8, ఫిబ్రవరి 2023, బుధవారం

వెఱవకువయ్య నిన్ను వేసరించను - అన్నమయ్య శృంగారసంకీర్తన

 
 
     రీతిగౌళ
వెఱవకువయ్య నిన్ను వేసరించను
కఱకులాడఁగ నేను గబ్బిదాననా

మోము చూడఁగా నీకు మొక్కితి నింతే కాని
కామించి యేపనులకు గాదు సుమ్మీ
చేముంచి యాపె నీ చేయి పట్టు కుండఁగాను
వేమరు నే‌ నాసపడ వెఱ్ఱిదాననా

గక్కనఁ జేయి వేయఁగ కై దండ యిచ్చితిఁ‌ గాని
లెక్క సేయ నంత పనిలేదు సుమ్మీ
మక్కళించి మక్కళించి మాట లాపె యాడఁగాను
యిక్కడ నీసేవ సేయ నెడ్డదాననా

బడలి రాఁగా నీకు పాదము లొత్తితిఁ గాని
యెడసినందుకు బంత మీయఁ జుమ్మీ
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
 కొడిమె లింకా నెంచ గొల్లదాననా

 
ఇది అన్నమాచార్య సంకీర్తనల్లో పన్నెండవ సంపుటంలోని సంకీర్తన.

ఇక్కడ అమ్మవారు నాయిక. చిన్నపాటి ప్రణయకలహం ఇక్కడ సందర్బం. అమ్మవారు శ్రీవేంకటేశ్వరుని దెప్పటం ఈసంకీర్తనలో వర్ణించబడింది. శ్రీవారు దక్షిణనాయకుడు. అయన ఇద్దరుభార్యల ముద్దుల మగడని మనకు తెలిసిందే‌ కదా. సవతుల కయ్యాలు జగత్ప్రసిధ్ధం. గంగాగౌరీ సంవాదం అని ఏకంగా ఒక పెద్దపాటే ఉంది గంటసేపు పాడవచ్చును. సవతులు తమలోతాము గొడవపడటంతో పాటుగా మగడినీ ఒకదులుపు దులుపుతూ ఉంటారు. 

ఇది అటువంటి ఒక పాట. అమ్మవారు వెంకన్నను దులుపుతూ పాడినది.

ఓ వేంకటేశ్వరుడా ఏమీ వెఱవకు (అంటే భయపడకు). నిన్నేమీ నేను వేసరించనులే (వేసరించటం అంటే శ్రమపెట్టటం). నేనైమైనా గబ్బిదాన్నా (కొంటెదాన్నా అని భావం) నీమీద కొపగించుకొని కఱకుమాటలు (కఱుకు మాట అంటే కఠినమైన మాట అని అందరికీ తెలిసిందే) పలకటానికి? ఇదీ పల్లవి.

నువ్వు నాముఖం కేసి చూసావని మరియాదకు నీకు మొక్కానంతే. అంతే కాని నీవల్ల నాకేదో కావాలని ఆశించి మాత్రం కాదులే! చేముంచి (అంటే సాహసించి - నేనిక్కడే ఉన్నానన్న జంకూ గొంకూ‌లేకుండానే) ఆమె నీచేయి పట్టుకొని ఉండగానే నీమీద ఇంకా వేయిరకాల ఆశలు పెట్టుకోవటానికి నేనేమైనా వెఱ్ఱిదాన్నా? 

నువ్వు ఇలా చొరవగా గ్రక్కన (వెంటనే - నన్ను చూసి వెంటనే) మీద చేయి వేసావు. నేను చిరాకుపడి తప్పుకుంటే తూలిపోయేవాడివి. అలా చేస్తే నీవు తూలిపోతావని పోనీలే అని నాచేయి నీకు ఆసరా ఇచ్చానంతే. ఆమాత్రానేనికే ఏదో నేను ఉప్పొంగి పోయానని లెక్కలు వేసుకోకు సుమా!

ఆమే నీతో‌ నాయెదురుగానే ఇలా నిన్ను ఉబ్బెస్తూ గోముగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇక్కడే ఉండి నీకు సేవలు చేయటానికి నేనేమైనా మంచీచెడ్డా తెలియని ఎడ్డిదాన్నా?

ఇంతవరకూ అమ్మవారు వేంకటేశ్వరుడి మీద కోపం అభినయించింది. అయన చేష్టలతో ఏదో అనునయించాడని ఆమె కరిగి చివరిపాదంలో ఇలా అంటోంది.

నువ్వు (తిరిగితిరిగి) బడలికతో వచ్చావని నీపాదాలు నొప్పులు పుడుతున్నాయని జాలిపడి ఆ పాదాలని ఒత్తానా లేదా? నన్ను ఎడబాసి ఎక్కడెక్కడో తిరిగినావనని పంతం పట్టుకొని కూర్చోలేదు కదా?  నువ్వు కూడా ఎంతో ఉత్సాహంగా నన్ను చేరదీసుకున్నావు.  ఇప్పుడు ఇంకా నీ కొడిమెలు (తప్పులు దోషాలు పాపాలు ఇలా) ఎంచటానికి నేనేమన్నా ముద్దరాలైన గొల్లపిల్లనా? ఇక్కడ సారస్యం ఏమిటంటే గోపకన్నెలు శ్రీకృష్ణస్వామి యెడల కడు స్వతంత్రులు - ఆయనతో నిత్యం కలిసి తిరుగుతూ ఉండే వారు - అయన కాని తమను విడచి కొంచెం ఏమారినట్లు తోచినా నిర్మొగమాటంగా అయనతో దెబ్బలాటకు దిగేవారు కూడా. వారికి అలాచేస్తే స్వామికి కోపం వచ్చి దూరం అవుతాడన్న ఊహ ఉండేది కాదు. చిన్నపిల్లలు. తాను ప్రౌఢ. స్వామికి అలా అసందర్భపు మాటలు పలికి కోపం తెప్పించటానికి తానేమీ పద్దతి తెలీని గొల్లపిల్లను కాను అంటోంది.


3 కామెంట్‌లు:

 1. కీర్తన, వ్యాఖ్యానం బాగున్నాయి! కీర్తన లో "గబ్బి దాననా", "మక్కళించి", "కొడిమలెంచడం" లాంటి పద ప్రయోగాలు అచ్చ తెలుగు నుడికారాన్ని అందంగా ప్రతిఫలిస్తున్నాయి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవునండీ మంచి తెలుగు కోసం అన్నమయ్యను చదవాలి.

   ఎందుకో కాని ఈపాటకు తగిన బాణీ కట్టలేదని అనిపించింది ఆవీడియోలో.

   తొలగించండి
  2. రాగి రేకు లో రీతి గౌళ రాగం సూచించబడింది. అయితే ఈ పాట సరస్వతి రాగం లో స్వరం చేయబడినట్లు తెలుస్తుంది. గాయని గాత్రం లో స్పష్టత ఉంది. అయితే మీరు అన్నట్లు పాట బాణీ సాహిత్యానికి అతక లేదు అనిపిస్తుంది.
   కీర్తన అర్థ వివరణ బాగుంది.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.