14, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఎవ్వరే మందురయ్య యినకులతిలక

ఎవ్వరే మందురయ్య యినకులతిలక నీ
కవ్వల నివ్వల భక్తు లందరు గనుక
 
ఒకని గొట్టి బూడిదచేసి యొకని యదధి ద్రోయుటేమి
ఒకని కొక శిక్షవేసి యింకొకని నేల విడచినావు
అకట పక్షపాత మేమి యనరులే నిన్నెవ్వరును
వికచసరోరుహనేత్ర వీరాధివీర
 
మాయాతీతుడవయ్యు మాయదారి లేడి వెంట
పోయినావు లచ్చుమయ్య మొత్తుకొన్న వినకుండ 
న్యాయమేనా శ్రీరామ యనరులే‌ నిన్నెవ్వరును
వేయేలా లీలందురు విశ్వవందిత

సీత నెత్తుకపోయిన చెడ్డవాడు రావణుడు
చేతజిక్కి దీనుడైన చిదుమకుండ విడచుటేల
ఆతనిపై దయజూపు టవసరమా యనరు లేరా
నీతిశాలివందురులే నీరేజనేత్ర


5 కామెంట్‌లు:


  1. కీర్తన పరమాద్భుతం!
    "సీత నెత్తుకపోయిన చెడ్డవాడు రావణుడు
    చేతజిక్కి దీనుడైన చిదుమకుండ విడచుటేల"
    రామాయణం లో రావణుడి ని చేతచిక్కినా చిదుమకుండా వదిలేసిన సందర్భం ఎప్పుడు?

    రిప్లయితొలగించండి
  2. శ్రీమద్రామాయణం యుధ్దకాండలోని 59వ సర్గను చూడండి. ముఖ్యంగా క్రింది శ్లోకాన్ని గమనించండి:
    रयाहि जानामि रणार्दितस्त्वं |
    प्रविश्य रात्रिंचरराज लङ्काम् |
    अश्वस्य निर्याहि रथी च धन्वी |
    तदा बलम् प्रेक्ष्यसि मे रथस्थः || ६-५९-१४३

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈఘట్టం అథ్యాత్మరామాయణంలో కూడా కనిపిస్తుంది. యుధ్ధకాండ ఆరవసర్గలో ఈవిషయంపై నేమాని రామజోగి సన్యాసిరావు గారి పద్యం చిత్తగించండి:
      ఉ. పొమ్మిక రావణా సమరభూమిని వీడి గృహమ్ము జేరి యం
      దిమ్ముగ సేదదీర్చుకొని యెమ్మెయి రేపరుదెంచి నాదు శ
      స్త్రమ్ముల శక్తి చూచెదని రాముడు పల్కగ నాలకించి దై
      న్యమ్మున రావణుండు బదులేమియు బల్కక యేగె నింటికిన్.

      తొలగించండి
    2. ఈ శ్లోకం తెలుగు లిపిలో
      ప్రయాహి జానామి రణార్ధితస్త్వం
      ప్రవిశ్య రాత్రించరరాజ లంకామ్
      ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ
      తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః

      తొలగించండి
    3. 👌చక్కని వివరణ! ధన్యవాదాలు!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.