నిన్నే నమ్మితి నని నీవెఱిగియు నన్ను పరీక్షించేవో
ఎన్నటి కైనను పరీక్ష ముగిసే దన్నది యున్నదటయ్యా
కోటి తనువులను నను జొప్పించిన గొప్ప దేవుడా నన్నా
కోటి జన్మముల కోటిబాధలకు గురిచేసితి వటులైనన్
సూటిగ నీపదపద్మంబులనే సొంపుగ నెన్నితి గాని
యోటువడితినా వేరొక దేవుని యొకనాడైనను తలచి
బహులోకంబుల సృజియించిన నిను బాగుగ నెన్నుచు మదిలో
నహరహమును నీపదపద్మంబుల నారాధించుచు రామా
యిహపరముల నాయునికి కారణము నెన్నుదు నీకృప యనుచున్
మహదైశ్వర్యం బది నీచెంతకు నను మరిచేర్చుట యెపుడో
దారిచూపితివి మున్నే నీవే తారక రాముడ వగుచు
తారకరామా నీనామమునే తలచువాడనగు నాకు
దారికడ్డమా యీపరీక్ష లివి దాటుదు నంతియె గాని
చేరుట తథ్యమయా నీసాన్నిధ్యము సర్వేశ్వర నిజము
చక్కటి కీర్తన.
రిప్లయితొలగించండిమీ ఈ కీర్తనలో కొంత భాగం నా బ్లాగ్ లో స్మరించుకున్నాను సర్.
అనేక ధన్యవాదాలు భారతి గారూ. వీలైతే నాకు లింక్ ఇవ్వగలరు.
తొలగించండి🙏
తొలగించండిhttp://smarana-bharathi.blogspot.com/2023/02/blog-post.html?m=1