గౌళ
కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల
పొంత నీపె వేడుకలు పొసగగ జేయరే
వనములో కోవిలల వట్టి రట్టు సేయనేల
పెనగి తుమ్మెదల కోపించనేల
పనివడి చందురునిపై నేరమెంచనేల
వినయాన విభునికే విన్నపము సేయరే
గూటిలోని చిలకల కొసరి జంకించనేల
నీటున జల్లగాలిని నిందించనేల
పాటించి వసంతునితో పంతాలు దూయనేల
మాటలాడి విభుని నెమ్మదిని రప్పించరే
పంచనున్న పావురాల బదరి తిట్టగనేల
పంచసాయకుని నొడబరచనేల
ఎంచగ శ్రీవేంకటేశు డిదె వచ్చి యింతి గూడె
మంచివాయె బనులెల్లా మనవులు చెప్పరే
ఇది 29వ సంపుటి లోని కీర్తన.
ఈ సంకీర్తనలోని కొన్ని పదాలకు ముందుగా అర్ధాలు చూదాం. చాలావరకు పదాలన్నీ తెలిసినవే అందరికీ.
కాంత అంటే స్త్రీ. బత్తి అంటే భక్తికి వికృతి రూపం. అలాగే కోవిల అనేది కోయిలకు మరో రూపం. నీటున అంటే ఇక్కడ అందంగా తెలివిగా అని. వదరు అంటే ఎక్కువగా మాట్లాడటం. పంచసాయకుడు అంటే మన్మథుడు. ఒడబరచటం అంటే ఒప్పించటం. ఈ సాహిత్యంలో ఈపె అన్నమాట తరచు వస్తూ ఉంటుంది - ఈపె అంటే ఈమె అని అర్ధం. వనము అంటే ఏదో అడవి అనుకొనేరు. క్రీడోద్యానం అన్నమాట - అందులో ఛప్పన్న వృక్షాలూ అనేకరకాల పుష్పజాతులూ ఉంటాయి. రట్టుచేయటం అంటే తిట్టటం నిందించటం అని అర్ధం.
ఈ కీర్తన అలమేలుమంగమ్మను గూర్చి ఒక చెలికత్తె మిగిలిన చెలికత్తెలను హెచ్చరిస్తూ చెప్పినట్లుగా ఉన్నది.
ఇప్పుడు ఈ సంకీర్తనాన్ని అర్ధం చేసుకుందాం.
అది వసంతఋతువు. అయ్యవారూ అమ్మవారూ ఒక సమయం చేసుకున్నారు. అంటే ఈరోజు సాయంకాలం చంద్రోదయం వేళకు ఉద్యానవనంలో కాసేపు కులాసాగా కూర్చుందాం అని అనుకున్నారు.
సమయానికి అమ్మ అలమేలుమంగ చక్కగా ముస్తాబై ఎంతో ఆసక్తితో అనందంగా క్రీడోద్యానవనానికి వచ్చి అయ్యవారికోసం ఎదురుచూస్తూ ఉన్నది.
క్రీడోద్యానం అన్నాక అక్కడ అనేక ఫలవృక్షాలూ పూలమొక్కలూ పూపొదలూ గట్రా ఉన్నాయి.
పెత్తనాలు చేసివచ్చిన చిలకలు ఎన్నో ఎన్నెన్నో గూళ్ళకు తిరిగి వచ్చి హడావుడిగా అరుస్తున్నాయి. వాటితో పాటే పావురాలూను.
ఒక ప్రక్క సాయంకాలం ముదిరిపోతోందన్న తొందరలో తుమ్మెదలు గోలగోలగా పువ్వుల దగ్గర ఝుంకారాలతో హోరెత్తిస్తున్నాయి.
చల్లటి సాయంకాలం వేళ పిల్లగాలి మెల్లగా వీస్తున్నది హాయిగొలుపుతూ.
కొంతసేపు అలమేలు మంగకు ఈవినోదం అంతా మంచి కాలక్షేపంగానే ఉన్నది.
అయ్యో సాయం సంధ్య దాటి చంద్రోదయ వేళ అవుతోందే, శ్రీవారేమిటీ పత్తాలేరు అని ఆమెకు విరహం హెచ్చి పోతూ ఉంటే ఈవినోదాలే వెగటయ్యాయి! కొంచెంసేపు హాయి నిచ్చినవే ఇప్పుడామె మనస్సును నొప్పిస్తున్నాయి.
శృంగారం రెండు రకాలూ అని చెప్తారు. ఒకటి సమాగమశృంగారం రెండవది వియోగశృంగారం.
ప్రియసమాగమంలో ఏవేవి ఐతే ఆహ్లాదకరమూ శృంగారోద్దీపకమూ అని పేరుపడ్డవి ఉంటాయే అవి వియోగావస్థలో దుర్భరంగా ఉంటాయి.
వివిధరకాలుగా విరహావస్థలను వర్ణించి చెప్పటం అంటే కవులకు భలే యిష్టం. కావ్యసంప్రదాయంలో అన్ని కావ్యాలలోనూ ఇదొక ప్రథానమైన అవకాశంగా దొరకబుచ్చుకొని మన కవులు రెచ్చిపోతారు.
మన్మథుడు అని ఒకడున్నాడు. వాడు భలే తుంటరి. రకరకాలుగా ప్రేయసీప్రియులకు ఆకర్షణ కలిగించటం వాడి పని. ఆ మహాకార్యక్రమంలో వాడికి తోడ్పాటుగా పెద్దవ్యవహారమే ఉంది.
ఆది శంకరులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఈవిషయకంగా ఒక శ్లోకం చెప్పారు. బాగుంటుంది చిత్తగించండి.
ఈ అందమైన శ్లోకంలో ఏమని ఉందంటే శంకరులు లలితాపరాభట్టారికా అమ్మవారితో అంటున్నారు. ఈమన్మథుణ్ణి చూడమ్మా. వీడి ధనుస్సు చూస్తే పూవులతో కూర్చినది. అంటే సుతిమెత్తనిది. ఆవింటికి అల్లెత్రాడు అంటావా తుమ్మెదల బారు అట! వాడిచేతులో ఉన్న బాణాలు చూస్తే ఐదంటే ఐదే నట. వాడికి సహాయంగా నిలబడేది ఎవడయ్యా అంటే వసంతుడట సంబడం - వాడు ఉండేదెన్నాళ్ళని కూడా? వాడి రథమట మలయమారుత మట. అదేమో ఎప్పుడే దిక్కుగా పోతుందో దానికే తెలియదు. ఇంకా ఈ పటాటోపం అంతా వెంటవేసుకొని తిరిగే వీడికైతే అస్సలు శరీరమే లేదు. అబ్బే, అబ్బే. ఎందుకు పనికి వస్తాడమ్మా! కాని తమాషా ఏమిటంటే తల్లీ, నీ అనుగ్రహం పొంది నీ కడగంటి చూపు సంపాదించి ఈప్రపంచాన్నంతా జయించి గడగడలాడిస్తున్నాడు. అని.
గమనించండి. అమ్మావారు లలితాపరాభట్టారికను ఉపాసించే ఋషుల్లో మన్మథుడు ఒకడని సంప్రదాయవాక్యం.
ఇప్పుడు అర్ధమైనది కదా, ఈ వసంతమూ, ఈపువ్వులూ, తుమ్మెదలూ వగైరా అంతా మన్మథుడి పార్టీ అని.
అలాగే ఈమన్మథుడికి చిలుకతత్తడిరౌతు అన్న బిరుదం కూడా ఉంది. అంటే మరేమీ లేదు ఆయన వాహనం చిలుక అని. చిలుక గుర్రాన్ని స్వారీ చేసే రౌతు అని. ఇప్పుడు చిలుకలూ మన్మథుడి పార్టీయే అని తెలిసింది కదా.
ఇకపోతే చంద్రుడనే వాడూ మన్మథుడి పార్టీ అనే చెప్పాలి. విరహావస్థలో ప్రేమసీప్రియులకి చల్లని వెన్నెల వేడిగా అనిపిస్తుందని కవిసమయం. చంద్రుడికి శృంగారవర్ణనకూ సాహిత్యంలో బోలెడంత గ్రంథం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈసందర్భం చూసుకొని చంద్రుణ్ణి తిట్టించని కవిలేడు. ఒకాయన ఐతే అంటాడూ నీకు జాలి దయా ఎక్కడివయ్యా చంద్రుడా నువ్వు తురకల జండా ఎక్కి కూర్చుంటావు కదా అని!
అందాకా ఎందుకు చందమామను చూపకుండా సినిమావాళ్ళు మాత్రం వదులుతారా చెప్పండి.సినిమాల్లో చందమామ మీద ఉన్నన్ని పాటలు మరే ఇతర వస్తువుమీదా లేవు కదా! మనలో మనమాట సినిమాచంద్రుడికి చచ్చినా చిన్నమచ్చ కూడా ఉండదు.
సరే ఇప్పుడు అమ్మవారు ఎదురుచూస్తూ విరహంలో ఉంటే సాయంత్రం దాటి చంద్రోదయమూ ఐనది. ఆవిడ విరహాన్ని రెచ్చగొడుతున్న వాతావరణాన్ని గమనిస్తూ, ఆవిడ వేదన చూడలేక చెలికత్తెలు మన్మథుణ్ణీ వాడి పరివారాన్నీ కట్టగట్టి తిడుతున్నారు! అదీ సందర్భం.
ఈమహానుభావుడు శ్రీవేంకటేశ్వరుడేమో ఎంతకూ రాడాయె.
ఆచెలికత్తెలలో ఒకామె ఇతరులతో అంటున్నదీ, అలమేలుమంగమ్మపై మిక్కిలి భక్తిప్రపత్తులున్న ఓ చెలులారా,
మీరు
మన క్రీడోద్యానంలోని కోయిలలను పట్టుకొని ఎందుకు తిడుతూ అల్లరి
చేస్తున్నారు? పూవులకోసం పోటీలు పడి ఝుంకారాలు చేస్తున్న తుమ్మెదలను చూసి
ఎందుకు కోప్పడుతున్నారు? పనిగట్టుకొని చంద్రుణ్ణి చూసి ఎందుకు
నేరాలెంచుతున్నారు? ఎందుకర్రా యీ మాటలన్నీను? తిన్నగా మీరేమన్నా
చెప్పుకోదలచుకుంటే వెళ్ళి శ్రీవారికే విన్నవించుకో రాదా? ఎందుకీ పనులు అమ్మకు ఉత్సాహం కలిగించేలా మాట్లాడండర్రా.
ఆ చిలకలను చూడండి,
వాటి మానాన అవి ఉంటే వాటిని
బెదిరిస్తూ మాటలెందుకూ మాట్లాడటం? ఆ చల్లని పిల్లగాలిని పట్టుకొని నిందించటం
ఏమిటి మరీ అందంగా ఉంది. అదేం చేసిందీ? ఆ వసంతుడితో నువ్వెంతపోరా అంటూ ఆ
పంతాలు పలకటం ఏమిటీ? ఈడాబుసరి హడావుడులు అన్నీ ఎందుకమ్మా? శ్రీవారి
దగ్గరకే వెళ్ళి మీ నేర్పేదో చూపి నెమ్మదిగా సామవాక్యాలు పలికి
రప్పించరాదా? అందాకా మిగిలిన వాళ్ళు అమ్మకు ధైర్యోత్సాహాలు కలిగేలా మాట్లాడరాదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.