. అవి కొంచెం వంగి ఉన్నాయి. మన్మథుడి విల్లులా అనిపిస్తుందమ్మా వాటి తీరు. రెండు బొమలూ కలిపి ఒక విల్లు. కాని మధ్యలో కొంత భాగం కనబడటం లేదు. కాబట్టి రెండుగా కనిపించటం అంతే. ఆఁ అక్కడ మన్మథుడు తనచేతితో పట్టుకొన్నాడు కదా వింటిని. అందుకే కొంచెం అక్కడ మరుగు అయ్యింది. అంతే నమ్మా" అని.

ఈవిధంగా కనుబొమలను మన్మథుడి వింటితో పోల్చటం అనే‌ శృంగారసంప్రదాయం ఒకటుంది కదా. అలా ఆ మన్మథుడి వింటి వంటి కనుబొమలను అలమేలుమంగ మాటిమాటికీ కొద్దిగా కదుపుతూ ఉంటే అమన్మథచాపాన్ని ఎక్కుపెట్టటం విన్యాసంలా ఉంది.

కాని తాను మాత్రం తిన్నగా ఎదుటనే కూర్చుంటుందా ఇలా మాట్లాడుతూ? ఊఁ హూఁ. కూర్చోదు. ఆయన ప్రక్కనే వచ్చి కూర్చుంటుంది తాకుతూ. తానే హద్దు మీరి ఆయన బుగ్గలు నొక్కుతూ వినోదిస్తూ ఉంటుంది.

కొద్ది సేపటికి ఆవినోదం చాలించి ఆయనకు ప్రేమతో కర్పూరతాంబూలం అందిస్తుంది. ఆయనకు తన దృష్టే తగులుతుందని భయపడినట్లుగా హారతి ఇచ్చి దిష్టితీస్తుంది!

ఇలా ఆయనతో సరసాలు ఆడీఅడీ సంతోషిస్తుంది. అయనకు వివిధోపచారాలు చేస్తుంది.

అయన కళాస్థానాలు అంటి సంతోషిస్తుంది. కళాస్థానాలు పదహారు. అవి శృంగారశాస్త్రానికి సంబంధించినవి. 1. తల, 2. ఎదురురొమ్ము, 3. చేతులు, 4. కుచములు, 5. తొడలు, 6. నాభి, 7. నుదురు, 8. కడుపు, 9. పిఱుదులు, 10. వీపు, 11. చంకలు, 12. మర్మస్థానము, 13. మోకాళ్ళు, 14. పిక్కలు, 15. పాదములు, 16. బొటన వ్రేళ్ళు అనేవి.

ఈపదహారు కళాస్థానాలు మళ్ళా చంద్రకళలతో ముడిపడి ఉంటాయి. ఏరోజున ఏతిథి అవుతున్నదో దానికి సంబంధించిన కళాస్థానం మిక్కిలిగా శృంగారోద్దీపనశక్తిని కలిగి ఉంటుందని శాస్త్రం. ఇవి సంచరించే క్రమం శుక్లపక్షంలో ఒకరీతిగానూ కృష్ణపక్షంలో వేరొక రీతిగానూ ఉంటుంది. మరలా ఇవి పురుషులకూ స్త్రీలకు భిన్నవిధానాల్లో సంచరిస్తాయి.  కాబట్టి ఈసంగతి చక్కగా తెలిసిన వారు తగిన కళాస్థానాన్ని స్పృశించటం ద్వారా శృంగారభావోద్దీపనం చేయగలరు.

ఈకళల వ్యవహారం గురించి ఒక ఐతిహ్యం ఉంది. మండనమిశ్రులను వాదంలో‌ కాలడి ఆదిశంకరులు జయించారు. ఓడిన మండనమిశ్రుడు సన్యాసం స్వీకరించాలి. కాని ఆయన భార్య  ఉభయభారతి ఒక అడ్డుపుల్ల వేసింది. 

"శంకరా, భార్య భర్తలో అర్ధభాగం కదా. నువ్వు మండనులు అనే ఒక అర్ధభాగాన్ని జయించావు సంతోషం. ఇంకా నువ్వు ఈఉభయభారతి అనే అర్ధభాగాన్నీ జయిస్తే తప్ప నీవిజయం పరిపూర్ణం కాదు సుమా. అహా, నీకు తెలియదని కాదు. ముందుముందు ఎవరూ ఈమాట లేవనెత్తి నీవిజయం అసమగ్రం అనకుండా ఉండేందుకే గుర్తుచేస్తున్నాను" అన్నది. 

శంకరులు "సరే నమ్మా, నీకు ఇచ్చవచ్చిన శాస్త్రంలో ప్రశ్న వేసి వాదం ప్రారంభించు" అన్నారు.

"శంకరా, కళాస్థానాలు ఎన్ని? అవి యేవేవి? స్త్రీకి ఏఏ దినాల్లో అవి ఎలా సంచరిస్తాయి" అని ప్రశ్నవేసింది ఉభయభారతి.

శంకరుడు నిర్ఘాంతపోయాడు. పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లైంది. సమాధానం చెప్పగలడు. కాని చెప్పకూడదు. సన్యాసివి నీకు ఎలా తెలుసు అనగలదు. అంతే కాదు స్వానుభవం లేకుండా శాస్త్రం వల్లెవేయటం అని ఎత్తిపొడవగలదు.

"అమ్మా ఉభయభారతీ. నీవు సాక్షాత్తూ సరస్వతీదేవివి! ఒక సన్యాసిని శృంగారశాస్త్రంలో పరీక్షిస్తున్నావా అమ్మా! తప్పు అనకూడదు. నేను కాశ్మీరం వెళ్ళి నీ సర్వజ్ఞపీఠాధిరోహణం చేయాలని ఆశించేవాడిని. నీకు తెలుసు. అన్ని శాస్త్రాలూ తెలిసి ఉండాలి నాకు. ఈశాస్త్రం తెలిసినా దాని గురించి మాట్లాడే అధికారం లేదు ప్రస్తుతం. నువ్వు గడువు ఇస్తే మరలా వచ్చి నీప్రశ్నకు జవాబులు చెప్తానమ్మా" అన్నాడు.

ఉభయభారతి నవ్వి "అలాగే‌ శంకరా, నాకు తొందరేమీ లేదు. జవాబును మళ్ళీ వచ్చి చెబుదువు గానిలే" అని అంగీకరించింది.

ఆపిమ్మట శంకరులు పరకాయప్రవేశం చేసి ఒక రాజు శరీరంలో కొన్నాళ్ళు ఉండి తిరిగివచ్చి ఉభయభారతిని వాదానికి పిలిచారు. ఆవిడ అన్నదీ "శంకరా, అంతా తెలుసును నాకు. నీవిజయం పరిపూర్ణం అయ్యింది. ఇంక మండనులకు సంతోషంగా సన్యాసానికి అనుమతి నిస్తున్నాను" అన్నది. 

అప్పుడు మండనులకు సన్యాసార్హత వచ్చింది. భార్య అనుమతి లేనిదే భర్త సన్యాసం స్వీకరించరాదు. ఆ మండనమిశ్రులు సురేశ్వరాచార్యులు అయ్యారు.

అమ్మవారికి తెలియని శాస్త్రం ఏముటుంది. ఆవిడ శ్రీవారి కళాస్థానాల్ని పదేపదే తాకుతూ ఆయనకు భావోద్దీపనం చేస్తూ వినోదిస్తున్నది.

ఇలా చేసి శ్రీవేంకటేశ్వరుడి కౌగిట చేరి ఆనందిస్తున్నది.

ఈకీర్తనను అచ్చముగా ఉరమెక్కే నలమేలుమంగ అని చెప్పి ముగించారు. అమ్మవారు శ్రీవేంకటేశ్వరులతో లీలావినోదం చేసి ఆయన అక్కర తీర్చి ఆనందంతో వక్షస్థలంలో చేరి ఉన్నది అని అర్ధం. ఈ అక్కర తీర్చటం అన్న ప్రతిపాదనను మనం పల్లవిలో చూడవచ్చును. కొంచెం ఈముగింపుకు శృంగారశాస్త్రపరమైన వేరే అన్వయం కూడా చెప్పవచ్చును కొందరు. కాని అది అంత అవసరం కాదనుకుంటాను.

పల్లవిలో అక్కర దీరిచి పతిని అనటంలో ఒక సొగసుంది గమనించండి. అక్కర పతిది. అది తీర్చటంలో అలమేలు మంగ మిక్కిలి నేర్పరి అట అలమేలమంగ. ఇంతకూ ఈశృంగారాభినయం అంతా శ్రీవేంకటేశ్వరుడి అక్కర అట. ఆయన గారు సంకల్పించబట్టి ఇంత గ్రంథం మిక్కిలి నేర్పుతో అమ్మవారు నడిపిందట. ఇదేదో పూజ చేసి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నట్లుంది! ఆవిడ ఇలా శ్రీనివాసుడి ఇఛ్చమేరకు నేర్పుగా శృంగారం అభినయించి మరలా అచ్చముగా శ్రీవారి ఉరమెక్కి వ్యూహలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతోంది.

మనోహరమైన కీర్తన.